Site icon vidhaatha

Instant noodles | మేకింగ్‌ ఈజీ కదా అని ఇన్‌స్టంట్ నూడుల్స్‌కు అలవాటుపడ్డారా.. ప్రమాదం కొనితెచ్చుకున్నట్టే..!

Instant noodles : పిల్లల నుంచి పెద్దల దాకా దాదాపు అందరూ ఇష్టంగా తినే ఫాస్ట్ ఫుడ్స్‌లో ఇన్‌స్టంట్‌ నూడుల్స్ (Instant noodles) ఒకటి. ఇటీవలి కాలంలో ఇన్‌స్టంట్ నూడుల్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. సమయం లేక కొందరు, తయారు చేసుకోవడం ఈజీ అని మరికొందరు ఈ ఇన్‌స్టంట్ నూడుల్స్‌కు బాగా అలవాటు పడుతున్నారు. అయితే ఈ ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌ ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో ఆరోగ్యానికి మేలుచేసే పోషకాలు ఏవీ ఉండకపోగా, ఆరోగ్యానికి కీడుచేసే రసాయనాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.

ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో సోడియం (Sodium) కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అధిక సోడియం తీసుకోవడంవల్ల అవయవాలు దెబ్బతింటాయి. పైగా అధిక రక్తపోటు (High blood pressure), గుండె జబ్బులు (Heart disease), స్ట్రోక్ లాంటి సమస్యలు వస్తాయి. ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు, ఫైబర్ లాంటి ముఖ్యమైన పోషకాలేవీ ఉండవు. బదులుగా అధిక సంఖ్యలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు, అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి మీ శరీర బరువును అదుపుతప్పేలా చేస్తాయి.

ఇన్‌స్టెంట్ నూడుల్స్‌ను తరచూ తీసుకోవడంవల్ల పొట్టచుట్టూ కొవ్వు (Belly fat) భారీగా పేరుకుపోతుంది. బాడీ షేపవుట్ అవుతుంది. అలాగే ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌ను ప్రధానంగా మైదా నుంచి తయారు చేస్తారు. మైదా అనేది అధిక ప్రాసెస్ చేయబడిన తెల్లటి పిండి. మైదాలో డైటరీ ఫైబర్, అవసరమైన పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. మైదా తీసుకోవడంవల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. డయాబెటిస్, మెటబాలిక్ సిండ్రోమ్‌, ఊబకాయం లాంటి దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలు కూడా ఎక్కువవుతాయి.

Exit mobile version