దుబాయ్ పోలీసుల అదుపులో మహదేవ్ యాప్ యజమాని

దేశంలో ఇటీవల కలకలం సృష్టించిన మహదేవ్ బెట్టింగ్ యాప్ మనీ లాండరింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ యాప్ యజమానుల్లో ఒకరైన రవి ఉప్పల్ ను దుబాయిలో అదుపులో

  • Publish Date - December 13, 2023 / 02:53 PM IST

న్యూఢిల్లీ: దేశంలో ఇటీవల కలకలం సృష్టించిన మహదేవ్ బెట్టింగ్ యాప్ మనీ లాండరింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ యాప్ యజమానుల్లో ఒకరైన రవి ఉప్పల్ ను దుబాయిలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈడీ అభ్యర్థన మేరకు ఇంటర్పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా అతన్ని దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారిక వర్గాలు బుధవారం వెల్లడించాయి. రవి ఉప్పల్ ను గత వారమే అదుపులోకి తీసుకున్నట్లు సదర్ వర్గాలు పేర్కొన్నాయి. అతన్ని భారత్ కు తీసుకొచ్చేందుకు దుబాయ్ అధికారులతో ఈడి సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపాయి. ఇక మరో యజమాని సౌరబ్ చంద్రాఖర్ కోసం కూడా దుబాయ్ పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.


ఏంటీ బెట్టింగ్ యాప్ వ్యవహారం..

ఛత్తీస్ ఘఢ్ లోని భిలాయి ప్రాంతానికి చెందిన రవి ఉప్పల్, సౌరబ్ చంద్రాఖర్ దుబాయ్ కేంద్రంగా భారత్ లో మహదేవ్ బెట్టింగ్ యాప్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. అయితే ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ముసుగులో వీరు మనీ లాండరింగ్ కు పాల్పడుతున్నారని ఆరోపణలు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న కోల్‌కతా, భోపాల్, ముంబై తదితర నగరాల్లో సోదాలు నిర్వహించగా వందల కోట్లలో అక్రమ నగదు బయటపడింది. బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చే ఆ మొత్తాన్ని తరలించేందుకు హవాలా మార్గాన్ని అనుసరిస్తున్నట్లు ఈడి గుర్తించింది. అయితే ఈ మనీ లాండరింగ్ ఆరోపణలను రవి ఉప్పల్, సౌరబ్ చంద్రాఖర్ ఖండించారు.


మహాదేవ్ యాప్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని, దాన్ని శుభం సోనీ అనే వ్యక్తి నడిపిస్తున్నాడని చెప్పారు. మరోవైపు ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో చత్తీస్ ఘడ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ యాప్ ప్రమోటర్లు బగేల్ కు 508 కోట్లు చెల్లించినట్లు క్యాష్ కొరియర్ అసిఫ్ దాస్ తన వాంగ్మూలంలో చెప్పాడని ఈడీ ఆరోపించింది. ఛత్తీస్ ఘడ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అసీఫ్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి ఐదు కోట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ డబ్బును తనకు శుభం సోనీ ఇచ్చాడని అసిఫీ చెప్పినట్లు ఈడీ వెల్లడించింది. కాగా ఆ తర్వాత అతడు మాట మార్చినట్లు సమాచారం.

Latest News