Health tips : పల్లెటూళ్లలో పొలాలు, చేలల్లో రకరకాల మొక్కలు పెరుగుతుంటాయి. వాటిలో కొన్ని పిచ్చి మొక్కలైతే, మరికొన్ని ఔషధ మొక్కలు ఉంటాయి. ఈ మొక్కలలో తెల్ల గలిజేరు మొక్క ఒకటి. ఈ తెల్ల గలిజేరు మొక్కలో పుట్టెడు ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేద నిపుణులు ఈ తెల్ల గలిజేరు మొక్కని ఔషధ గనిగా చెబుతారు. ఆయుర్వేదంలో ఈ మొక్కకు పునర్నవ అని పేరు. కొన్ని ప్రాంతాల్లో దీన్ని గుంట గలిజేరు అంటారు. అయితే మన భారతీయ ఆయుర్వేద శాస్త్రంలో ఈ మొక్కలను ఎన్నో రకాలుగా వాడతారు. ఇది ఎన్నో రకాల వ్యాధులకు కూడా దివ్యౌషధంగా పని చేస్తుంది. ఈ మొక్క ఔషధ ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- ఈ గలిజేరు మొక్కలు రెండు రకాలు ఉన్నాయి. తెల్ల పూలు పూసే దాన్ని తెల్ల గలిజేరు మొక్క అని, ఎర్ర పూలు పూసే దాన్ని ఎర్ర గలిజేరు మొక్క అని అంటారు. ఈ మొక్క నేల మీద పాకుతుంది. దీని ఆకులు గుండ్రంగా ఉంటాయి. ఈ రెండు మొక్కల ఔషధ గుణాలు ఒకేలా ఉన్నా తెల్ల గలిజేరు మొక్క ఎంతో మంచిదని అంటుంటారు. దీని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రతి కణానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చి పునరుజ్జీవితం చేయగల శక్తి ఉంది. అందుకే దీన్ని పునర్నవ అని పిలుస్తారు.
- దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే దీనిలోని విటమిన్ సి, డిలు ఇన్ఫెక్షన్లను నియంత్రించడంలో ఎంతో బాగా పనిచేస్తాయి. దీనిలో కాల్షియం అనేది అధికంగా ఉంటుంది. అలాగే కిడ్నీ సమస్యలకు దివ్యౌషధంగా కూడా పనిచేస్తుంది. ఈ తెల్ల గలిజేరు ఆకులను ఒక పిడికెడు తీసుకొని వాటిని శుభ్రంగా క్లీన్ చేసి పావు లీటర్ మంచి నీళ్లలో వేసి మరిగించుకోవాలి. తర్వాత వాటిని చల్లార్చుకొని వడకట్టాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం లేవగానే పరిగడుపున ఒక గ్లాసు తీసుకుంటే కిడ్నీలు క్లీన్ అవ్వటంతోపాటు మూత్రనాళ సమస్యల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది.
- ఇలా 21 రోజులపాటు రోజుకు గ్లాసు చొప్పున గుంట గలిజేరు మిశ్రమానని తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ మిశ్రమం తీసుకున్న తర్వాత ఒక అరగంటసేపు ఏం తినకూడదని అంటున్నారు. ఈ తెల్ల గలిజేరు ఆకులో మాత్రమే కాదు.. కాండం, వేరుతో సహా అంతటా ఔషధ గుణాలను కలిగి ఉంది. ఈ ఆకులను తరచూ తీసుకోవడంవల్ల రేచీకటి, మూత్రనాళ దోషాలు, కఫం లాంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
- అదేవిధంగా అధిక బరువు, లివర్ వాపు, కామెర్లు, మధుమేహం, వరిబీజం, వాతం, శ్వాసకు సంబంధించిన సమస్యలను కూడా ఈ ఆకు దూరం చేస్తుంది. అలాగే రక్త శుద్ధి, కీళ్ళ నొప్పులు, బహిష్టి సమస్యలు, అన్ని రకాల జ్వరాలను నియంత్రించడంలో కూడా ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ తెల్ల గలిజేరు మొక్క ఆకులను తీసుకొని వాటిని మెత్తగా నూరి ముఖానికి రాసుకుంటే ముఖం మీద మచ్చలు తగ్గిపోతాయి. ఈ గలిజేరు ఆకులను మెత్తగా నూరిన తర్వాత దాని నుంచి రసాన్ని తీసి, దానికి సమానంగా నువ్వుల నూనె కలుపుకొని నూనె మిగిలే వరకు సన్న సెగపై కాచుకోవాలి.
- ఈ నూనెను ఒంటి నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్న చోట మర్ధన చేయడంవల్ల ఆ నొప్పులు తొందరగా తగ్గుతాయి. ఈ మొక్క శరీరాన్ని డిటాక్సిఫై చేసేందుకు కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది.