Ugadi 2024 | తెలుగు సంవత్సరాది ఉగాది. ఈ ఏడాది ఈ నెల 9న ఉగాది పండుగ తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకోనున్నారు. పంచాంగం ప్రకారం.. ఉగాది నుంచే తెలుగు క్యాలెండర్ కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ప్రస్తుత శోభకృత్ నామ సంవత్సరం ఈ నెల 8వ తేదీతో ముగియనున్నది. ఏప్రిల్ 9 నుంచి క్రోధి నామ సంవత్సరం మొదలవనున్నది. అయితే, పంచాంగం ప్రకారం.. తెలుగు సంవత్సరానికి ఒక్కో పేరు తెలిసిందే. తెలుగు సంవత్సరంలో మొత్తం 60 ఉన్నాయి. ప్రభవతో మొదలై అక్షయతో ముగుస్తుంది. 60 సంవత్సరాల పూర్తయిన తర్వాత మళ్లీ మొదటి నుంచి ప్రారంభమవుతుంది. అయితే, తెలుగు సంవత్సరానికి ఒక్కో పేరు వెనుక ఓ కథ ఉన్నది. మొదటి రుతువు వసంతం అందరికీ తెలిసిందే. మొదటి నెల చైత్రమాసం. మొదటి తిథి పాడ్యమి. తెలుగు రాష్ట్రాలతో పాటు పలువురు జనవరి ఒకటి నుంచి కాకుండా ఉగాది నుంచి సంవత్సరం మొదలవుతుంది. చాంద్రమానం ప్రకారం పండగలు జరుపుకోవడం ఆనవాయితీ వస్తున్నది. ఇక తెలుగు సంవత్సరాల పేర్ల వెనుక కథ ప్రచారంలో ఉన్నది. తెలుగు సంవత్సరాలకు ఉన్న పేర్లు నారద మహర్షి పిల్లల పేర్లుగా పేర్కొంటున్నారు. ఒకనాడు నారద మహర్షి గర్వాన్ని తగ్గించేందుకు మహావిష్ణువు మాయ చేస్తాడు. ఆయనను స్త్రీగా మారుస్తాడు. స్త్రీ రూపంలోకి మారిన నారదుడు ఒక రాజును పెళ్లి చేసుకొని 60 మంది సంతానానికి జన్మనిస్తారు. అయితే, 60 మంది సంతానం ఓ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మహావిష్ణువు మాయను తొలగించి.. నీ పుత్రులు తెలుగు సంవత్సరాలుగా వర్ధిల్లుతారని వరమిచ్చినట్లుగా పండితులు చెప్పారు. నారద మహర్షి 60 మంది పిల్లల పేర్లనే సంవత్సరాల పేర్లను పిలుచుకుంటున్నామని.. ఈ పేర్లకు ఒక్కో అర్థం ఉంటుందని వివరించారు.
తెలుగు సంవత్సరాలు.. అర్థాలు ఇవే..
ప్రభవ : ప్రభవించునది అంటే పుట్టుక అని అర్థం. ఇందులో యజ్ఞాలు ఎక్కువగా జరుగుతాయి.
విభవ : వైభవంగా ఉండేది. సుఖంగా జీవనం ఉంటుంది.
శుక్ల : తెల్లనిదని అర్థం. నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక
ప్రమోద్యుత : ఆనందం. అందరికీ ఆనందాన్ని ఇస్తుంది.
ప్రజోత్పత్తి : ప్రజా సంతానం. అన్నింటిలోనూ అభివృద్ధి ఉంటుంది
అంగీరస : శరీర అంగాల్లోని ప్రాణశక్తి. ప్రాణదేవుడు అంగీరసుడు.
శ్రీముఖ : శుభమైన ముఖం అని అర్థం. వనరులు సమృద్ధిగా ఉంటాయి.
భావ : భావ రూపంలో ఉన్న నారాయణడని అర్థం. ఆయనే భావ నారాయణుడు. ఉన్నత భావాలు కలిగి ఉంటారు
యువ : బలానికి ప్రతీక. వర్షాలు కురిపించి పంటలు సమృద్ధిగా చేతికి అందుతాయి.
ధాత : ధాత అంటే బ్రహ్మ. రక్షించేవాడని అర్థం వస్తుంది. అనారోగ్య బాధలు తగ్గుతాయి.
ఈశ్వర : ఈశ్వరుడే పరమేశ్వరుడు. క్షేమం, ఆరోగ్యాన్ని సూచిస్తుంది.
బహుధాన్య : సుభిక్షంగా ఉండడం. దేశం సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని సూచిస్తుంది.
ప్రమాది : ప్రమాదం ఉన్నవాడని అర్థం. ప్రమాదాలుంటాయని భయపడాల్సిన అవసరంలేదు. వర్షాలు మధ్యస్థంగా ఉంటాయి.
విక్రమ : విక్రమం కలిగినవాడని అర్థం. పంటలు బాగా పండి రైతన్నలు సంతోషిస్తారు. విజయాలు సాధిస్తారు.
వృష : చర్మం అని అర్థం. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి.
చిత్రభాను : భానుడు అంటే సూర్యుడు. అద్భుతమైన ఫలితాలు పొందుతారు
స్వభాను : స్వయం ప్రకాశానికి గుర్తుగా ఉంటుంది. క్షేమం, ఆరోగ్యం లభిస్తుంది.
తారణ : తరింపజేయడం అంటే కష్టాలను గట్టెక్కించడం. మేఘాలు సరైన సమయంలో వర్షించి సమృద్ధిగా వర్షాలుంటాయి.
పార్థివ : పృథ్వీ సంబంధమైన.. గుర్రం అనే అర్థాలున్నాయి. భూమికున్నంత సహనం, పనిచేసేవాడని అర్థాలున్నాయి. ఐశ్వర్యం, సంపద పెరుగుతాయి.
వ్యయ : ఖర్చవడం. శుభాల కోసం ఖర్చులు చేస్తుంటారు. అతివృష్టి, అనవసర ఖర్చులుంటాయి.
సర్వజిత్తు : సర్వాన్ని జయించిందని అర్థం. సంతోషకరంగా చాలా వర్షాలు కురుస్తాయి.
సర్వదారి : సర్వాన్ని జనయించిందని అర్థం. సుభిక్షంగా ఉంటారు.
విరోధి : విరోధం కలిగినటువంటిది. వర్షాలు లేకుండా ఇబ్బందులు పడే సమయం.
వికృతి : వికృతమైనటవుంటిది. ఈ సమయం భయంకరంగా ఉంటుంది
ఖర : గాడిద, కాకి, ఓ రాక్షుడు, వాడి, వేడి, ఎండిన పోక అనే అర్థలున్నాయి. పరిస్థితులు సాధారణంగా ఉంటాయి.
నందన : కూరుతు, ఉద్యావనం, ఆనందం కలిగించేదని అర్థం. ప్రజలకు ఆనందం కలుగుతుంది.
విజయ : విశేషమైన విజయం కలిగినదని అర్థం. శత్రువులను జయిస్తారు.
జయ : జయాన్ని కలిగించేదని అర్థం. లాభాలు, విజయం సాధిస్తారు.
మన్మధ : మనసును మధించేది. జ్వరాది బాధలు తొలగిపోతాయి.
దుర్ముఖి : చెడుముఖం కలిగినదని అర్థం. ఇబ్బందులు ఉన్న క్షేమంగానే ఉంటారు.
హేవళంబి : సమ్మోహన పూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం. ప్రజలు సంతోషంగా ఉంటారు.
విళంబి : సాగదీయడం అని అర్థం. సుభిక్షంగా ఉంటారు.
వికారి : వికారం కలిగినది. ఇది అనారోగ్యాన్ని కలిగిస్తుంది. శత్రువులకు చాలా కోపం తెస్తుంది.
శార్వరి : రాత్రి అని అర్థం. పంటలు దిగుబడి తక్కువగా ఉంటుంది.
ఫ్లవ : తెప్ప, కప్ప, జువ్వి.. దాటించునది అనే అర్థాలున్నాయి.
శుభకృత : శుభాన్ని ఇచ్చేది. నీరు సమృద్ధిగా ఉంటుంది.
శోభకృత్ : శోభను కలిగించేది. శుభాలు కలిగిస్తుంది.
క్రోధి : క్రోధం కలిగి ఉన్నది అనర్థం. కోపం కలిగిస్తుంది.
విశ్వావసు : విశ్వాసానికి సంబంధించింది. ధనం సమృద్ధిగా ఉంటుంది.
పరాభవ : అవమానం అని అర్థం. ప్రజల పరాభవాలకు గురవుతారు.
ఫ్లవంగ : కోతి, కప్ప అనే అర్థాలున్నాయి. నీరు సమృద్ధిగా ఉంటుంది.
కీలక : పశువులను కట్టేందుకు వినియోగించేది. పంటలు బాగా పండుతాయి.
సౌమ్య : మృధుత్వం కలిగి ఉన్నదని అర్థం. శుభ ఫలితాలు అధికం ఉంటాయి.
సాధారణ : సామాన్యం అని అర్థం. సాధారణ పరిస్థితులు నెలకొంటాయి.
విరోధికృత్ : విరోధాలను కలిగించేదని అర్థం. ప్రజల్లో విరోధం ఏర్పడుతుంది.
పరీధావి : భయ కారకం. ప్రజల్లో భయం ఎక్కువగా ఉంటుంది.
ప్రమాదీచ : ప్రమాద కారకమని అర్థం. ప్రమాదాలు ఎక్కువ.
ఆనంద : ఆనందమయం. ఆనందంగా ఉంటారు.
రాక్షస : రాక్షసత్వం కలిగిందని అర్థం. కఠిన హృదయం కలిగి ఉంటారు.
నల : నల్ల అనే పదానికి రూపాంతరం. పంటలు బాగా పండుతాయి
పింగళ : నాడి, కోతి, పాము, ముంగీస. సామాన్య ఫలితాలు కలుగుతాయి.
కాళయుక్తి : కాలానికి తగిన యుక్తని అర్థం. కాలానికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి.
సిద్ధార్థి : కోర్కెలను సిద్ధించేదని అర్థం. కార్య సిద్ధి కలుగుతుంది.
రౌద్రి : రౌద్రంగా ఉంటుంది. ప్రజలకు చిన్నపాటి బాధలు ఉంటాయి.
దుర్మతి : దుష్ట బుద్ధి. వర్షాలు సామాన్యంగా ఉంటాయి.
దుందుభి : వరుణుడు అని అర్థం. క్షేమం, ధ్యానం.
రుధిరోద్గారి : రక్తాన్ని స్రవింపజేసేది. ప్రమాదాలు ఎక్కువ.
రక్తాక్షి : ఎర్రని కనులదని అర్థం. అశుభాలు కలుగుతాయి.
క్రోధన : కోవ స్వభావం కలది. విజయాలు సిద్ధిస్తాయి.
అక్షయ : నశించనిది. తరగని సంపద.