విధాత, హైదరాబాద్ : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ ఎంపీలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. గురువారం
హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ఈ భేటీలో పార్లమెంట్ సమావేశాల వ్యూహంపై కీలక చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా భట్టి పార్టీ ఎంపీలకు రానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల ప్రాతిపదికన పార్లమెంట్ లో లేవనెత్తాల్సిన అంశాలపై అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
తెలంగాణకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల మంజూరుపై కేంద్రాన్ని ఒత్తిడి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వివిధ మంత్రిత్వ శాఖల వద్ద ఉన్న ఫైళ్ల పురోగతి కి సంబంధించిన సమాచారాన్ని పార్టీ ఎంపీలకు డిప్యూటీ సీఎం భట్టి అందజేశారు. పార్టీ పార్లమెంట్ సభ్యులు అందరూ పార్లమెంట్‌లో ఏకగ్రీవంగా వ్యవహరించాలి అని భట్టి సూచనలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక కోఆర్డినేషన్ టీమ్ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.
కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన కేంద్ర నిధులు, ప్రాజెక్టులకు సంబంధించిన పలు ఆమోదాలు, పక్క రాష్ట్రాలతో ఉన్న నీటి సమస్యలు, రాష్ట్రానికి సంబంధించిన బిల్లులపై విపక్ష వైఖరికి ప్రభావం వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించారు. పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ అభివృద్ధిని ప్రధాన అజెండాగా తీసుకుని సమగ్రంగా పని చేయాలని ఎంపీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించినట్లు సమాచారం.
