Site icon vidhaatha

health and digestion | ఆహారాన్ని నెమ్మదిగానే ఎందుకు తినాలి?

Health and Digestion | ఉదయం బ్రేక్ ఫాస్ట్ అయినా, మధ్యాహ్నం లంచ్ అయినా, చివరికి ఏ ఫంక్షన్ లోనో చేసే డిన్నర్ అయినా… హడావుడిగా, వేగంగా తినేయడం మనకు అలవాటయిపోయింది. కానీ అలా ఫాస్ట్ గా తినడం వల్ల తిన్న తృప్తే కాదు.. ఆరోగ్యమూ లేకుండా పోతుందంటున్నారు నిపుణులు. మరి నెమ్మదిగా తినడం వల్ల ఎలాంటి లాభాలుంటాయో చూద్దామా…

జీర్ణక్రియ మెరుగవుతుంది

నెమ్మదిగా తినడం వల్ల ఆహారం చాలా సులువుగా జీర్ణమవుతుంది. నెమ్మదిగా తింటున్నప్పుడు శరీరానికి అవసరమైన అమైనో ఆసిడ్లు, ఎంజైములు చక్కగా విడుదల అవుతాయి. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, రక్తప్రసరణ బాగా జరిగేలా చూస్తాయి. యాంటి ఆక్సిడెంట్స్ ను పెంచుతాయి.

గట్ మెటబాలిజమ్

నెమ్మదిగా తినేటపుడు నాడీ వ్యవస్థ నుంచి గట్ మెటబాలిజాన్ని ప్రేరేపించే న్యూరోట్రాన్స్ మిటర్లు విడుదలవుతాయి. నెమ్మదిగా తినడం వల్ల మెదడు, జీర్ణ వ్యవస్థల మధ్య సమన్వయం బావుండి, తిన్నది బాగా జీర్ణం అవుతుంది. దీనివల్ల గట్ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.

నోటిలో ఉన్నప్పుడే జీర్ణ ప్రక్రియ

మన జీర్ణ వ్యవస్థ నోటితోనే ప్రారంభమవుతుంది. నెమ్మదిగా నమలడం ద్వారా ఆహారం సరిగ్గా ముక్కలు అవుతుంది. నోటిలోని లాలాజలంలో ఉండే అమైలేజ్ ఎంజైమ్ జీర్ణ వ్యవస్థలో కీలకపాత్ర వహిస్తుంది. ఇక్కడే మొదటి దశ జీర్ణ ప్రక్రియ జరుగుతుంది. అందుకే బాగా నమిలి తినడం వల్ల సూక్ష్మ పోషకాలను శరీరం గ్రహించగలుగుతుంది. చిన్నపేగుపై భారం తగ్గి, పోషకాల శోషణ సమర్థవంతంగా జరుగుతుంది.  దీనివల్ల ఇటు తగినంత శక్తి, ఆరోగ్యం రెండూ మెరుగుపడుతాయి.

గ్యాస్ సమస్యలు తగ్గుతాయి

వేగంగా తింటున్నప్పుడు పొట్టలోకి గాలి చేరే అవకాశం ఎక్కువ. ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడం వల్ల ఇలా వాయువు చేరే అవకాశం తగ్గుతుంది. తద్వారా కడుపుబ్బరం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. తక్కువ వేగంతో తినడం వల్ల అసిడిటీ, జీఈఆర్ డీ సమస్యలు తగ్గుతాయి.

ఎక్కువ తినకుండా..

మెదడు మనం తిన్నట్టు గుర్తించాలంటే కొంత సమయం పడుతుంది. నెమ్మదిగా తింటే మెదడుకు ఆ సిగ్నల్ సమయానికి వెళుతుంది. దాంతో ఎక్కువ తినకుండా, తక్కువ సమయంలోనే తిన్న తృప్తి, అనుభూతి కలుగుతాయి.

బరువు తగ్గడంలో..

తక్కువ మోతాదులో ఎక్కువ సమయం తినడం వల్ల తక్కువ కేలరీలను తీసుకుంటాం. గబగబా తిన్నప్పుడు ఎంత తింటున్నామో కూడా తెలియకుండా ఎక్కువ తినేస్తాం. అందుకే నెమ్మదిగా తినడాన్ని అలవాటు చేసుకుంటే సులువుగా బరువు తగ్గవచ్చు.

తగ్గే షుగర్ లెవల్స్

నెమ్మదిగా తినే అలవాటు గ్లూకోజ్ పెరగడాన్ని నియంత్రించి, మేటబాలిక్ డిసార్డర్స్, డయాబెటిస్‌ని కంట్రోల్ చేస్తుంది.

 

– డాక్టర్ వేదాల రామకృష్ణ

 

 

Exit mobile version