విధాత, హైదరాబాద్ : ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన పేరు ఇమ్మడి రవి. ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడు అయిన ఇతనికి మరో కేసులో నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇప్పటికే రవిపై పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు. మిగిలిన 3 కేసులకు సంబంధించి కూడా పీటీ వారెంట్ దాఖలు అయింది. దీంతో కోర్టు అనుమతితో మూడు కేసుల్లో అరెస్ట్ చూపనున్నారు పోలీసులు. పైరసీ కేసులో అరెస్టైన రవి పోలీసు కస్టడీ సోమవారం ముగిసింది.
విచారణలో రవి నుంచి పోలీసులు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఐ బొమ్మ సినీపైరసీని ఇమ్మడి రవి ఒక్కడే చేశాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. పైరసీ ద్వారా అతను వందల కోట్ల రూపాయలకు పైగా సంపాదించుకున్నాడని..ఇందులో రూ.30 కోట్లకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను సేకరించారు. ఐబొమ్మ పైరసీ సైట్ ను ఉపయోగించుకుని రవి బెట్టింగ్ యాప్స్, ఇల్లీగల్ యాప్స్ ప్రమోట్ చేశాడు. టెలీగ్రామ్ యాప్ ద్వారా బేరమాడి సినిమాలు కొనుగోలు చేశాడు. సినిమా డౌన్లోడ్ చేసే సమయంలో లింక్ పై క్లిక్ చేయగానే 15 యాడ్స్ కు డైరెక్టు లింక్ అయ్యేలా వెబ్ సైట్ రూపొందించినట్లు విచారణ గుర్తించిన పోలీసులు.
