Site icon vidhaatha

Donald Trump | డొనాల్డ్‌ ట్రంప్‌పై హత్యాయత్నం.. పెన్సిల్వేనియా ర్యాలీలో ప్రసంగిస్తుండగా కాల్పులు..!

(మ‌ట్టా రెడ్డి, విధాత విదేశీ ప్ర‌తినిధి) Donald Trump| అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలో ఓ ర్యాలీలో ప్రసంగిస్తుండగా ట్రంప్‌పై దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ట్రంప్‌ చెవికి తూటా గాయమైంది. దాంతో హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. తూటా నుంచి ట్రంప్‌ తృటిలో తప్పించుకున్నా ర్యాలీకి హాజరైన ఓ వ్యక్తి మరణించినట్లు తెలిసింది. అదేవిధంగా ట్రంప్‌పై కాల్పులకు పాల్పడిన దుండగుడిని భద్రతాసిబ్బంది కాల్చిచంపినట్లు సమాచారం.

ట్రంప్‌ ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా తూటా దూసుకొచ్చి చెవికి తగలడంతో ఆయన స్టేజీపై పడిపోయారు. భద్రతా సిబ్బంది వెంటనే ఆయన చుట్టూ రక్షణ వలయంగా ఏర్పడ్డారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ట్రంప్‌ సురక్షితంగానే ఉన్నారని భద్రతాధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

దాడిని ఖండించిన అధ్యక్షుడు జో బైడెన్‌

డొనాల్డ్‌ ట్రంప్‌పై హత్యాయత్నాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఖండించారు. ఘటనపై భద్రతా ఏజెన్సీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమెరికాలో హింసకు చోటులేదని వ్యాఖ్యానించారు.

డొనాల్డ్‌ ట్రంప్‌ త్వరగా కోలుకోవాలి

దుండుగుల కాల్పుల్లో గాయపడ్డ డొనాల్డ్‌ ట్రంప్‌ త్వరగా కోలుకోవాలని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ఆకాంక్షించారు. కాల్పుల ఘటనను ఆమె ఖండించారు. ఘటనపై తక్షణమే స్పందించిన అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌, లోకల్‌ అథారిటీస్‌ను ఆమె అభినందించారు.

Exit mobile version