విధాత, హైదరాబాద్ : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతలుగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. అంతకముందే పంచాయతీ ఎన్నికలు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. దీంతో గ్రామాల్లో రాజకీయ పండుగ వాతావరణం నెలకొన్నది. ఈ క్రమంలో సర్పంచులుగా పోటీ చేసేందుకు అభ్యర్థులు ఇప్పటికే సిద్ధం అయ్యారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టాశారు. కొన్ని గ్రామాల్లో ఆశావాహులు ఏకగ్రీవం చేస్తే గ్రామానికి డబ్బులు ఇస్తామని ప్రకటిస్తున్నారు.
ఆశావాహులతో పాటు ఎమ్మెల్యేలు, ఇతర లీడర్లు కూడా తమ తమ నియోజకవర్గాల్లో పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎన్నికలకు వెళ్లకుండా ఏకగ్రీవం చేయడంపై దృష్టిసారించారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా ఏకగ్రీవంపై ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ.15 లక్షలు ఇస్తానని ప్రకటించారు. వీటిని ఎమ్మెల్యే ఫండ్సుతో పాటు తన కూతురు కావ్య ఎంపీ ఫండ్స్ నుంచి అందజేస్తానని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షలతో పాటు తాను ఇచ్చే డబ్బులు కలిపి మొత్తం రూ.25 లక్షలు వస్తాయని తెలిపారు. వీటిని గ్రామ అభివృద్ధికి ఉపయోగించుకుకోవచ్చని సూచించారు.
అలాగే, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా బీజేపీ మద్ధతు దారులను సర్పంచులుగా ఏకగ్రీవం చేస్తే రూ.10 లక్షలు ఇస్తానని ప్రకటించారు. ‘కరీంనగర్ నియోజకవర్గంలో మీ గ్రామం ఉన్నట్లయితే, బీజేపీ మద్దతు ఉన్న వ్యక్తిని సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే.. గ్రామాభివృద్ధికి నేరుగా రూ.10 లక్షలు అందిస్తాను’ అని బండి సంజయ్ ప్రకటించారు. అయితే, ఏకగ్రీవం ఆఫర్ లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ప్రలోభపెట్టే చర్యలే అని ఇతర పార్టీలు విమర్శిస్తున్నాయి. కాగా, ఏకగ్రీవం చేస్తే ఖర్చు తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
