అజారుద్ధీన్ కు మంత్రి పదవి ఇవ్వకుండా బీజేపీ కుట్ర: భట్టి, మహేష్ కుమార్ గౌడ్

అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఎందుకు ఆలస్యం? బీజేపీ ఏ కుట్ర చేస్తోందని భట్టి, మహేష్ గౌడ్ ఆరోపణలు ఏమిటో తెలుసా?

విధాత, హైదారబాద్ : తెలంగాణ కేబినెట్ లో మహ్మద్ అజారుద్ధీన్ కు మంత్రి పదవి రాకుండా బీజేపీ కుట్ర చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ బీ.మహేష్ కుమార్ గౌడ్ లు ఆరోపించారు. గురువారం వారు మీడియాతో మాట్లాడారు. భట్టి మాట్లాడుతూ అజారుద్దీన్‌కు కేబినెట్‌లో స్థానం కల్పించవద్దనే కుట్రతో బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు గవర్నర్ పై ఒత్తిడి తెచ్చి రేపు కేబినెట్ విస్తరణకు సమయం ఇవ్వవద్దని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు అజారుద్దీన్‌ హైదరాబాద్‌ బిడ్డ అని, దేశ కీర్తిపతాకలను రెపరెపలాడించిన వ్యక్తి అని పేర్కొన్నారు. దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన క్రీడాకారుడిగా.. దేశ ఔన్నత్యాన్ని ప్రపంచపటంలో నిలబెట్టారని భట్టి కొనియాడారు. అలాంటి అజారుద్ధీన్ ను కేబినెట్‌లోకి తీసుకుంటే ఎవరైనా స్వాగతించాలేగాని..మంత్రివర్గంలోకి తీసుకోవద్దని లేఖ రాయడం దురదృష్టకరం అని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ గెలవదని తెలిసి ఆ పార్టీ నుంచి బలహీనమైన అభ్యర్థిని నిలపడంతో పాటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచేందుకు బీజేపీ నేతలు అజారుద్దీన్ కు మంత్రి పదవి వ్యవహారంలో ఎన్నికల సంఘానికి లేఖలు రాశారన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సహకారంతో బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచిందన్న సంగతి మరువరాదన్నారు.

ఎన్నికల కోడ్ పై బీజేపీ పార్టీ ద్వంద్వ విధానం : పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

ఎన్నికల కోడ్ వేళ అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి ఎలా తీసుకుంటారని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారని..అదే బీజేపీ రాజస్థాన్‌లో ఉపఎన్నిక వేళ బీజేపీ అభ్యర్థిని మంత్రిగా చేసిందని పీసీసీ చీఫ్ బీ.మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు. బీజేపీకి రాజస్థాన్‌లో ఒక నీతి.. తెలంగాణలో మరో నీతి ఉంటుందా? అని ప్రశ్నించారు. ఇదేమి ద్వంద్వ విధానమని నిలదీశారు.
.భారత క్రికెట్‌ జట్టుకు అజారుద్దీన్‌ సేవలందించారని.. గొప్ప క్రీడాకారుడికి మంత్రివర్గంలో అవకాశం వస్తుంటే అనైతికంగా అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. మైనార్టీ ఎమ్మెల్యేలు లేకపోవడంతో కేబినెట్‌లో అవకాశం ఆలస్యమైందని..అందుకే అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్‌లోకి తీసుకోవాలని కాంగ్రెస్‌ నిర్ణయించిందని, మైనార్టీకి అవకాశమిస్తే అడ్డుతగిలేలా బీజేపీ నేతలు విషం వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. ఈసీపైన, గవర్నర్ పైన ఒత్తిడి తెచ్చి బీజేపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.