విధాత, హైదరాబాద్ : ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మహిళలంతా మహారాణులుగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. హైదరాబాద్ జిల్లా సమైక్య మహిళా సంఘాలకు రూ. 41,51,05,152 కోట్ల రూపాయల చెక్కును మంత్రులు పొన్నం ప్రభాకర్ , సీతక్క , వివేక్ వెంకట్ స్వామిలతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని.. మహిళలను ఇప్పటికే 150 ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశాం. మరో 450 బస్సులకు యజమానులను చేయబోతున్నాం అన్నారు. మహిళలు ఇక వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదనన్నారు. బీఆర్ఎస్ పాలనలో మహిళాభ్యున్నతి…వడ్డీలేని రుణాలను పూర్తిగా విస్మరించారన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం మళ్లీ వడ్డీలేని రుణాలను పునరుద్దరించి మహిళల ఆర్థిక శక్తిని పెంచే ప్రయత్నంచే చేస్తుందన్నారు. ఏడాదికి రూ.20వేల కోట్ల రుణాలను మహిళా సంఘాలకు అందిస్తున్నామని..తొలి ఏడాది రూ.21వేల 600కోట్ల రూపాయలను అందించామన్నారు.
ఇందిరమ్మ ప్రభుత్వంలో మహిళ సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల సంక్షేమాన్ని కోరే పార్టీ అని అన్నారు. దేశం కోసం ఉక్కుమనిషి ఇందిరమ్మ కృషి చిరస్మరణీయమని..తెలంగాణ తల్లుల బాధ చూసి తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన మహిళ సోనియమ్మ అని పేర్కొన్నారు. మహిళల బాగు కోరే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వమని మంత్రి తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పొదుపు సంఘాలు ఏర్పాటు అయ్యాయని, వారిని వ్యాపార రంగాల్లో నిలబెట్టేందుకు ప్రతి ఏడాది 25 వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు ఇస్తున్నామన్నారు.
బ్యాంకు లోన్ల ద్వారా పెట్రోల్ బంకులు, ఇంద్ర మహిళ శక్తి క్యాంటీన్లు, సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేసుకుంటున్నారని మంత్రి అన్నారు. బ్యాంక్ లకు మహిళా సంఘాల ద్వారా 98 శాతం రీపేమెంట్ జరుగుతుంది. అందుకే బ్యాంకులు మహిళా సంఘాలకు లోన్లు ఇచ్చేందుకు క్యూ కడుతున్నాయన్నారు. ఆర్టీసీ అద్దె బస్సులకు మహిళా సంఘాలను ఓనర్లను చేస్తున్నామన్నారు. మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలో మొట్టమొదటిగా మన నారాయణపేటలో మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ బంకును ఏర్పాటు చేయించామని తెలిపారు. ఆరు నెలల్లో 13 లక్షల ఎనభై వేల రూపాయల ఆదాయాన్ని నారాయణపేట మహిళా జిల్లా సమాఖ్య సంపాదించిందన్నారు. హైదరాబాద్ నగరంలోని 35 క్యాంటీన్లను మహిళా సంఘాలు నడుపుతున్నాయి. పాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నడుస్తున్నాయన్నారు. కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలని లక్ష్యంతో సీఎం పనిచేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫాములను కూడా మహిళా సంఘాల ద్వారానే కుట్టిస్తున్నామనీ, దీని ద్వారా మహిళా సంఘాలకు ఏడాది 30 కోట్ల ఆదాయం సమకూరుతుందన్నారు. పేదలకు ఉచితంగా కరెంటు ఇస్తున్నామని.. రూ.500 కి గ్యాస్ సిలిండర్ ఇచ్చి మహిళల కన్నీళ్లు తుడుస్తున్నామన్నారు. మహిళా సంఘ సభ్యులకు 10 లక్షల ప్రమాద బీమా, రెండు లక్షల లోన్ బీమా కల్పిస్తున్నాం. దురదృష్టవశాత్తు చనిపోయిన, లోన్ కట్టకపోయినా మహిళలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రమాద బీమా లోన్ బీమాను అమలు చేస్తున్నాం. 410 మంది మహిళ సంఘ సభ్యులు మరణిస్తే 40 కోట్లు ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించామని, 5,474 మంది మహిళలకు లోన్ బీమా ద్వారా ఒక్కొకరికి రెండు లక్షలు మాఫీ చేశామన్నారు.
ఆర్టీసీ ఉచిత బస్సు పథకంపై బీఆర్ఎస్ దొంగ వీడియోలు సృష్టించి మహిళలను అవమానపరుస్తుందని సీతక్క విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల ఆదాతో అభయ హస్తం రూ.1800 కోట్లు జమ చేస్తే.. ఆ డబ్బులు కూడా కేసీఆర్ ప్రభుత్వం మింగేసిందన్నారు. రూ.3,500 కోట్ల మేర వడ్డీ రుణాలను ఎగొట్టిందన్నారు. వడ్డీ లేని రుణాలను ఎత్తేసిందని విమర్శించారు. ఏడాదికి 100 రూపాయల బతుకమ్మ చీర ఇచ్చి 100 సార్లు ప్రచారం చేసుకున్నారని.. నాసిరకం చీరలు ఇచ్చి మహిళలను అగౌరవపరిచారన్నారు. మహిళలను ఆర్థికంగా నిలబెట్టేందుకు మహిళలను మహారాణులుగా నిలబెట్టాలని మేము ప్రయత్నిస్తున్నామన్నారు.
బతుకమ్మ అంటే మనందరికీ బతుకునిచ్చే పండుగ, మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువైన పండుగ, ప్రజా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసే పాటలు రాయిస్తున్నారని సీతక్క మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు బతుకమ్మ పండుగను రాజకీయాలతో కలుషితం చేస్తున్న దుర్మార్గులని మండిపడ్డారు. బతుకమ్మ పాటలు కాకుండా బీఆర్ఎస్ పాటలతో బతుకమ్మలాడుతూ బతుకమ్మను అవమానిస్తున్న బీఆర్ఎస్ కు మహిళలు బుద్ధి చెప్పాలని సీతక్క కోరారు. అందరూ సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ కు నచ్చదు. వాళ్లకు అధికారం పోయింది కాబట్టి అన్ని అనర్ధాలే కనిపిస్తాయన్నారు. సొంత ఆడబిడ్డ కవిత ఫోన్లు టాప్ చేసిన బీఆర్ఎస్ పెద్దలు.. తెలంగాణ ఆడబిడ్డల మంచిని ఎట్టి పరిస్థితుల్లో కోరుకోరని… కోటి మంది మహిళలను కోటీశ్వరుని చేసే ఈ ప్రభుత్వాన్ని మహిళలంతా దీవించాలని విజ్ఞప్తి చేశారు.