KTR – Kinnera Mogulaiah | ‘పద్మశ్రీ’ దర్శనం మొగులయ్యకు కేటీఆర్‌ ఆపన్నహస్తం

తెలంగాణ జానపద కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు కేటీఆర్‌ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కంటి చికిత్స, భూమి వివాదం పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

KTR Assures Full Support to Padma Shri Darshanam Mogulaiah

KTR Assures Full Support to Padma Shri Darshanam Mogulaiah

(విధాత సిటీ బ్యూరో)

హైదరాబాద్‌:
పద్మశ్రీ అవార్డు గ్రహీత, తెలంగాణ కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్యకు బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మొగులయ్య శనివారం కేటీఆర్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ఆయన ఆరోగ్యం, కుటుంబ పరిస్థితుల గురించి ఆరా తీశారు.

మొగులయ్య కంటిచూపు మందగించిందని, చికిత్స కోసం ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించగా, కేటీఆర్‌ వెంటనే స్పందించి హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రిలో పూర్తి చికిత్స అందించే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.

తరువాత మొగులయ్య తనకు హయత్‌నగర్‌ మండలంలో గత ప్రభుత్వం కేటాయించిన 600 గజాల స్థలం విషయంలో కొందరు వ్యక్తులు కోర్టు కేసులు వేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వివరించారు. దీనిపై కేటీఆర్‌ వెంటనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డికి ఫోన్‌ చేసి సమస్యను పరిష్కరించాలని సూచించారు. మొగులయ్య భూమిలో కట్టుకున్న గదిని కొందరు కూల్చివేశారని ఆయనకు వివరించారు. కళాకారుడి కుటుంబానికి రక్షణ కల్పించి, భూమి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కేటీఆర్‌ కలెక్టర్‌కు సూచించారు. అవసరమైతే, మొగులయ్యకు ఎదురవుతున్న న్యాయపరమైన కేసులను ఎదుర్కొనేందుకు సహాయం అందిస్తామని కూడా కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా మొగులయ్య మాట్లాడుతూ, “ఒకప్పుడు అడవుల్లో కిన్నెర వాయిస్తూ తిరిగిన నాకు గుర్తింపు తెచ్చింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారు. ఆయన ప్రోత్సాహంతోనే నా కళ ప్రపంచం దృష్టికి వెళ్లింది, ఆ తర్వాతే పద్మశ్రీ అవార్డు దక్కింది,” అన్నారు. కేసీఆర్‌ తమ కుటుంబానికి చేసిన సహాయానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, ప్రస్తుతం ఎదురవుతున్న స్థలం సమస్యపై కేటీఆర్‌ జోక్యం చేసుకోవడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.