3 Afghan Cricketers Killed In Pakistani Airstrike Near Border | Afghanistan Withdraws From Tri-Series
కాబూల్:
పాక్ వైమానిక దాడిలో ముగ్గురు అఫ్గాన్ క్రికెటర్లు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) ప్రకారం, ఈ ఘటన పఖ్తికా ప్రావిన్స్‌లో జరిగింది. ఉర్గూన్, షరానాల మధ్య జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌లో పాల్గొన్న ఆటగాళ్లు ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు బోర్డు వెల్లడించింది.
మృతులుగా గుర్తించిన వారిలో కబీర్, సిబ్గతుల్లా, హరూన్ ఉన్నారు. బోర్డు ప్రకటనలో — “ఈ రోజు సాయంత్రం పాక్ దళాలు నిర్వహించిన పిరికిపంద దాడిలో మా యువ ఆటగాళ్లు వీరమరణం పొందారు. ఇది మానవత్వానికి విరుద్ధమైన చర్య,” అని పేర్కొంది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహంతో అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు పాక్, శ్రీలంకలతో వచ్చే నెల జరగాల్సిన ట్రై-సిరీస్ నుండి వైదొలిగింది. “మా ఆటగాళ్లకు నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నాం,” అని బోర్డు తెలిపింది. టీ20 కెప్టెన్ రషీద్ ఖాన్ ఈ దాడిని ఖండిస్తూ, “పాక్ వైమానిక దాడుల్లో మహిళలు, పిల్లలు, యువ క్రికెటర్లు మరణించడం మనసును కలిచివేస్తోంది. ఇది మానవ హక్కుల ఉల్లంఘన,” అని X (Twitter) లో రాశాడు. “జాతి గౌరవం అన్నదే మాకు ముఖ్యం. బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాను,” అని తెలిపారు. అఫ్గాన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ, పేసర్ ఫజల్హక్ ఫారూకీ కూడా ఈ ఘటనను “అమానవీయ నరమేధం”గా అభివర్ణించారు. “ఇది కేవలం పఖ్తికా రాష్ట్రానికి చెందిన దుర్ఘటన కాదు — మొత్తం అఫ్గాన్ క్రికెట్ కుటుంబానికి దెబ్బ,” అని నబీ వ్యాఖ్యానించాడు.
పాక్ వైమానిక దళం శుక్రవారం అఫ్గాన్ భూభాగంలో పలు ప్రాంతాల్లో దాడులు చేసినట్లు అఫ్గాన్ మీడియా తెలిపింది. ఉర్గూన్, బర్మల్ జిల్లాల్లో నివాస ప్రాంతాలు బాంబుదాడులకు గురై పౌరులు మృతి చెందినట్లు టోలో న్యూస్ నివేదించింది. ఇటీవల రెండు దేశాల మధ్య 48 గంటల కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ, పాకిస్తాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించి, ఈ దాడులకు తెగబడ్డట్లు అఫ్ఘాన్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దోహా చర్చల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సమాచారం.
అఫ్గాన్ క్రికెటర్ల మరణం ఆ దేశంలో తీవ్ర ఆవేదన కలిగించింది. క్రీడాకారులు, పౌరులు ఈ దాడిలో మరణించడం రెండు దేశాల మధ్య ఇప్పటికే రగులుతున్న కుంపటిని మరింత రాజేసింది.