విధాత : బుల్లెట్ ట్రైన్ ల నిర్వహణలో చైనా మరో కొత్త రికార్డు నెలకొల్పింది. చైనా రూపొందించిన ‘సీఆర్ 450’ అనే రైలు.. వరల్డ్‌లోనే వేగవంతమైన హై స్పీడ్ రైలుగా రికార్డు సాధించింది. ఇటీవల ట్రయల్ రన్ నిర్వహించగా.. గంటకి అక్షరాల 453 కి.మీ. గరిష్ట వేగంతో మెరుపు మాదిరిగా ఈ బుల్లెట్ ట్రైన్ దూసుకెళ్లింది. 6,00,000 కిలోమీటర్ల మేర పరీక్షలు నిర్వహించిన తర్వాత.. ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకురావాలని చైనా నిర్ణయించింది.
ప్రస్తుతం సీఆర్ 450 బుల్లెట్ రైలును షాంఘై- చెంగ్డు మధ్య హై-స్పీడ్ రైలు మార్గంలో టెస్ట్ చేస్తున్నారు. ఈ రైలు వాణిజ్యపరంగా గంటకు 400 కి.మీ. వేగంతో నడిచేలా రూపొందించారు. ఇది ప్రస్తుతం సేవలలో ఉన్న సీఆర్ 400 ఫక్సింగ్ రైళ్ల కంటే 50 కి.మీ. వేగవంతమైనది. ఈ పాత మోడల్ రైళ్లు గంటకు 350 కి.మీ. వేగంతో నడుస్తాయి. సీఆర్ 450కి ముందు ఈ రైళ్లు ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంతో నడిచే రైళ్లుగా గుర్తింపు పొందాయి. కొత్తగా స్మార్ట్ డిజైన్ తో రూపొందించిన సీఆర్ 450రైలు కేవలం 4 నిమిషాల 40 సెకన్లలో 0 నుండి 350 కి.మీ గరిష్ట వేగం అందుకుంటుంది.
సీఆర్ 450మోడల్ లో గాలి లాగడాన్ని తగ్గించడానికి పొడవైన నోస్ కోన్ (15 మీటర్లు), 20 సెంటీమీటర్ల తక్కువ పైకప్పు రేఖ, మునుపటి మోడల్ కంటే 55 టన్నులు బరువు తక్కువ. ఈ మార్పులు కలిసి ఏరోడైనమిక్ నిరోధకతను 22 శాతం తగ్గించి, వేగం, ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు.ఇంజనీర్లు స్పోర్ట్స్ కార్ల నుండి డిజైన్ ప్రేరణ పొంది ఈ కొత్త బుల్లెట్ రైలును రూపొందించారు.
🇨🇳 | El nuevo tren bala chino CR450 alcanzó los 453 km/h (281 mph) durante las pruebas de calificación previas al servicio. Es el más rápido del mundo. pic.twitter.com/dCVjt34htd
— Alerta Mundial (@AlertaMundoNews) October 21, 2025