Health tips | మీలో ఈ లక్షణాలున్నాయా.. మధుమేహానికి సంకేతాలు.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..!

  • Publish Date - April 13, 2024 / 11:29 AM IST

Health tips : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మధుమేహం (Diabetes), అధిక రక్తపోటు (High blood pressur) లాంటి దీర్ఘకాలిక వ్యాధులు వేగంగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా మధుమేహం అత్యంత వేగంగా వ్యాపిస్తున్నది. మన దేశంలోనూ డయాబెటిస్‌ బారిన ప‌డుతున్న వారి సంఖ్య అంతకంతకే పెరుగుతున్నది. అయితే కొత్తగా ఆ వ్యాధి బారిన పడుతున్న వారిలో చాలామంది త‌మకు డయాబెటిస్ ఉందన్న విషయాన్ని త్వరగా గుర్తించ‌లేక‌పోతున్నారు. దాంతో వ్యాధి ముదిరి ముప్పు పెరిగిపోతున్నది. అందుకే డ‌యాబెటిస్‌ను ముందే గుర్తించడం చాలా ముఖ్యం. కాబట్టి మధుమేహం మొదలైతే మ‌న‌లో ఎలాంటి ల‌క్షణాలు క‌నిపిస్తాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. మరి ఆ లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం…

మధుమేహానికి సంకేతాలు..

డయాబెటిస్ వచ్చే ముందు మనలో కనిపించే లక్షణాలను ప్రీడయాబెటిస్‌ సింప్టమ్స్‌ (Prediabetes symptoms) అంటారు. ఈ ప్రీడయాబెటిస్‌ సింప్టమ్స్‌ కింది పేర్కొన్న విధంగా ఉంటాయి. అయితే కొంతమందిలో మాత్రమే కింద పేర్కొన్న వాటిలోని అన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. మరి కొందరిలో మాత్రం వీటిలో కొన్ని రకాల లక్షణాలు మాత్రమే బయటపడుతాయి. అసలు లక్షణాలేంటో చూద్దాం..

1. మధుమేహం వచ్చే ముందు కొందరిలో జుట్టు రాలుతుంది. అయితే జుట్టు రాలిందంటే కచ్చితంగా మధుమేహం ఉన్నట్లు కాదు. సంబంధిత పరీక్షలు చేయించుకుంటే ఈ విషయంలో కచ్చితత్వం వస్తుంది.

2. డయాబెటిస్‌ బారిన పడిన కొత్తలో కొందరిలో అలసట పెరుగుతుంది. రోజంతా అలసట‌గా ఉంటుంది. పని చేసినా, ఏ పని చేయకపోయినా అలసటగా అనిపిస్తుంది.

3. కొందరికి మధుమేహం సోకితే చర్మంపై మచ్చలు వస్తుంటాయి. ఇలా చర్మంపై మచ్చలు కనిపిస్తే షుగర్‌ సంబంధ వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

4. ఇంకా కొంత మందిలో మధుమేహం బారిన పడినప్పుడు తరచూ మూత్రం వస్తుంది. మూత్రానికి వెళ్లినా కొద్ది దాహం వేస్తుంది. నీళ్లు తాగినా కొద్ది యూరిన్‌కు వెళ్లాల్సి వస్తుంది.

5. కొంత‌ మందిలో పై లక్షణాలతోపాటే అదనంగా తరచూ తలనొప్పి వస్తుంది. చేతులు, కాళ్లు తిమ్మిర్లు పడుతాయి.

గమనిక : పై ల‌క్షణాల్లో ఏది క‌నిపించినా వెంట‌నే షుగ‌ర్ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Latest News