విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ ఈగల్ టీమ్ పోలీసులు మరోసారి భారీ మొత్తంలో మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. జీడిమెట్లలో 220 కిలోల ఎఫిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.72 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దేశీయంగా రూ.10 కోట్లు ఉంటుందని తెలిపారు. జీడిమెట్ల పరిధిలోని సుచిత్రా క్రాస్ రోడ్స్ సమీపంలోని స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీలో సాయిదత్తా రెసిడెన్సీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు ఈగల్ టీమ్‌కు విశ్వసనీయ సమాచారం అందడంతో డాడులు నిర్వహించి ఎఫిడ్రిన్ డ్రగ్స్ ను పట్టుకున్నారు.
ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఎఫెడ్రిన్ తయారీకి బిగ్ స్కేల్ కెమికల్ యూనిట్ వినియోగించినట్లు గుర్తించారు. డ్రగ్ తయారీలో ప్రధాన నిందితుడు వాస్తవాయి శివ రామకృష్ణ వర్మతో పాటు దంగేటి అనిల్, మద్దు వెంకటకృష్ణ, ఎం ప్రసాద్, ముసిని దొరబాబు ఉన్నారని తెలిపారు. వీరంతా ఏపీలోని కాకినాడ, తూర్పు గోదావరి, నెల్లూరు జిల్లాలకు చెందిన వారని పోలీసులు తేల్చారు. డ్రగ్ తయారీకి వాడిన ఫార్ములాను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.