Viral Fevers | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్( Hyderabad ) నగరంలో గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వర్షాలకు హైదరాబాద్ వ్యాప్తంగా వాతావరణం( Weather ) మారిపోయింది. దీంతో నగరం నలుమూలల వైరల్ ఫీవర్( Viral Fevers ) కేసులు అమాంతం పెరిగిపోయాయి. హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లోనూ జ్వర కేసులు పెరిగినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
వైరల్ ఫీవర్ కేసుల పెరుగుదల కారణంగా ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులు రోగులతో నిండిపోయాయి. బస్తీ దవాఖానాలకు కూడా రోగులు బారులు తీరారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అప్పుడే ఈ రోగాల నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు. చాలా మంది విటమిన్ డీ లోపంతో బాధపడుతున్నట్లు తేలిందని పేర్కొంటున్నారు. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుదలకు విటమిన్ డీ ఎంతో ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు.
అయితే ఈ సీజన్‌లో వచ్చే వ్యాధులను అరికట్టేందుకు ఈ జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెబుతున్నారు. బయటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని, ఇంట్లోనే వేడి వేడి ఆహార పదార్థాలను తినాలని సూచిస్తున్నారు. ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటిస్తే రోగాలు దరిచేరవని సూచిస్తున్నారు.
జాండిస్, టైఫాయిడ్, గ్యాస్ట్రో సమస్యల నుంచి తప్పించుకునేందుకు..
– ఫిల్టర్ నీళ్లను తాగాలి. సాధ్యమైనంత వరకు గోరు వెచ్చని నీటిని తాగితే మంచిది. బయట దొరికే నీటిని తీసుకోకపోవడమే మంచిది.
– తరుచుగా చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ఆహారం తినే ముందు, తిన్న తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి. వాష్‌రూమ్‌కు వెళ్లొచ్చిన తర్వాత కూడా కాళ్లు, చేతులు సబ్బుతో కడగాలి.
– హ్యాండ్ శానిటైజర్ ఉపయోగిస్తూ ఉండాలి.
– బయటి ఫుడ్‌కు దూరంగా ఉండాలి. చాట్స్ తినకపోవడం మంచిది. ఫాస్ట్ ఫుడ్‌ను కూడా దూరంగా ఉంచాలి. బయట దొరికే పండ్ల రసాలు తీసుకోకపోవడం మంచిది.
– ఇంట్లో ఎప్పటికప్పుడు వండే ఆహార పదార్థాలను తీసుకోవడం బెటర్.
మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా నివారణకు..
– ఇంట్లో దోమ తెరలు ఉపయోగించాలి. వీలైనంత వరకు కిటీకీలను మూసి ఉంచాలి.
– పడక గదితో పాటు పిల్లలు నిద్రించే ప్రాంతాలను దోమ తెరలతో కప్పి ఉంచాలి. ఇక పరుపులను శుభ్రంగా ఉంచుకోవాలి.
– కాళ్లు, చేతులను పూర్తిగా కప్పి ఉంచే వస్త్రాలను ధరించాలి. చిన్న పిల్లల విషయంలో ఈ జాగ్రత్త తప్పనిసరిగా పాటించాలి.
-సెప్టిక్ ట్యాంక్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. వాటిని కవర్ చేసే విధంగా చర్యలు తీసుకుంటే మంచిది.
వైరల్ ఇన్‌ఫెక్షన్స్ నుంచి బయటపడేందుకు..
– ఇతరులతో చేతులు కలపకూడదు.. ఆహార పదార్థాలను, నీళ్లను, బట్టలను షేర్ చేసుకోవద్దు.
– వైరల్ ఇన్‌ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండేందుకు నిరంతరం చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
– దగ్గు వచ్చినప్పుడు మూతికి అడ్డంగా బట్ట పెట్టుకోవడం మంచిది.
– జ్వరం తీవ్రంగా ఉంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది.