Site icon vidhaatha

Boycott USA : దేశ‌దేశాల్లో అమెరికా వ‌స్తు బ‌హిష్క‌ర‌ణోద్య‌మం.. ట్రంప్ చర్యలకు నిరసనగా.. పెప్సీ వదిలేస్తున్నారు..

Boycott USA : అమెరికా విధిస్తున్న ప్ర‌తీకార సుంకాల‌కు అంతే స్థాయిలో అనేక దేశాల నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. బాయ్‌కాట్ యూఎస్ఏ అనేది ఇప్పుడు ఆ యా దేశాల్లో ట్రెండింగ్‌గా మారింది. కెన‌డా, మెక్సికో, చైనా త‌దిత‌ర దేశాల‌తోపాటు అనేక యూరోపియ‌న్ దేశాల‌పై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌తీకార సుంకాలు విధిస్తున్న విష‌యం తెలిసిందే. ఇవి వాణిజ్య యుద్ధానికి దారి తీస్తున్నాయి. అమెరికా ఉత్ప‌త్తుల కొనుగోలు ప‌ట్ల వివిధ దేశాల ప్ర‌జ‌లు సైతం విముఖ‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. గ‌డిచిన వారం వ్య‌వ‌ధిలోనే బాయ్‌కాట్ యూఎస్ఏ అనేది గూగుల్‌లో టాప్ ట్రెండింగ్‌గా మారింది. ఐరోపా దేశాలు, కెన‌డా ఈ విష‌యంలో టాప్‌లో ఉన్నాయి. అనేక దేశాలు ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్య‌మాల్లో అమెరికా వ‌స్తు బ‌హిష్క‌రణోద్య‌మాన్ని జోరుగా న‌డిపిస్తున్నాయి. కెనడాను కలుపుకొనేందుకు, డెన్మార్క్‌కు చెందిన‌ సెమీ అటాన‌మ‌స్ టెరిట‌రీ అయిన గ్రీన్‌లాండ్ స్వాధీనానికి, ప‌నామా కెనాల్‌ను త‌న అదుపులోకి తెచ్చుకునేందుకు ట్రంప్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు కూడా కార‌ణాలుగా నిలుస్తున్నాయి. డెన్మార్క్‌, ల‌గ్జెంబ‌ర్గ్‌, స్వీడ‌న్, ఫ్రాన్స్‌, అమెరికాకు స‌న్నిహిత దేశంగా ప‌రిగ‌ణించే కెన‌డా వంటి దేశాలు ఫేస్ బుక్ క్యాంపెయిన్‌లో టాప్‌లో నిలుస్తున్నాయి. కెన‌డా నాట్ ఫ‌ర్ సేల్ అంటూ ఆ దేశ నేత‌లు, ప్ర‌జ‌లు టోపీలు ధ‌రించి త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారంటే ట్రంప్ చ‌ర్య‌ల‌పై వ్య‌తిరేక‌త ఏ స్థాయిలో ఉన్న‌దో అర్థం చేసుకోవ‌చ్చు. ట్రంప్ చ‌ర్య‌ల‌కు నిర‌స‌న‌గా ఆయ‌న స‌న్నిహితుడిగా చెప్పే ఎలాన్ మ‌స్క్‌కు చెందిన స్టార్‌లింక్‌తో 100 మిలియ‌న్ డాల‌ర్ల కాంట్రాక్టును సైతం కెన‌డా ర‌ద్దు చేసుకున్న‌ది.

కెన‌డా స్టోర్ల‌లో అమెరికా లిక్క‌ర్ గాయ‌బ్‌
కెన‌డాలోని అనేక రాష్ట్రాలు త‌మ ప్రాంతాల్లోని స్టోర్ల నుంచి అమెరికా త‌యారీ ఆల్క‌హాల్‌ను అమ్మ‌కాల నుంచి త‌ప్పించేశాయి. ఇది టారిఫ్‌ల‌కంటే దుర్మార్గ‌మైన చ‌ర్య అంటూ జాక్ డేనియ‌ల్ బ్రాండ్‌ను విక్ర‌యించే బ్రౌన్ ఫార్మ‌న్ సీఈవో లాస‌న్ వైటింగ్ గ‌గ్గోలు పెడుతున్నాడు. గ‌త నెల‌లో 3,310 మందితో నిర్వ‌హించిన ఒక స‌ర్వేలో మేడిన్ కెన‌డా ఉత్ప‌త్తుల కోసం తాము చూస్తున్న‌ట్టు 98 శాతం చెప్పారు. కెన‌డియ‌న్లు అమెరికా విమానాల‌ను ఎక్కేందుకు ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని, 10 శాతం త‌గ్గుద‌ల న‌మోదైనా అ అమెరికా ట్రావెల్ అసోసియేష‌న్ పేర్కొన్న‌ది. ప‌దిశాతం వ‌ర‌కూ తగ్గుదల నమోదైనా అది 2.1 బిలియన్ డాలర్ల నష్టానికి కారణమవుతుందని, 14వేల ఉద్యోగాలు పోయే అవ‌కాశం ఉన్న‌ద‌ని తెలిపింది. గ‌త ఏడాదితో పోల్చితే గ‌త నెల‌లో 23 శాతం త‌గ్గుద‌ల న‌మోదైన‌ట్టు పేర్కొన్న‌ది. ట్రంప్‌కు అత్యంత స‌న్నిహితుడిగా పేరున్న ఎలాన్ మ‌స్క్‌కు చెందిన టెస్లా ప్ర‌పంచవ్యాప్తంగా న‌ష్టాలు మూట‌గ‌ట్టుకుంటున్న‌ది. జ‌ర్మ‌నీలో గ‌త ఏడాది జ‌న‌వ‌రితో పోల్చితే అమ్మ‌కాలు 70శాతం ప‌డిపోయాయి. పోర్చుగ‌ల్‌, స్వీడ‌న్‌, నార్వేలోనూ టెస్లా అమ్మ‌కాలు గ‌ణ‌నీయంగా ప‌డిపోతున్నాయి. ఈ ప‌రిణామాల‌పై ఒంటికాలిపై లేచిన ట్రంప్‌.. ట్రూత్ సోష‌ల్‌లో ఒక పోస్టు చేస్తూ.. ఎప్పుడు చేసే విధంగానే రాడిక‌ల్ లెఫ్ట్ వెర్రోళ్లు చ‌ట్ట‌వ్య‌తిరేకంగా, కుట్ర‌పూరితంగా టెస్లా బ‌హిష్క‌ర‌ణ‌కు ప్ర‌య‌త్నిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు.

అలా చేస్తేనే స‌రి
డెన్మార్క్‌లో సైతం ప్ర‌జ‌లు అమెరికా వ‌స్తువుల‌ను నిర్ద్వంద్వంగా తిర‌స్క‌రిస్తున్నారు. త‌న‌కు కావాల్సిన స‌రుకులు కొనుగోలు చేసేందుకు సూప‌ర్ మార్కెట్‌కు వెళ్లిన డానిష్ రిటైర్డ్ పోలీసు అధికారి ఒక‌రు.. తాను కొనుగోలు చేసిన‌వాటిలో ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా అమెరికా ఉత్ప‌త్తి లేకుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. కోకో కోలా లేదు.. కాలిఫోర్నియా జిన్ఫెండెల్ వైన్ లేదు.. ఆల్మండ్స్ కూడా లేవు. అమెరికా ఉత్ప‌త్తులు కొన‌కూడ‌ద‌న్న‌దే ఆయ‌న అభీష్టం. ట్రంప్ పాల‌సీల‌పై నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డానికి త‌న‌కు ఇంత‌కు మించిన మార్గం మ‌రొక‌టి క‌నిపించలేద‌ని ఇవాన్ హ‌న్‌సెన్ అనే 67 ఏళ్ల ఆ అధికారి స్ప‌ష్టం చేశారు. డెన్మార్క్‌కు చెందిన భూభాగ‌మైన గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామ‌ని ట్రంప్ చేస్తున్న బెదిరింపుల‌పై ఆయ‌న తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంతేకాదు.. ప‌నామా కాల్వ‌ను, గాజా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటామ‌నడాన్ని సైతం ఆయ‌న తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఇరాన్ దేశానికి చెందిన ఖ‌ర్జూరాలు కొనుక్కొని ఇంటికి వెళ్లిపోయారు. ఇరాన్ కంటే ఇప్పుడు అమెరికాతోనే పెను ముప్పు అని ఆయ‌న భావించ‌డం విశేషం. ఇత‌రుల‌ను బెదిరించ‌డానికి, త‌న ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించ‌డానికి ట్రంప్ ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని, అలాంటివాటికి వ్య‌తిరేకంగా తాను పోరాడుతాన‌ని ఇవాన్‌.. ఒక వార్తా సంస్థ‌కు చెప్పారు.

మాల్స్‌లో ప్ర‌త్యేక ఏర్పాట్లు
అమెరికా ఉత్ప‌త్తుల‌ను వ్య‌తిరేకించేవారి కోసం డెన్మార్క్‌లోని అతిపెద్ద సూప‌ర్ మార్కెట్ చెయిన్ సాలింగ్ గ్రూప్ ఒక వెసులుబాటు క‌ల్పిస్తున్న‌ది. యూరోపియ‌న్ ఉత్ప‌త్తుల‌ను సుల‌భంగా గుర్తించేందుకు వీలుగా వాటికి న‌క్ష‌త్రం ఆకారంలోని లేబుల్‌ను అతికిస్తున్నారు. అమెరికా ఉత్ప‌త్తుల‌ను బాయ్‌కాట్ చేయాల‌నుకునే కొనుగోలుదారుల సౌల‌భ్యం ఈ ప‌ద్ధతిని ఏర్పాటు చేశామ‌ని గ్రూపు సీఈవో ఆండ్రెస్ హాఫ్ చెప్పారు. త‌మ స్టోర్ల‌లో అన్ని దేశాల బ్రాండ్లూ ల‌భ్య‌మ‌వుతాయ‌ని, అదే స‌మ‌యంలో వినియోగ‌దారులు ఏవికోరుకుంటూ అవి అందిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. ఇప్పుడు కొత్త‌గా లేబుల్ అతికించ‌డం అనేది యూరోపియ‌న్ ఉత్ప‌త్తుల‌ను మాత్ర‌మే కొనుగోలు చేయాల‌ని భావించే క‌స్ట‌మ‌ర్ల కోస‌మేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

పెప్సీని వ‌దిలేస్తున్నా..
రాజ‌కీయ ఒత్తిడితో లేదా మిలిట‌రీ ఫోర్స్‌తో తాము గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామ‌ని టెలివిజ‌న్ ప్ర‌సంగంలో ట్రంప్ చెప్ప‌డంపై డెన్మార్క్‌కు చెందిన బో అల్బెర్ట‌స్ అనే 57 ఏళ్ల‌ వ్య‌క్తి అగ్గిమీద గుగ్గిల‌మ‌య్యాడు. తాను శ‌క్తిహీనుడిన‌ని, కానీ ఏదో ఒక‌టి చేస్తాన‌ని చెప్పాడు. అందుకే ఆయ‌న పెప్సీ, కోల్‌గేట్ టూత్‌పేస్ట్‌, హీనిజ్ కెచ‌ప్‌, కాలిఫోర్నియా వైన్ వ‌దిలేశాడు. వాటి స్థానంలో ఐరోపా ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేస్తున్నాడు. అంతేకాదు.. అమెరికా వ‌స్తువుల‌ను బ‌హిష్క‌రించండి.. అనే ఫేస్‌బుక్ పేజీకి ఆయ‌న ఒక అడ్మినిస్ట్రేట‌ర్ కూడా. ఆ గ్రూపులో ఇప్ప‌టికే 80వేల పైచిలుకు స‌భ్యులు ఉన్నారు. తాను పెప్సీ ధ‌ర‌లో స‌గానికే కోలా తాగ‌గ‌ల‌న‌ని ఆయ‌న చెప్పారు. సాధార‌ణ పౌరులు సైతం అమెరికా ఉత్ప‌త్తుల‌ను బ‌హిష్క‌రిస్తున్నారు. ట్రంప్ పాల‌సీల‌తో డెన్మార్క్ ప్ర‌జ‌ల ర‌క్తం మ‌రుగుతున్న‌ద‌ని జేన్స్ ఓల్సెన్ అనే ఎల‌క్ట్రీషియ‌న్ / కార్పెంట‌ర్ చెప్పాడు. త‌న వ‌ద్ద ఉన్న ప‌దివేల డాల‌ర్ల విలువైన‌ అమెరికా కంపెనీ డీ వాల్ట్ ప‌వ‌ర్ టూల్స్‌ను వ‌దిలేయాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నాడు. దాని వ‌ల‌న త‌న‌కు న‌ష్టం క‌లుగుతుంద‌ని తెలిసినా.. ఆ చ‌ర్య‌కు ఆయ‌న సిద్ధ‌ప‌డ్డాడు.

Exit mobile version