విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ నగరం వాసులు న్యూ ఇయర్ వేడుకల నిర్వహణకు సిద్దమవుతున్నారు. ముఖ్యంగా న్యూ ఇయర్ పార్టీల కోసం ఇప్పటి నుంచే బీజీగా మారిపోయారు. డిసెంబర్ 31న న్యూ ఇయర్ పార్టీల కోసం ప్రణాళికలు వేసుకుంటున్న యువత రెస్టారెంట్లు, పబ్ లలో పార్టీలకు మొగ్గుచూపుతున్నారు. యువత ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకు పబ్ లు, రెస్టారెంట్ల, ఈవెంట్ల నిర్వాహకులు రకరకాల ఆఫర్లతో పార్టీలను నిర్వహిస్తున్నారు. మద్యం పార్టీలు, డాన్స్ షోలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సందట్లో సడేమియాగా గంజాయి, డ్రగ్స్ అమ్మకందారులు న్యూ ఇయర్ పార్టీలను లక్ష్యంగా చేసుకుని తమ అమ్మకాలు సాగించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ బిట్ ట్విస్టు ఏమిటంటే గతంలో మాదిరిగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా డ్రగ్ పార్టీలపై నిఘా వేస్తుంది. ఇందుకోసం ఈగల్ టీమ్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్) ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగి న్యూ ఇయర్ పార్టీలపై ఆరా తీస్తూ..ఎక్కడెక్కడ డ్రగ్ విక్రయాలకు అవకాశం ఉండవచ్చన్న దానిపై ఫోకస్ చేస్తున్నాయి. న్యూఇయర్ వేడుకలకు మత్తు పదార్ధాలు అందకుండా సప్లై చైన్‌నే బ్రేక్ చేసే పనిలో పడింది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGNAB) కింద పనిచేస్తున్న ఈగల్ టీమ్ టాస్క్ ఫోర్స్ తెలంగాణ పోలీసు శాఖ, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA), కేంద్ర సంస్థలైన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)తో సమన్వయంతో పనిచేస్తుంది.
మొదలైన డ్రగ్ నివారణ దాడులు
న్యూ ఇయర్ వేడుకలకు రెడీ అవుతున్న యువతను లక్ష్యంగా చేసుకుని బయలుదేరిన డ్రగ్స్ ముఠాల ఆటకట్టించేందుకు ప్రత్యేక బృందాలు నిఘా ముమ్మరం చేశాయి. పోలీసుల కళ్ళు కప్పి డ్రగ్స్, గంజాయి సరఫరా చేస్తున్న ముఠాలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు పలుచోట్ల దాడులు చేసి డ్రగ్స్ ,గంజాయి స్వాధీనం చేసుకుంటున్నారు. న్యూ ఇయర్ వేడుకలపై ప్రత్యేకంగా నిఘా పెట్టిన పోలీసులు.. డ్రగ్స్ గంజాయి సప్లై చేసే పబ్స్, రెస్టారెంట్ల పై నజర్ పెట్టారు. పార్టీల్లో డ్రగ్స్ పట్టుబడితే పబ్ లు, రెస్టారెంట్ల లైసెన్సు రద్దు చేస్తామని వార్నింగ్ జారీ చేశారు.
డ్రంక్ డ్రైవ్ లో పట్టుబడితే కఠిన చర్యలు
డిసెంబర్ 31న హైదరాబాద్ లోని 100 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించబోతున్నట్లుగా నగర పోలీస్ కమిషనర్ వీసీ.సజ్జనార్ తెలిపారు. ఇందుకోసం అదనంగా ఏడు ప్లటూన్ల బలగాలను రంగంలోకి దించుతున్నామని… డ్రంక్ ఆండ్ డ్రైవ్ లో పట్టుబడితే 10వేల జరిమానా, వాహనాన్ని అక్కడికక్కడే సీజ్‌చేస్తారు. నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ 3 నెలలు లేదా పూర్తిగా సస్పెండ్ చేస్తారు. వీటికి కోర్టు విధించే శిక్ష అదనం అని తెలిపారు. మైనర్లు వెహికల్ నడుపుతూ పట్టుబడినా, ప్రమాదానికి గురైనా.. వాహన ఓనర్‌దే పూర్తి బాధ్యత అన్నారు.
తొలి రోజు డ్రంక్ ఆండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ లో 304మంది పట్టుబడ్డారని తెలిపారు. అలాగే న్యూ ఇయర్ వేడుకల పేరుతో భారీగా సౌండ్ బాక్సులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవాలని సూచించారు.
ఈవెంట్ నిర్వాహకులకు షరతులు
న్యూఇయర్ వేడుకల సందర్బంగా నగరం మొత్తం నిఘా నేత్రాల పర్యవేక్షణలో ఉంటుందని సజ్జనార్ స్పష్టం చేశారు. ముఖ్యంగా గతంలో నేరాలు జరిగిన ప్రాంతాలు, రద్దీగా ఉండే హాట్‌స్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించనున్నాట్లుగా..పాత నేరస్తుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అనుమానితులు కనిపిస్తే తక్షణమే చర్యలు తీసుకోనున్నట్లుగా తెలిపారు.
నగరంలో ఉన్న పబ్‌లు, త్రీస్టార్, అంతకంటే పై స్థాయి హోటళ్లలో జరిగే వేడుకలను సమయపాలనను కచ్చితంగా అమలు చేయాలని.. అర్థరాత్రి ఒంటిగంట వరకే వేడుకలకు అనుమతి ఉంటుందని తెలిపారు. భారీ సౌండ్ బాక్స్ లు పెడితే చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీల్లో బాణసంచా నిషేధం.. పబ్‌లు, బార్లలో మైనర్లకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఎంట్రీ ఉండకూడదు. వేడుకల పేరుతో గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాల వినియోగం జరిగినా, అశ్లీల నృత్యాలకు తావిచ్చినా ఆయా సంస్థల లైసెన్స్‌లను తక్షణమే ద్దు చేస్తామని కమిషనర్ హెచ్చరించారు. ఈవెంట్ నిర్వాహకులు కార్యక్రమాలు జరిగే ప్రాంతాలలో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, పార్టీల నిర్వహణకు ఆన్ లైన్ లో పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలలో సౌండ్ సిస్టం లు, లౌడ్ స్పీకర్లను రాత్రి 10 గంటలకల్లా ఆఫ్ చేయాలని సజ్జనార్ ఆదేశించారు.
మహిళల భద్రత కోసం షీ టీమ్స్
న్యూ ఇయర్ వేడుకల్లో మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ.. రద్దీగా ఉండే ప్రాంతాలు, పార్టీ వేదికలు, ప్రధాన జంక్షన్‌లలో 15 షీటీమ్స్ మఫ్టీలో ఉండి నిఘా వేస్తాయని సజ్జనార్ తెలిపారు. వేధింపులకు పాల్పడే ఆకతాయిలను గుర్తించి తక్షణమే అదుపులోకి తీసుకుంటారన్నారు. న్యూ ఇయర్ రోజు మద్యం సేవించి రోడ్లపైకి వచ్చి బైకులతో విన్యాసాలు చేసే నిఘా వేసి చట్టపర చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Pongal Fight | సంక్రాంతి బాక్సాఫీస్ రేస్ .. పోటా పోటీగా 7 సినిమాలు .. హై వోల్టేజ్ క్లాష్‌లో నెగ్గేదెవరో?
Nehru Zoological Park : జూపార్క్ పోదాం చలో చలో..పెరిగిన రద్దీ
