Nehru Zoological Park : జూపార్క్ పోదాం చలో చలో..పెరిగిన రద్దీ

హైదరాబాద్ జూపార్కుకు సందర్శకుల తాకిడి పెరిగింది. క్రిస్మస్ రోజున 23,440 మంది రాగా.. త్వరలో వంతారా నుంచి అరుదైన కంగారూలు రానున్నాయని జూ అధికారులు తెలిపారు.

Nehru Zoological Park

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క(జూపార్క్ )కు క్రిస్మస్ సెలవుల సందర్భంగా సందర్శకుల తాకిడి పెరిగింది. సాధారణ రోజుల్లో రోజుకు 5 నుంచి 8 వేల మందికిపైగా వచ్చే నెహ్రూ జూపార్క్‌కు క్రిస్మస్ పండుగ సందర్భంగా సుమారు 23,440 మంది సందర్శకులు జూపార్కు సందర్శించడం విశేషం. ఈ సంవత్సరం, సాధారణ సెలవు రోజులలో జూను సందర్శించడానికి ఎక్కువ మంది సందర్శకులు ఆసక్తి చూపారు. జూపార్క్ సందర్శకులతో కిటకిట లాడింది. కూల్‌ వెదర్‌.. అందులోనూ సెలవులు కావడంతో బెస్ట్‌ హాలీడే స్పాట్‌గా నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌ ఫస్ట్‌ ప్లేస్‌కి వచ్చేసింది. కుటుంబ సమేతంగా ఎంజాయ్‌ చేసేందుకుజూకు క్యూ కడుతున్నారు. పిల్లలతో కలిసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే సరదాగా గడుపుతున్నారు.న్యూఇయర్, సంక్రాంతి సెలవుల సందర్బంగా మరింత మంది సందర్శకులు జూ పార్కు సందర్శనకు తరలివచ్చే అవకాశం ఉంది. క్రిస్మస్ సెలవులలో పెరిగిన సందర్శకులను దృష్టిలో పెట్టుకుని జూ యాజమాన్యం అదనపు బుకింగ్ కౌంటర్లను తెరిచి, అదనపు భద్రతా సిబ్బందిని, జూ వాలంటీర్లను నియమించింది. ఈ జూపార్కును ప్రతి సోమవారం మూసివేస్తారు. మిగతా రోజుల్లో ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4:00 వరకు తెరిచి ఉంటుంది. టికెట్ ఫీజు విషయానికి వస్తే.. ప్రస్తుతం పెద్దలకు (12 సంవత్సరాల కంటే ఎక్కువ) రూ. 100 ఉంది. అలాగే పిల్లలకు (3-12 సంవత్సరాలు) రూ. 50 గా ఉంది.

హైదరాబాద్ జూలో వివిధ దేశాలకు చెందిన 199 రకాల వన్యప్రాణులు ఉన్నాయి. పలు దేశాల నుంచి ఈ జంతువులను ఇక్కడికి తరలించారు. జూపార్క్ లో ఇటీవల అనేక కొత్త జంతువులు, పక్షులను సంరక్షణ కోసం తీసుకొచ్చారని అందువల్ల టూరిస్టుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని నెహ్రూ జూపార్క్ అధికారి జే. వసంత తెలిపారు. కొత్తగా జీబ్రా, మీర్కట్, సెర్వల్ క్యాట్, బారాసింగా, వైట్ స్వాన్స్.. అలాగే ఇతర పక్షులు, పాములను ఇటీవల ఇతర జూ పార్కుల నుంచి తరలించినట్లు చెప్పారు. కొత్తగా వచ్చిన జంతువులను చూసేందుకు పర్యటకులు అధిక సంఖ్యలో వచ్చినట్లు తెలిపారు. గుజరాత్‌ లోని జామ్‌ నగర్‌ లో రిలయన్స్ ఫౌండేషన్ కు చెందిన అంతర్జాతీయ వన్యప్రాణుల రక్షణ, పరిరక్షణ కేంద్రమైన వంతారా నుండి అరుదైన జంతువులు త్వరలోనే హైదరాబాద్ జూపార్క్ కు రానున్నాయి. ఇక్కడి నుంచి ఒక జత కంగారూలను తీసుకురానున్నారు. వీటి కోసం ఎన్‌ క్లోజర్లు.. అలాగే రాత్రిపూట నివాస గృహాలను సైతం ఇప్పటికే సిద్ధం చేసినట్లు జూ అధికారులు పేర్కొన్నారు. ఇక ఎక్స్ ఛేంజ్ లో భాగంగా కంగారూలకు బదులు హైదరాబాద్ జూ నుంచి ఒక ఏనుగును వంతారాకు పంపనున్నారు. ఇక హైదరాబాద్‌ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ మీర్ ఆలం ట్యాంక్ సమీపంలో బహదూర్‌ పురాలో ఉంది. ఈ పార్కు దాదాపు 380 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.

ఇవి కూడా చదవండి :

Meenakshi Chaudhary | జాబిలమ్మకి చెల్లెలు ఏమో ఈ సుకుమారి.. మీనాక్షి క్యూట్ లుక్స్
Raithu Bharosa payments| రైతుల ఖాతాల్లోకి “భరోసా” డబ్బులు..సంక్రాంతికే!

Latest News