Blue Egg | కర్ణాటక( Karnataka )లోని దావణగెరె జిల్లాలోని నల్లూరు గ్రామానికి చెందిన సయ్యద్ నూర్ తన ఇంటి ఆవరణలోఓ గత కొన్నేండ్ల నుంచి నాటు కోళ్లను పెంచుతున్నాడు. ప్రస్తుతం ఆయన వద్ద పది నాటు కోళ్లు ఉండగా, అందులో ఒక కోడి.. వింత గుడ్డును పెట్టింది. తెలుపు, గోధుమ వర్ణంలో కాకుండా.. భిన్నంగా నీలం రంగులో గుడ్డు( Blue Egg ) పెట్టింది ఆ నాటు కోడి. ఈ నాటుకోడి గుడ్డును చూసి సయ్యద్ షాకయ్యాడు.
చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఆ కోడిగుడ్డును సయ్యద్ భద్రంగా దాచిపెట్టాడు. కానీ విషయం స్థానికులకు తెలియడంతో.. ఆ గుడ్డును చూసేందుకు సయ్యద్ ఇంటికి బారులు తీరారు. నీలం రంగులో ఉన్న కోడిగుడ్డును స్థానికులు తమ కెమెరాల్లో బంధించారు.
అయితే రెండేండ్ల క్రితం ఈ నాటుకోడిని కొనుగోలు చేసినట్లు యజమాని సయ్యద్ పేర్కొన్నాడు. అప్పట్నుంచి మొన్నటి వరకు తెలుపు రంగులోనే గుడ్లు పెట్టేదని తెలిపాడు. కానీ ఉన్నట్టుండి నీలం రంగులో కోడి గుడ్డు పెట్టేసరికి తాను కూడా షాక్ అయ్యానని సయ్యద్ చెప్పాడు.
ఈ నీలం రంగు కోడిగుడ్డును జంతు సంరక్షణ అధికారులు కూడా పరిశీలించారు. కొన్నిసార్లు కోళ్లు లేత ఆకుపచ్చ రంగులో గుడ్లను పెడుతుంటాయని ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ తెలిపారు. అయితే ఇలా నీలం రంగులో ఉండటం మాత్రం చాలా అరుదని ఆయన తెలిపారు. కోడి క్లోమంలో ఉండే బిలివర్డిన్ అనే వర్ణద్రవ్యం కారణంగా ఈ నీలం రంగు వచ్చి ఉండొచ్చని వెల్లడించారు. కోళ్లలో జన్యుపరమైన సమస్యల వల్ల కొన్నిసార్లు ఇలా వింత రంగుల్లో గుడ్లు పెడుతుంటాయని చెప్పారు. అయితే నాణ్యత, పోషక విలువల్లో సాధారణ గుడ్లకు, వీటికి ఏ తేడా ఉండదని జంతు సంరక్షణ అధికారులు వివరించారు.