హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలను పెంచింది తెలంగాణ ఆర్టీసీ. అన్ని రకాల బస్సుల్లో ఛార్జీలు పెరగనున్నాయి. ఈ నెల 6 నుంచి పెంచిన ఛార్జీలను అమల్లోకి వస్తాయి.అన్ని రకాల బస్సుల్లో మొదటి మూడు స్టేజీల వరకు రూ. 5 వరకు పెంచారు.నాలుగవ స్టేజీ నుంచి రూ.10 అదనపు ఛార్జీ వసూలు చేస్తారు.సిటీ ఆర్డినరీ,మెట్రో ఎక్స్ ప్రెస్, ఈ-ఆర్డినరీ,ఈ-ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఈ ఛార్జీలు వసూలు చేస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం కింద తెలంగాణలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం ద్వారా టికెట్ ఛార్జీలను ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తోంది. మహిళలకు ఉచిత రవాణాతో ఆర్టీసీలో ఆక్యుపెన్సీ రేటు కూడా పెరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే ఆర్టీసీ బస్సుల్లోనే ఛార్జీల పెంచారు. జిల్లాల్లో నడిచే బస్సుల ఛార్జీల్లో ఎలాంటి మార్పులు లేవు.
దసరా ప్రత్యేక బస్సులతో ఆర్టీసీకి రూ.110 కోట్ల ఆదాయం
దసరా సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ 5,300 ప్రత్యేక బస్సులు నడిపింది. దీంతో రూ. 110 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రయాణీకుల సంఖ్య అందుకు అనుగుణంగా లేకపోవడంతో 5,300 బస్సులను మాత్రమే నడిపారు.గత ఏడాది ఇదే సీజన్ లో 6300 బస్సులు నడిపితే రూ. 114 కోట్ల ఆదాయం వచ్చింది.ఈ నెల 5,6 తేదీల్లో ప్రయాణీకులకు రద్దీకి అనుగుణంగా బస్సులను నడపనున్నారు.