Shambala Movie Review & Rating Telugu | Worth Watching or Not?
క్రిస్మస్ కానుకగా విడుదలై, టీజర్–ట్రైలర్‌లతోనే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచిన చిత్రం శంబాల మిస్టరీ, పురాణాలు, శాస్త్రవిజ్ఞానం అంశాలను మేళవిస్తూ దర్శకుడు యుగంధర్ ముని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కొంతకాలంగా సరైన విజయాన్ని అందుకోలేకపోయిన ఆది సాయికుమార్‌కు ఈ సినిమా ఒక కీలక ప్రయత్నం. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘శంబాల’ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.
చిత్రం: శంబాల
తారాగణం: ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్, శ్వాసిక విజయ్, మధునందన్, రవి వర్మ, మీసాల లక్ష్మన్, హర్ష వర్ధన్, ఇంద్రనీల్. శైలజ ప్రియ తదితరులు
సంగీతం: శ్రీచరణ్ పాకాల
కెమెరా: ప్రవీణ్
ఎడిటింగ్: శ్రవణ్ కటికనేని
నిర్మాతలు: మహీధర్ రెడ్డి, రాజశేఖర్
దర్శకత్వం: యుగంధర్ ముని
విడుదల: 24 డిసెంబర్ 2025
ఇంతకీ కథ ఎక్కడ మొదలవుతుంది.?
ఈ చిత్రం 1980ల నేపథ్యంతో సాగే ఒక మార్మిక కథనం. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన శంబాల అనే మారుమూల గ్రామంలో అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఓ ఉల్క పడుతుంది. ఆ వింత తర్వాత గ్రామంలో అనూహ్యమైన దుర్ఘటనలు మొదలవుతాయి. హత్యలు, ఆత్మహత్యలు, వింత ప్రవర్తనలు చోటుచేసుకోవడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతారు. దీనికి కారణం “బండ భూతం” అంటూ మూఢనమ్మకాలు రాజ్యమేలుతాయి.
ఈ రహస్యాలను ఛేదించేందుకు ప్రభుత్వం నుంచి జియో–సైంటిస్ట్ విక్రమ్ (ఆది సాయికుమార్) శంబాల గ్రామానికి వస్తాడు.కేవలం సైన్స్‌ను మాత్రమే నమ్మే నాస్తికుడైన విక్రమ్‌కు, గ్రామస్తుల విశ్వాసాలు–నమ్మకాల మధ్య తీవ్ర సంఘర్షణ ఎదురవుతుంది. అతడు వచ్చిన తర్వాత మరిన్ని సంఘటనలు జరగడంతో, ఊరి ప్రజలు అతడే శాపానికి కారణమని నమ్మడం కథను ఆసక్తికరంగా మలుస్తుంది. అసలు ఆ ఉల్క వెనుక ఉన్న నిజం ఏమిటి? శంబాల గ్రామ దేవత చరిత్ర ఏంటి? విక్రమ్ ఈ మిస్టరీని ఛేదించగలిగాడా? అన్నదే కథలోని ప్రధానాంశం.
మొదటి అర్థభాగంలో గ్రామ పరిచయం, వింత సంఘటనలతో ఉత్కంఠ నెమ్మదిగా పెరుగుతుంది. అయితే మధ్య భాగంలో కథనం కొంత నెమ్మదించినా, ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితీయార్థంలో కథ వేగం పుంజుకుని, ఫ్లాష్‌బ్యాక్ బయటపడటంతో మిస్టరీకి కారణాలు బయటపడతాయి. అయితే క్లైమాక్స్ ఇంకా బిగువుగా, బలంగా ఉంటే సినిమా స్థాయి మరింత పెరిగేదని అనిపిస్తుంది.
నటీనటులు & సాంకేతిక విభాగం పనితీరు
ఆది సాయికుమార్ ఈ చిత్రంలో విభిన్నంగా కనిపించి మెప్పించాడు. నాస్తిక శాస్త్రవేత్త పాత్రకు ఆయన నటనాతీవ్రత సినిమాకు ప్లస్ అయింది. పోరాటాలు, భావోద్వేగ సన్నివేశాల్లో మంచి ప్రదర్శన కనబరిచాడు.
అర్చన అయ్యర్ కీలక పాత్రలో పరవాలేదనిపించగా, రవి వర్మ, మీసాల లక్ష్మణ్ పాత్రలు భయాన్ని బాగా విస్తరించాయి. మధునందన్, శ్వాసిక విజయ్ తదితరులు తమ పాత్రల పరిధిలో న్యాయం చేశారు.
సాంకేతికంగా ఈ సినిమాకు నేపథ్య సంగీతమే ప్రధాన బలం. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం ఉత్కంఠను, భయాన్ని బాగా ఎలివేట్ చేసింది. కెమెరా పనితనం గ్రామీణ వాతావరణాన్ని సహజంగా చూపిస్తుంది. ఎడిటింగ్ ప్రథామార్థంలో ఇంకాస్త కఠినంగా ఉండాల్సింది. ఫ్లాష్‌బ్యాక్‌లో AI విజువల్స్ వాడకం కొంతమందికి ఎబ్బెట్టుగా అనిపించే అవకాశం ఉంది.
మొత్తంగా ‘శంబాల’ ఓ సంప్రదాయ భయానక సినిమా కాదు. మిస్టరీ, పురాణేతిహాసాలు, శాస్త్రీయ అంశాలను మేళవించి తీసిన ఒక విభిన్న ప్రయత్నం. బలమైన కథాంశమే అయినప్పటికీ, కథనం కొన్ని చోట్ల స్లో అవుతుంది. అయినప్పటికీ, ఈ చిత్రం ఒక మంచి, భిన్నమైన ప్రయత్నమే. ఆది సాయికుమార్ కెరీర్‌లో ఇది గమనించదగిన సినిమాగా నిలిచిపోతుంది.
విధాత రేటింగ్: ⭐⭐⭐ / 5
