మనుషుల సంబంధాల్లో రోజు రోజుకు వస్తున్న మార్పులకు కొదవ లేకుండా పోయింది. రోజుకో కొత్త రకం రిలేషన్స్, ఎమోషన్స్ మార్కెట్లోకి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కొత్త జంటల విషయంలో కొంత కాలంగా డింక్ లైఫ్ రిలేషన్ నడుస్తున్న విషయం తెలిసిందే.. దీనితో పాటు కొందరు జంటలు స్లీపింగ్ డైవర్స్ తీసుకుంటున్నారు. ఇదేంటనుకుంటున్నారా.. అదేనండీ భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసుకునే వారిపై పని వత్తిడి ఎలా ఉంటుందో తెలిసిందే.
ఆ పని వత్తిడిని తగ్గించుకునేందుకు సరైన నిద్ర అవసరం. సాధారణంగా ఏడు గంటల నుంచి ఎనిమిది గంటలు నిద్రిస్తే ఆరోగ్యంగా మాత్రమే ఉండటం కాకుండా పనితీరులో శ్రద్ధ వహించి ప్రొడక్టివిటీని పెంచవచ్చు. రాత్రి సమయంలో కొందరు త్వరగా పడుకుంటారు, మరి కొందరు అర్థరాత్రి వరకు మొబైల్ చూస్తూ, లేదా వారి పని చేసుకుంటూ ఉండిపోతారు. ఇది మాత్రమే కాకుండా జంటల్లో కొందరు గురక పెట్టడం, మాటి మాటికి వాష్ రూంకు వెళ్లడం వంటి అలవాట్లు ఉంటాయి. ఇలా చేయడం వల్ల భాగస్వామికి ప్రశాంతమైన నిద్ర దొరకడం కష్టం. ఇలా జరగకుండా గాఢమైన నిద్ర రావడం కోసం రాత్రిళ్లు ఆలు మగలు ఇద్దరు చెరో గదిలో పడుకుంటున్నారు. దీన్నే స్లీపింగ్ డైవర్స్ అంటున్నారు.
ఇలా చేయడం వల్ల కొన్ని లాభాలు ఉన్నప్పటికీ, నష్టాలు కూడా లేక పోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ట్రెండ్ ఎక్కువగా బాగా డబ్బు ఉన్న జంటల్లో ఉందని ఓ అధ్యయనంలో తేలింది. స్లీపింగ్ డైవర్స్ విధానం పాటిస్తున్న వారిలో 43శాతం మిలియనీర్ జంటలు ఉన్నారని సర్వేల్లో తెలిసింది.
1946 నుంచి 1964 మధ్య పుట్టిన వారిలో 22 శాతం, 1965 నుంచి 1980 మధ్యలో పుట్టిన వారిలో 33 శాతం, 1997 నుంచి 2012 మధ్య పుట్టిన వారిలో 28 శాతం మంది భాగస్వాముల నుంచి దూరంగా నిద్రిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే 2020లో కలిసి నిద్రించిన జంటల్లో ఆరుగురిలో ఒకరు స్లీప్ డైవర్స్ పాటిస్తున్నట్లు నేషనల్ బెడ్ ఫెడరేషన్ అధ్యయనంలో తెలిసింది.
స్లీపింగ్ డైవర్స్ విధానం మంచి నిద్రకు దోహద పడుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. బాగా నిద్రించే మొదడు తగినంత విశ్రాంతి తీసుకుంటుంది. దీంతో ఆలోచన శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. స్లీప్ డైవర్స్‌తో లాభాలు ఉన్నట్లే నష్టాలు కూడా ఉన్నాయి. భాగస్వామికి కొంత కాలం దూరంగా ఉంటే పర్లేదు కానీ, దీర్ఘకాలం ఇదే కొనసాగితే మాత్రం ప్రమాదమంటున్నారు. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి సంబంధాలు దెబ్బతింటాయి. అలాగే శారీరక సంబంధంపై కూడా ప్రభావం చూపూ ఛాన్స్ ఉంది. స్లీపింగ్ డైవర్స్ విధానం జంటల మధ్య విడాకులకు కూడా దారి తేసే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.
