ఉగాది అంటేనే గుర్తొచ్చేది నోరూరించే భ‌క్షాలు..! మ‌రి ఎలా త‌యారు చేసుకోవాలంటే..?

  • Publish Date - April 8, 2024 / 09:00 AM IST

ఉగాది పండుగ అంటేనే అంద‌రికీ గుర్తొచ్చేది నోరూరించే భ‌క్షాలు(పోలెలు). ఎన్ని వంటలున్నా వీటిని రుచి చూడ‌డం త‌ర‌త‌రాలుగా వ‌స్తున్న సాంప్ర‌దాయం. ఉగాది రోజున పొద్దున్నే భ‌క్షాల‌ను సిద్ధం చేస్తారు. ఈ భ‌క్షాల‌ను దేవుళ్ల‌కు నైవేద్యంగా స‌మ‌ర్పిస్తారు. ఆ త‌ర్వాత ఉగాది ప‌చ్చ‌డితో పాటు భ‌క్షాల‌ను తింటారు.

ఉగాది పండుగ అంటేనే అంద‌రికీ గుర్తొచ్చేది నోరూరించే భ‌క్షాలు(పోలెలు). ఎన్ని వంటలున్నా వీటిని రుచి చూడ‌డం త‌ర‌త‌రాలుగా వ‌స్తున్న సాంప్ర‌దాయం. ఉగాది రోజున పొద్దున్నే భ‌క్షాల‌ను సిద్ధం చేస్తారు. ఈ భ‌క్షాల‌ను దేవుళ్ల‌కు నైవేద్యంగా స‌మ‌ర్పిస్తారు. ఆ త‌ర్వాత ఉగాది ప‌చ్చ‌డితో పాటు భ‌క్షాల‌ను తింటారు. భ‌క్షాలు చిన్న పిల్ల‌ల నుంచి వృద్ధుల వ‌ర‌కు ఎవ‌రైనా తినొచ్చు. ఎందుకంటే అవి అంత టేస్టీగా ఉంటాయి.

భ‌క్షాల త‌యారీకి కావాల్సిన ప‌దార్థాలు ఇవే..

శ‌న‌గ‌ప‌ప్పు – రెండు క‌ప్పులు

బెల్లం తురుము – రెండు క‌ప్పులు

యాల‌కుల పొడి – రెండు టేబుల్ స్పూన్లు

మైదా పిండి – రెండు క‌ప్పులు

గోధుమ పిండి – మూడు టేబుల్ స్పూన్లు

నెయ్యి – అర‌కప్పు

ఉప్పు – చిటికెడు

భ‌క్షాల త‌యారీ విధానం ఇలా,,

ముందుగా శ‌న‌గ‌ప‌ప్పుని శుభ్రంగా క‌డిగి రెండు గంట‌ల పాటు నాన‌బెట్టాలి. నానిన‌ ప‌ప్పుని కుక్క‌ర్‌లో వేసి రెండు క‌ప్పుల నీళ్లు పోసి మూత‌పెట్టి మూడు విజిల్స్ వచ్చే వ‌ర‌కు ఉడ‌క‌నివ్వాలి. ఇంత‌కు మించి ఉడికించ‌కూడ‌దు. ఉడికిన త‌ర్వాత నీళ్లు తీసేసి ప‌ప్పుని ప‌క్క‌న పెట్టుకోవాలి. మైదాలో గోధుమ పిండి, టేబుల్ స్పూన్ నెయ్యి, క‌ప్పు నీళ్లు పోసి పిండిని ముద్ద‌లా క‌లుపుకోని ప‌క్క‌న పెట్టుకోవాలి.

శ‌న‌గ‌పప్పుని కూడా మెత్త‌గా రుబ్బుకోవాలి. ఒక పాత్ర‌లో బెల్లం తురుము, అర‌క‌ప్పు నీళ్లు పోసి స‌న్నని మంట‌ మీద ఉడికించాలి. మ‌ధ్య‌మ‌ధ్య‌లో క‌లియ తిప్పుతూ రుబ్బుకున్న శ‌న‌గ‌ప‌ప్పు, యాల‌కుల పొడి వేసి ప‌దినిమిషాలు పాటు ఉడికించాలి. ఉడికిన మిశ్ర‌మాన్ని నిమ్మ‌కాయ సైజు ప‌రిమాణంలో ఉండ‌లుగా చుట్టుకుని ప‌క్క‌న పెట్టుకోవాలి. ఇక మైదా పిండిని చ‌పాతీలా చేత్తో వ‌త్తుకోవాలి. శ‌న‌గ‌ప‌ప్పు ఉండ‌ని పెట్టి చపాతీ మొత్తం పూరీలా వ‌త్తుకోవాలి. పెనం మీద నెయ్యి వేసి రెండు వైపులా బంగారు వ‌ర్ణంలోకి మారే వ‌ర‌కు కాల్చితే భ‌క్షాలు రెడీ. ఇక వేడివేడి భ‌క్షాల‌ను తింటే టేస్టీ అదిరిపోతోంది. నెయ్యితో పూసిన భ‌క్షాల‌ను చిన్న‌పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తింటారు.

Latest News