Health Tips | అధిక బరువుతో ఆందోళనపడుతున్నారా.. ఈ చిట్కాలు మీ కోసమే..!

Health Tips : మ‌నిషి జీవనశైలి స‌మ‌స్యల్లో ఊబ‌కాయం కూడా ఒకటి. స‌మాజంలో చాలామంది ఊబ‌కాయంతో బాధ‌ప‌డుతున్నారు. ఊబ‌కాయంవ‌ల్ల హృద‌య సంబంధ స‌మ‌స్యలు, మధుమేహం‌, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన‌ప‌డే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి ఊబ‌కాయం స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే కొన్ని ఆహార నియ‌మాలు పాటించాలి. కొంతమంది బరువు తగ్గడం కోసం మెడిసిన్స్ వాడుతుంటారు. కానీ, వాటివ‌ల్ల స‌మ‌స్య పరిష్కారం కాక‌పోగా కొత్త సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

  • Publish Date - May 16, 2024 / 09:05 PM IST

Health Tips : మ‌నిషి జీవనశైలి స‌మ‌స్యల్లో ఊబ‌కాయం కూడా ఒకటి. స‌మాజంలో చాలామంది ఊబ‌కాయంతో బాధ‌ప‌డుతున్నారు. ఊబ‌కాయంవ‌ల్ల హృద‌య సంబంధ స‌మ‌స్యలు, మధుమేహం‌, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన‌ప‌డే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి ఊబ‌కాయం స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే కొన్ని ఆహార నియ‌మాలు పాటించాలి. కొంతమంది బరువు తగ్గడం కోసం మెడిసిన్స్ వాడుతుంటారు. కానీ, వాటివ‌ల్ల స‌మ‌స్య పరిష్కారం కాక‌పోగా కొత్త సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అందుకే మెడిసిన్స్ జోలికి వెళ్లకుండా రోజూ వ్యాయామం చేస్తూ కొవ్వులు ఎక్కువ‌గా ఉండే ఆహారాన్ని దూరం పెట్టాలి. అదేవిధంగా శరీరంలో పేరుకుపోయిన కొవ్వును త‌గ్గించే ఆహార ప‌దార్థాల‌ను క్రమం తప్పకుండా తీసుకోవాలి. మ‌రి కొవ్వును తగ్గించే ఆ ప‌దార్థాలేంటో చూద్దాం..

బరువు తగ్గే చిట్కాలు..

1. కోడి గుడ్లు

కోడి గుడ్లలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. వాటి ద్వారా శరీరానికి విటమిన్‌లు, ఖనిజాలు అందుతాయి. బరువు తగ్గాలనుకునేవారు గుడ్లను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే త్వర‌గా ఆకలి వేయ‌దు. తద్వారా బరువు పెరుగకుండా కాపాడుకోవచ్చని ఓ ప‌రిశోధ‌న‌లో తేలింది. ఊబకాయులు రోజూ కనీసం మూడు గుడ్లను అల్పాహారంగా తీసుకోవడంవల్ల వారి శరీర కొవ్వులో 16 శాతం వరకు తగ్గుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

2. గ్రీన్ టీ

అధిక‌ బరువు స‌మ‌స్యతో బాధ‌ప‌డే వారికి గ్రీన్ టీ మంచి ప‌రిష్కారం చూపుతుంది. గ్రీన్ టీలో EGCG అనే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. ఈ విష‌యం ఎన్నో పరిశోధనల్లో రుజువు చేయ‌బ‌డింది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్, ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ జర్నల్‌లో దీనికి సంబంధించిన పరిశోధన పత్రాలను ప్రచురించారు.

3. మాడ్పు కారం

ఎండు మిరపకాయలను వేయించి దంచుకుని కారంపొడి చేసుకుంటారు. దీన్నే మాడ్పు కారం అంటారు. ఎండు మిరపకాయల్లో కొవ్వును కరిగించే గుణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందులో క్యాప్సైసిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. దానివల్ల తృప్తిగా భోజనం చేసిన అనుభూతి కలుగుతుంది. అదేవిధంగా క్యాప్సైసిన్‌ వ‌ల్ల ఎక్కువ కేలరీలు తరగడమేగాక కొవ్వు కరుగుతుంది. ఆహారంలో మాడ్పు కారం పొడిని వాడటంవల్ల క్యాప్సైసిన్ శరీరానికి తగినంతగా అందుతుంది.

4. ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ శ‌రీరంలో పోగుప‌డ్డ ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తుంది. అదేవిధంగా శరీరానికి అవసరమైన HDL కొలెస్టరాల్‌ను పెంచుతుంది. ఆలివ్‌ ఆయిల్‌ శరీరంలో GLP-1 అనే హార్మోన్ విడుదలను కూడా ప్రేరేపిస్తుంది. ఆ హార్మోన్‌వ‌ల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆలివ్ నూనె జీవక్రియ రేటును పెంచుతుంది. ఆలివ్ నూనెతో వంటలు చేసుకోవచ్చు, లేదా సలాడ్‌లపై కొన్ని చుక్కలు వేసుకొని తీసుకోవచ్చు.

5. కాఫీ

శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును క‌రిగించే ల‌క్షణం కాఫీకి ఉంటుంది. కాఫీలో ఉండే కెఫిన్‌ జీవక్రియా రేటును పెంచుతుంది. దీంతో జీవక్రియలకు ఎక్కువ శక్తి అవసరమవుతుంది. ఇందుకు అవసరమయ్యే కేలరీల‌ కోసం శరీరం కొవ్వును కరిగిస్తుంది. అయితే కాఫీని అతిగా తీసుకోవ‌డం కూడా మంచిది కాదు. కొన్ని దుష్ప్రభావాలు ఎదుర‌య్యే ప్రమాదం ఉన్నది.

గమనిక : అయితే ఊబకాయ సమస్య తీవ్రంగా ఉన్నవారు మాత్రం సొంత చిట్కాల జోలికి వెళ్లకూడదు. నిపుణులైన డాక్టర్‌ల సూచ‌న మేర‌కు సరైన డైట్‌ను ఫాలో కావాలి.

Latest News