Nagarjuna Defamation Case : కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం కేసు విచారణ వాయిదా.!

నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ డిసెంబర్ 2కి వాయిదా. విచారణకు ముందే కొండా సురేఖ క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.

Nagarjuna Defamation Case

విధాత, హైదరాబాద్ : మంత్రి కొండా సురేఖపై నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం కేసు విచారణ డిసెంబర్ 2కు వాయిదా పడింది. నాంపల్లి కోర్టు ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్‌ 2కి వాయిదా వేస్తున్నట్లుగా పేర్కొంది. తన ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విచారణకు ఒక రోజు ముందుగానే మంత్రి కొండా సురేఖ హీరో నాగార్జునకు ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పడం గమనార్హం. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి, అజారుద్ధీన్, అడ్లూరి లక్ష్మణ్ ను నాగార్జున కలవడం చూస్తే ఈ కేసులో రాజీ కుదిరే అవకాశం ఉందని తెలుస్తుంది.

నాగార్జునకు క్షమాపణలు చెప్పిన కొండా సురేఖ.!

సినీ నటుడు అక్కినేని నాగార్జున ఫ్యామిలీ గురించి చేసిన వ్యాఖ్యలపై తాజాగా మంత్రి కొండా సురేఖ క్షమాపణలు వ్యక్తం చేశారు. నాగార్జునకు క్షమాపణలు చెబుతూ అర్ధరాత్రి సమయంలో ఆమె ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్టు వైరల్ అయ్యింది. నాగార్జునపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని కొండా సురేఖ తన పోస్టులో తెలిపారు. ఆయన కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం నాకు లేదని అని పేర్కొన్నారు. నాగార్జున కుటుంబం బాధపడి ఉంటే చింతిస్తున్నానని అన్నారు. నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని స్పష్టం చేశారు. తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.