Nuvvula Laddu | పిల్ల‌ల‌కు నువ్వుల ల‌డ్డూ మంచిది..! ఇంట్లోనే ఇలా త‌యారు చేసుకోండి..!!

  • Publish Date - April 11, 2024 / 08:14 AM IST

Nuvvula Laddu | నువ్వులు శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఎదిగే పిల్ల‌ల‌కు నువ్వులు చాలా మంచిది. నువ్వుల‌ను పిల్ల‌ల‌కు తినిపించ‌డం వ‌ల్ల శారీర‌కంగా, మానసికంగా ధృడంగా త‌యార‌వుతారు. అమ్మాయిల‌కు రుతుస్రావ స‌మ‌స్య‌లు కూడా ప‌రిష్క‌రమ‌వుతాయి. కాబ‌ట్టి నువ్వుల లడ్డూను ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌డం బెట‌ర్. మ‌రి ఆ నువ్వుల ల‌డ్డూను ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం..

నువ్వుల ల‌డ్డూ త‌యారీకి కావాల్సిన ప‌దార్థాలు..
1 కప్పు – నువ్వులు
1/2 కప్పు – కొబ్బరి పొడి
1 కప్పు – తురిమిన బెల్లం
చిటికెడు – యాలకుల పొడి
1/4 కప్పు – నెయ్యి

నువ్వుల లడ్డూ తయారీ విధానం :

ముందుగా ఒక పాత్ర‌ను తీసుకుని నువ్వుల‌ను బంగారు గోధుమ రంగులోకి వ‌చ్చే వ‌ర‌కు వేయించాలి. ఆ త‌ర్వాత నువ్వుల‌ను చ‌ల్లార్చుకోవాలి. కొబ్బ‌రి పొడిని కూడా వేయించి ప‌క్క‌న పెట్టుకోవాలి. అదే పాత్ర‌లో నెయ్యి వేసి క‌రిగించాలి. ఆ త‌ర్వాత ఆ నెయ్యికి తురిమిన బెల్లం క‌ల‌పాలి. బెల్లం పాకంగా మారిన త‌ర్వాత అందులో నువ్వులు, కొబ్బ‌రి పొడి, యాల‌కుల పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. అనంతరం ఒక ప్లేట్​ తీసుకొని దానికి కాస్త నెయ్యి రాసి ఆ మిశ్రమాన్ని అందులోకి తీసుకోవాలి. అది కాస్త చల్లారాక చేతికి నెయ్యి రాసుకుని లడ్డూల్లా చుట్టుకోవాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. మిశ్రమం ఎక్కువగా చల్లారకుండా చూసుకోవాలి. అంతే.. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ నువ్వుల లడ్డూలు రెడీ!
ఇక వీటిని మీ పిల్లలకు కొన్ని నట్స్​తో సర్వ్ చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు. కేవలం పిల్లలే కాదు ఎవరూ తిన్నా ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

నువ్వుల ల‌డ్డూ వ‌ల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఇవే..

నువ్వుల్లో కాల్షియం, ఐర‌న్, మెగ్నీషియం, ఫాస్ప‌ర‌స్ వంటి మూల‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి ఎదుగుతున్న పిల్ల‌ల్లో బ‌ల‌మైన ఎముక‌ల అభివృద్ధి తోడ్పాటును అందిస్తాయి. మెద‌డు అభివృద్ధియి, గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి నువ్వులు. నువ్వుల్లో ఉండే ప్రోటీన్లు కండ‌రాల అభివృద్ధికి స‌హ‌క‌రిస్తాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే నువ్వులు.. పిల్లల్లో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా బలమైన రోగనిరోధక శక్తిని ప్రోత్సహిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Latest News