Site icon vidhaatha

Temparature | వసంతం కనుమరుగు, ఎండాకాలంలా శీతాకాలం.. ఉత్తర భారత్‌లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

న్యూఢిల్లీ : ఉత్తర భారతదేశంలో 1970 నుంచి శీతాకాలం క్రమంగా ఎండా కాలంగా మారుతూ వస్తున్నదని అమెరికన్‌ శాస్త్రజ్ఞుల బృందం ‘క్లైమేట్‌ సెంట్రల్‌’ హెచ్చరించింది. ఈ బృందం 1970 నుంచి డిసెంబర్‌-ఫిబ్రవరి మధ్య కాలంలో ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతల తీరుతెన్నులను విశ్లేషణ చేసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో జనవరి నెలలో ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు ఉన్నా ఫిబ్రవరిలో మాత్రం సగటుకు మించి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని గుర్తించింది.

మార్చిలో ఉండాల్సినంత ఉష్ణోగ్రతలు ఫిబ్రవరిలోనే నమోదవుతున్నాయని ‘క్లైమేట్‌ సెంట్రల్‌’ విశ్లేషణలో తేలింది. ఇక రాజస్థాన్‌ రాష్ట్రంలోనైతే ఫిబ్రవరి సగటు ఉష్ణోగ్రత జనవరి ఉష్ణోగ్రత కన్నా 2.6 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతోంది. ఉత్తరాన లఢఖ్‌, జమ్మూ-కశ్మీర్‌, ఉత్తరాఖండ్‌లతో సహా మొత్తం తొమ్మిది రాష్ట్రాలలో జనవరి, ఫిబ్రవరి నెలల మధ్య ఉష్ణోగ్రతల్లో తేడా 2 డిగ్రీలు కనిపిస్తోంది.

దీన్నిబట్టి పలు ఉత్తరాది రాష్ట్రాల్లో వసంతం అదృశ్యమైనట్లే భావించాల్సి వస్తోంది. దక్షిణ భారత రాష్ట్రాల్లోనూ డిసెంబర్‌-ఫిబ్రవరి మధ్య కాలంలో సగటు ఉష్ణోగ్రత పెరుగుతోంది. శిలాజ ఇంధనాల వాడకం వల్ల కర్బన ఉద్గారాలు పెరుగుతున్నాయి. దాంతో 1850 నుంచి భూగోళ సగటు ఉష్ణోగ్రత 1.3 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగింది. ఇంతవరకు నమోదైన వాతావరణ గణాంకాల ప్రకారం అత్యధిక ఉష్ణ సంవత్సరంగా 2023 రికార్డులకెక్కింది.

2030 కల్లా కర్బన ఉద్గారాలను 43 శాతం తగ్గించకపోతే భూగోళం నిప్పుల కొలిమిలా మారుతుందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాలు కాప్‌ సదస్సుల పేరుతో ఏడాదికోసారి సమావేశాలు నిర్వహించి కర్బన ఉద్గారాల తగ్గింపుపై గప్పాలు కొడుతున్నా ఆచరణలో మాత్రం అది సాధ్యం కావడంలేదు. పైగా కర్బన ఉద్గారాల విడుదలలో అమెరికా, యూరప్‌ దేశాలే ముందు వరుసలో ఉన్నాయి.

Exit mobile version