(విధాత ఇంటర్నేషనల్ డెస్క్)
ఇస్లామాబాద్:
Pakistan nuclear warning | అఫ్ఘాన్ సరిహద్దులో ఘర్షణలు కొనసాగుతున్న వేళ, పాకిస్తాన్ సైన్యాధిపతి అసీం మునీర్ మరోసారి భారత్‌పై ‘అణు’ విషం కక్కాడు. పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ, కాకూల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భారత్ దాడికి పాల్పడితే, పాకిస్తాన్ ప్రతిస్పందన ఊహించలేనంత తీవ్రంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. భారత భూభాగం విస్తారంగా ఉందనే భ్రమ పాకిస్తాన్ సైనిక సామర్థ్యం ముందు నిలవదని అన్నారు. “భారత్ దురాక్రమణకు దిగితే సైనికంగా, ఆర్థికంగా భారీ నష్టం చవిచూడాల్సి వస్తుంది. దీని పరిణామాలు మొత్తం ప్రాంతంపైనే పడతాయి, దానికి పూర్తి బాధ్యత భారతే వహించాల్సిఉంటుందని మునీర్ ప్రగల్భాలు పలికాడు.
🚨 Breaking 🇵🇰🪖
Failed Marshal Asim Munir Issues Nuclear and Economic Threats to India.
Should a fresh wave of hostilities be triggered, Pakistan would respond much beyond the expectations of the initiators. The resulting retributive military and economic losses inflicted will… pic.twitter.com/2IHveD16ox
— OsintTV 📺 (@OsintTV) October 18, 2025
పాకిస్తాన్ అఫ్ఘాన్ సరిహద్దు ప్రాంతాల్లో బాంబులు కురిపిస్తున్న సమయంలోనే ఈ వ్యాఖ్యలు చేయడం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. అఫ్ఘాన్ తాలిబాన్ దాడులతో పాకిస్తాన్ సైన్యానికి భారీ నష్టం జరుగుతున్న వేళ భారత్‌పై అణు బెదిరింపులు చేయడం అంతర్జాతీయ సమాజం దృష్టి మళ్లించడానికి చేసిన ప్రయత్నమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
అఫ్ఘన్ ఇప్పుడు భారత్ ఆదేశాలపై నడుస్తోంది : ఖ్వాజా ఆసిఫ్
అదే సమయంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కూడా భారత్‌పై ఆరోపణలు చేశారు. కాబూల్ ఇప్పుడు ఢిల్లీకి ప్రతినిధిగా మారిందని, భారత్‌తో కలిసి పాకిస్తాన్‌పై కుట్రలు పన్నుతోందని ఆయన వ్యాఖ్యానించారు. “ఇకపై శాంతి చర్చల కోసం ఎలాంటి ప్రతినిధులను పంపము. ఉగ్రవాదం ఎక్కడినుంచి వచ్చినా, దానికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది” అని ఆసిఫ్ తెలిపారు. ఆయన పాకిస్తాన్‌లో నివసిస్తున్న ఆఫ్ఘాన్‌లందరూ తమ దేశానికి తిరిగి వెళ్లాలని ఆదేశించారు. “వారికి ఇప్పుడు తమ స్వంత ప్రభుత్వం ఉంది. పాకిస్తాన్ వనరులు ఇతర దేశాలవారికి చెందవు” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్‌లో ఉన్న ఆఫ్ఘాన్ శరణార్థులపై ఆందోళనను పెంచాయి. మరోవైపు, అఫ్ఘాన్ మీడియా ప్రకారం, పాకిస్తాన్ సైన్యం పక్తికా ప్రావిన్స్‌లో వైమానిక దాడులు జరిపి కనీసం ఎనిమిది మందిని హతమార్చింది. మరణించిన వారిలో ముగ్గురు అఫ్ఘాన్ క్రికెటర్లు ఉన్నట్లు అఫ్ఘాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ ఘటనపై నిరసనగా అఫ్ఘాన్ క్రికెట్ బోర్డు రాబోయే మూడు దేశాల క్రికెట్ సిరీస్ (పాక్, శ్రీలంక, అఫ్ఘాన్) నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.
పాకిస్తాన్ సైన్యం ఈ దాడులు తాలిబాన్ మద్దతుగల హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ స్థావరాలపై జరిగిన ఖచ్చితత్వపు దాడులుగా సమర్థించుకుంది. కానీ కాబూల్ దీనిని ఖండించింది. ఈ పరిణామాలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి.
భారత విదేశాంగ వర్గాలు ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఇప్పటివరకు అధికారిక స్పందన రాకపోయినా, రక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాకిస్తాన్ అంతర్గత సమస్యలు, ఆర్థిక సంక్షోభం మరియు అఫ్ఘాన్ ఘర్షణల వల్ల ఒత్తిడిలో ఉన్నందున భారత్‌పై అణు వ్యాఖ్యలు చేయడం ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమని చెబుతున్నారు. భారత రక్షణ వర్గాలు యుద్ధ వాతావరణం సృష్టించాలనే పాకిస్తాన్ ప్రయత్నాలకు లొంగవనీ, ప్రాంతీయ శాంతిని కాపాడటమే భారత్ లక్ష్యమని స్పష్టం చేశాయి.