Site icon vidhaatha

ఈజిప్ట్ నుంచి గాజాలోకి నిత్యావ‌స‌రాల ట్ర‌క్కులు..



ఇజ్రాయెల్ (Israel) ప్ర‌తిదాడిలో క‌కావిక‌ల‌మ‌వుతున్న గాజాలో ప‌రిస్థితి ఇప్పుడిప్పుడే కుదుట‌ప‌డుతోంది. రఫా నుంచి త‌మ స‌రిహ‌ద్దు ద్వారా మాన‌వ‌తా సాయాన్ని అందించ‌డానికి ఈజిప్ట్ అనుమ‌తించ‌డంతో.. వంద‌ల ట్ర‌క్కులు గాజాలోకి ప్ర‌వేశించాయి. భార‌త్ సైతం గాజా పౌరుల కోసం కొంత స‌ర‌కును పంపించింది. వాయుసేన‌కు చెందిన సీ-17 విమానంలో 32 ట‌న్నుల విప‌త్తు సంబంధిత స‌ర‌కును, 6.5 ట‌న్నుల వైద్య ప‌రిక‌రాలను ఈజిప్ట్‌లోని ఎల్ ఐరిష్ విమానాశ్ర‌యానికి పంపించింది. ఇందులో మందులు, స‌ర్జిక‌ల్ ప‌రిక‌రాలు, టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్‌లు., టార్పాలిన్లు, వాట‌ర్ ప్యూరిఫికేష‌న్ ట్యాబ్లెట్లను పంపించారు. భార‌త్ చేసిన సాయానికి కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ భార‌త్‌లో పాల‌స్తీనా దౌత్య‌వేత్త అద్నాన్ అబు అల్ హైజా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.


మ‌రోవైపు గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొన‌సాగుతున్నాయి. ఆసుప‌త్రిపై రాకెట్ కూలిన అనంత‌రం కాస్త ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిన‌ట్లు క‌నిపించిన ఇజ్రాయెల్‌… మ‌ళ్లీ వేగాన్ని పెంచింది. హ‌మాస్ గ్రూపున‌కు చెందిన ఇద్ద‌రు సీనియ‌ర్ క‌మాండోల‌ను మ‌ట్టుబెట్టిన్లు సైన్యం ప్ర‌క‌టించింది. వైమానిక దాడుల్లో వారు మ‌ర‌ణించార‌ని..వీరితో పాటు మ‌రికొంత స‌భ్యులూ మృతి చెందిన‌ట్లు అంచ‌నా వేస్తున్నామ‌ని పేర్కొంది. ముఖ్యంగా ఉత్త‌ర గాజాలో వైమానిక దాడులు భీక‌రంగా సాగుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ వైపు 4,385 మంది మ‌ర‌ణించార‌ని, 13,561 మంది గాయాల‌పాల‌య్యార‌ని పాల‌స్తీనా వ‌ర్గాలు పేర్కొన్నాయి. మ‌రోవైపు లెబ‌నాన్‌లో న‌క్కిన హిజ్‌బుల్లా ఉగ్ర‌వాదులు కాల్పుల‌కు పాల్ప‌డుతూ.. ఆ దేశాన్ని యుద్ధంలోకి లాగుతున్నాయ‌ని ఇజ్రాయెల్ సైనిక అధికార ప్ర‌తినిధి వ్యాఖ్యానించారు.


ఒక వేళ దానికి స‌రే అనుకుంటే భారీ ప్రాణ న‌ష్టానికి సిద్ధ‌ప‌డాల‌ని తీవ్రంగా హెచ్చ‌రించారు. లెబ‌నాన్ ఇజ్రాయెల్ స‌రిహ‌ద్దు వెంబ‌డి ఉన్న త‌మ ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. దీంతో ఈ ప్రాంతంలోనూ భారీ దాడులు జ‌రిగే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది. ఇక్క‌డే కాకుండా సిరియాలోని డ‌మాస్క‌స్‌, అలెప్పో విమానాశ్రయాల పైనా ఇజ్రాయెల్ దాడులు కొన‌సాగుతున్నాయి. గాజాలోని అల్ అహ్లీ ఆసుప‌త్రిపై రాకెట్ దాడి ఇజ్రాయెల్ ప‌నికాద‌ని త‌మ నిఘా వ‌ర్గాలు ధ్రువీక‌రించిన‌ట్లు ఫ్రాన్స్‌, కెన‌డా వేర్వేరు ప్ర‌క‌ట‌న‌ల్లో పేర్కొన్నాయి. తాము చేసిన స్వ‌తంత్ర ద‌ర్యాప్తులో ఈ మేర‌కు నిర్ధ‌ర‌ణ అయిన‌ట్లు ప్ర‌క‌టించాయి.

Exit mobile version