Sania Mirza : ఒంటరి తల్లిగా జీవించడం చాలా కష్టం: సానియా మీర్జా వ్యాఖ్యలు

ఒంటరి తల్లిగా జీవించడం కష్టం అని సానియా మీర్జా వ్యాఖ్యలు వైరల్. తన కుమారుడిని ఒంటరిగా పెంచుతున్నానని పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు.

Sania Mirza

విధాత, హైదరాబాద్ : ఒంటరి తల్లిగా జీవించడం చాలా కష్టం అని మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ పాడ్‌కాస్ట్‌లో ఫరా ఖాన్‌తో తన జీవిత విశేషాలను ఓపెన్ గా పంచుకున్నారు. పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడిపోయిన తర్వాత ఒంటరిగా కుమారుడిని పెంచుతున్న సానియా చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఫరా ఖాన్ హోస్ట్ చేసిన ‘సర్వింగ్ ఇట్ అప్ విత్ సానియా’ అనే పాడ్‌కాస్ట్‌లో వీరిద్దరూ స్నేహం, మాతృత్వం, ఒంటరిగా పిల్లల్ని పెంచడంలో ఎదురయ్యే సవాళ్లపై చర్చించారు. ఒంటరి తల్లిగా జీవించడం చాలా కష్టం. ప్రతి రోజు ఒక కొత్త సవాల్ ఎదురవుతుంది అని సానియా వెల్లడించారు. విడాకుల తర్వాత తన కుమారుడు ఇజాన్‌కి తల్లి, తండ్రి బాధ్యతలను తానె భరిస్తున్నానని చెప్పారు. విడాకుల ప్రభావం పిల్లలపై తప్పక ఉంటుందని వ్యాఖ్యానించారు. తల్లి, తండ్రి కలిసి ఉండడం పిల్లల కోసం ఉత్తమం. కానీ జీవిత పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు అని ఆమె చెప్పుకొచ్చారు.

గతంలో పానిక్ అటాక్ వచ్చినప్పుడు ఫరా అండగా నిలిచిందని ఈ ఇంటర్వ్యూలో సానియా వెల్లడించారు. కాగా సానియా ధైర్యాన్ని, బలాన్ని దర్శకురాలు ఫరా ఖాన్ ఈ సందర్బంగా ప్రశంసించారు. సానియా మీర్జా 2010లో షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకుంది. వీరికి 2018లో కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్ జన్మించాడు. గతేడాది ఆరంభంలో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే షోయబ్ మాలిక్ పాకిస్థానీ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సానియా కొడుకుతో కలిసి తన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.