Site icon vidhaatha

Health tips | మీకు ఫ్యాటీ లివర్‌ సమస్య ఉందా.. అయితే ఏవి తినొద్దో.. ఏవి తినాలో తెలుసా..!

Health tips : ప్రస్తుతం ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో ఫ్యాటీ లివర్ కూడా ఒకటి. ఈ ఫ్యాటీ లివర్‌ సమస్యతో బాధపడే వారు సరైన ఆహార నియమాలు పాటించకపోతే తీవ్రత మరింత ముదిరే ప్రమాదం ఉంది. కాబట్టి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే ఫ్యాటీ లివర్‌ సమస్య పెరగకుండా ఉంటుంది..? ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే సమస్య మరింత ముదురుతుంది..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

తినాల్సినవి..

వెల్లుల్లి

ఫ్యాటీ లివర్‌ సమస్యపై చేసిన ఆనేక పరిశోధనల ప్రకారం.. ఈ వ్యాధితో బాధపడుతున్న వారు ఆ సమస్య నుంచి బయట పడటానికి వెల్లుల్లి చాలాబాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వెల్లుల్లిలో కొవ్వును తగ్గించగల శక్తితోపాటు ఆరోగ్యానికి మేలు చేసే చాలా పోషకాలు ఉన్నాయి.

గ్రీన్‌ టీ

యాంటీ ఆక్సిడెంట్లను సమృద్ధిగా కలిగి ఉన్న గ్రీన్ టీ కూడా ఫ్యాటీ లివర్‌కు చెక్ పెట్టడంలో మెరుగ్గా పని చేస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు కణాలను రిపేర్ చేయడంతో పాటు బరువు తగ్గడంలో తోడ్పడుతాయి. అదేవిధంగా మన శరీరంలోని చెడు కొలెస్టరాల్‌ను, ఫ్యాటీ లివర్‌ని తగ్గించడంలో కూడా ఇవి కీలకపాత్ర పోషిస్తాయి.

అవకాడో

ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్న వారికి అవకాడో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ అవకాడోలోని పోషకాలు ఫ్యాటీ లివర్‌ సమస్యను తగ్గించి కాలేయాన్ని ఎంతో సురక్షితంగా ఉంచడంతోపాటు బరువు తగ్గడానికి దోహదపడుతుంది.

తినకూడనివి..

పాస్తా, ఫ్రైడ్‌ రైస్‌, వైట్‌ బ్రెడ్‌

ఫ్యాటీ లివర్‌ సమస్య ఉన్నవాళ్లు పాస్తా, ఫ్రైడ్ రైస్, వైట్ బ్రెడ్ లాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్థాల్లో ఫైబర్ తక్కువగా ఉంటుంది. వీటిని తినడంవల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ ఈజీగా పెరుగుతాయి. చక్కెరలు పెరిగినప్పుడు కాలేయంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. దాంతో ఫ్యాటీ లివర్ సమస్య మరింత తీవ్రతరం అవుతుంది.

చాక్లెట్, లడ్డూ, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్‌

అదేవిధంగా చక్కెరలు ఎక్కువగా ఉండే చాక్లెట్, లడ్డూ, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్ లాంటి పదార్థాలు కూడా ఫ్యాటీ లివర్‌ సమస్య ఉన్నవారికి ప్రమాదకరం. వాటితో కాలేయంలో చక్కెరలు చేరి ఫ్యాటీ లివర్‌ సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.

Exit mobile version