Cornelia Sorabji | భార‌తీయ తొలి మ‌హిళా న్యాయ‌వాది ఎవ‌రో తెలుసా..?

  • Publish Date - April 9, 2024 / 08:13 PM IST

Cornelia Sorabji| భారతదేశంలో మొట్టమొదటి మహిళా న్యాయవాది కార్నెలియా సొరాబ్జీ. విదేశాల్లో చదువుకున్న మొదటి భారతీయ జాతీయురాలు, బాంబే యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ చేసిన మొదటి మహిళ. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో లా చదివిన మొదటి మహిళ కూడా కార్నెలియా సోరాబ్జీనే. భారతదేశం, బ్రిటన్‌లో న్యాయవాద వృత్తిని అభ్యసించిన మొదటి మహిళా భారతీయురాలిగా ఆమె చ‌రిత్ర సృష్టించారు.

కార్నెలియా సొరాబ్జీ ఎవ‌రు..?

1866, న‌వంబ‌ర్ 15న నాసిక్‌లోని పార్సీ కుటుంబంలో ఆమె జ‌న్మించారు. సొరాబ్జీ పేరెంట్స్ సామాజిక‌సేవ చేస్తుండేవారు. త‌న త‌ల్లిదండ్రులు ఇద్ద‌రూ కూడా సామాజిక కార్య‌క్ర‌మాల్లో చురుకుగా పాల్గొన‌డంతో ఆ ప్ర‌భావం ఆమెపై ప‌డింది. ఆమె కూడా మ‌హిళ‌ల‌కు, స‌మాజానికి ఏదో ఒక‌టిచేయాల‌ని సంక‌ల్పించింది. ఈ క్ర‌మంలో త‌న చ‌దువును ఎక్క‌డా ఆప‌లేదు. బాంబే యూనివ‌ర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. ఆ యూనివ‌ర్సిటీ గ్రాడ్యుయేట్ ప‌ట్టా అందుకున్న తొలి మ‌హిళా కూడా సొరాబ్జీనే. ఈమెకు ఐదుగురు తోబుట్టువులు.

సొరాబ్జీ లిట‌రేచ‌ర్ కూడా పూర్తి చేశారు. ఐదేండ్ల కోర్సును ఒక్క ఏడాదిలోనే పూర్తి చేశారు. ఆమె అన్ని ప‌రీక్ష‌ల్లో టాప‌ర్‌గా నిలిచిన‌ప్ప‌టికీ స్కాల‌ర్‌షిప్ ఇవ్వ‌లేదు. ఎందుకంటే ఆమె మ‌హిళ కాబ‌ట్టి. ఆక్స్‌ఫ‌ర్డ్ వెళ్లి లా చేయాల‌నుకున్నారు. కానీ ఆర్థిక క‌ష్టాలు వెంటాడాయి. పూనా, బొంబాయిలోని కొంత మంది ఇంగ్లీష్ మ‌హిళ‌లు నిధులు సేక‌రించి సొరాబ్జీని ఆక్స్‌ఫ‌ర్డ్‌కు పంపారు. 1889లో సోమ‌ర్‌విల్లే కాలేజీలో చేరారు. 1892లో బ్యాచిల‌ర్ ఆఫ్ సివిల్ లాస్ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించారు. అయితే ఆమెకు డిగ్రీ ప‌ట్టా ఇచ్చేందుకు కాలేజీ నిరాక‌రించింది. ఆ సమయంలో ఏ మహిళకు కూడా లా ప్రాక్టీస్‌కు అనుమ‌తించ‌లేదు. ఇండియాకు తిరిగొచ్చారు సొరాబ్జీ. ఆ త‌ర్వాత అమ్మాయిలు, మ‌హిళ‌ల హ‌క్కుల కోసం త‌న‌వంతుగా పోరాడారు. 1920లో లండన్ బార్ మహిళలను లా ప్రాక్టీస్ చేయడానికి అనుమతించినప్పుడు కార్నెలియా తన డిగ్రీని పొందడానికి ఇంగ్లాండ్‌కు వెళ్లింది. ఆ తర్వాత కలకత్తాలోని హైకోర్టులో లా ప్రాక్టీస్ మొద‌లుపెట్టారు.

సొరాబ్జీ తన అనుభవాల గురించి బిట్వీన్ ది ట్విలైట్స్ పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు. 2012లో, గౌరవ సూచకంగా లండన్‌లోని లింకన్స్ ఇన్, హైకోర్టు కాంప్లెక్స్‌లో ఆమె కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. నవంబర్ 15, 2017న ఆమె 151వ పుట్టినరోజును పుర‌స్క‌రించుకొని గూగుల్ డూడుల్ కూడా సృష్టించబడింది.

లా ప్రాక్టీస్‌ను ఛాలెంజ్ చేసిన‌ కార్నెలియా సొరాబ్జీ

లా ప్రాక్టీస్ చేయడం కోసం మహిళలు పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. మొదట్లో మహిళలను లా ప్రాక్టీస్ చేయనిచ్చేవారు కాదు. కోర్టులో మహిళలు మరొకరికి ప్రాతినిధ్యం వహించడానికి వీల్లేదు. 1923లో వచ్చిన లీగల్ ప్రాక్టీషనర్ (వుమెన్) యాక్ట్‌తో ఈ పరిస్థితి మారింది. ఎంతో పోరాటం చేసి మహిళలు న్యాయవాద వృత్తిని చేపట్టగలిగే హక్కును సంపాదించుకున్నారు.

పురుషులకు మాత్రమే పరిమితమైన న్యాయవాద వృత్తిని ఛాలెంజ్ చేసిన తొలితరం మహిళా లాయర్లు రెజినా గుహా, సుధాంశు బాల హజ్రా, కార్నెలియా సోరాబ్జీ. రెజీనా గుహ లా చదువు పూర్తి చేసుకుని, 1916లో ప్లీడర్‌గా తన పేరు నమోదు చేసుకునేందుకు దరఖాస్తు పెట్టుకున్నారు. అప్పట్లో ఇది చాలా వింత. ఆమె అప్లికేషన్‌ను కలకత్తా హైకోర్టుకు పంపించారు. ఈ కేసును మొట్టమొదటి “పర్సన్ కేస్”గా పరిగణిస్తారు. 1879లో వచ్చిన లీగల్ ప్రాక్టీషనర్స్ యాక్ట్ ప్రకారం వ్యక్తులు లా చదువు పూర్తి చేసుకుని న్యాయవాద వృత్తి చేపట్టవచ్చు. అయితే ఈ కేటగిరీలో మహిళలు లేరు.

రెజీనా గుహా ఈ యాక్ట్‌ను సవాలు చేసిన తొలి మహిళ. కానీ, ఆమె పిటీషన్‌ను ఐదుగురు సభ్యుల ధర్మాసనం తోసిపుచ్చింది. 1921లో సుధాంశు బాల కూడా ఇదే పోరాటం చేశారు. ఆమె పట్నా హైకోర్టులో పిటీషన్ వేశారు. ఇది రెండో “పర్సన్ కేసుష‌. అయితే, 1919నాటికే బ్రిటన్ హైకోర్టులు మహిళలు న్యాయవాద వృత్తిని చేపట్టవచ్చని తీర్పునిచ్చాయి. కాగా, కలకత్తా హైకోర్టు తీర్పును అనుసరిస్తూ పాట్నాహైకోర్టు కూడా సుధాంశు బాల అప్లికేషన్‌ను తిరస్కరించింది. అదే ఏడాది, కార్నెలియా సోరబ్జీ అలహాబాద్ కోర్టులో పిటీషన్ వేసి గెలిచారు. అలా, సోరబ్జీ భారతదేశ మొట్టమొదటి మహిళా న్యాయవాదిగా చరిత్రకెక్కారు. తరువాత, 1923లో లీగల్ ప్రాక్టిషనర్స్ యాక్ట్ రావడంతో కలకత్తా, పాట్నా హైకోర్టులు ఇచ్చిన తీర్పులు రద్దు అయ్యాయి. ఈ యాక్ట్ మహిళలకు న్యాయవాద వృత్తిని చేపట్టే అవకాశాన్ని కల్పించింది.

Latest News