Site icon vidhaatha

PM Modi | ఈజిప్ట్ ప్ర‌ధానితో.. మోదీ స‌మావేశం

విధాత : ఈజిప్ట్ (Egypt) ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప్ర‌ధాని మోదీ (PM Modi) ఆ దేశ ప్ర‌ధాని మొస్త‌ఫా మాడ్‌బ‌లీతో స‌మావేశ‌మ‌య్యారు. వాణిజ్యం, ఇంధ‌న రంగం, పెట్టుబ‌డుల‌పై వారి మ‌ధ్య లోతైన చ‌ర్చ జ‌రిగిన‌ట్లు శ‌నివారం అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఈ రౌండ్ టేబుల్ స‌మావేశంలో ఏడుగురు కేబినెట్ మంత్రులు, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. ఈజిప్ట్ కేబినెట్‌లో ఉన్న ఈ మంత్రుల బృందానికి ఇండియా యూనిట్ అని పేరు.

ఇరు దేశాల మ‌ధ్య ఒప్పందాల‌ను త్వ‌ర‌గా ఆచ‌ర‌ణ‌లో పెట్ట‌డానికి ఆ దేశ ప్ర‌భుత్వం ఈ ఏర్పాటు చేసింది. ‘ఇంధ‌నం, ఫార్మా, గ్రీన్ హైడ్రోజ‌న్‌, ఐటీ, డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫాంలు, పౌరుల మ‌ధ్య సంబంధాలు త‌దిత‌ర అంశాల‌పై రౌండ్‌టేబుల్ స‌మావేశంలో చ‌ర్చ జ‌రిగింది. ఇండియా యూనిట్ ఏర్పాటుపై ప్ర‌ధాని మోదీ ఈజిప్ట్ ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు’ అని విదేశీ వ్య‌వ‌హారాల శాఖ ట్వీట్ చేసింది.

గ్రాండ్ ముఫ్తీతో భేటీ

అంత‌కు ముందు ఈజిప్ట్ గ్రాండ్ ముఫ్తీ షాకీ ఆలంతో మోదీ స‌మావేశ‌మయ్యారు. ప్ర‌ధాని మోదీని క‌ల‌వ‌డం ఇది రెండో సారని.. ఆయ‌న నాయ‌క‌త్వంలో భార‌త్ అభివృద్ధి వైపు ప‌రుగులు పెడుతోంద‌ని భేటీ అనంత‌రం షాకీ ఆలం మీడియాకు తెలిపారు. మ‌త ప‌ర‌మైన వ్య‌వ‌హారాల్లో భార‌త్ త‌మ‌కు స‌హ‌క‌రిస్తోందని స్ప‌ష్టం చేశారు. ఐటీ సెంట‌ర్ ఫ‌ర్ ఎక్స‌లెన్స్‌ను ఈజిప్ట్‌లో ఏర్పాటు చేయ‌డానికి మోదీ అంగీక‌రించార‌ని, ఆ రంగంలో ఇరు దేశాల స‌హ‌కారానికి అవ‌కాశాలున్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

ప్ర‌ధాని మోదీకి ముఫ్తీ ప్ర‌త్యేక బ‌హుమ‌తిని సైతం అందించారు. వీరిద్ద‌రి మ‌ధ్య ప్ర‌ధానంగా స‌మాజంలో శాంతి, మ‌త సంబంధ విష‌యాల‌పై చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని విదేశీ వ్య‌వ‌హారాల శాఖ వెల్ల‌డించింది. ఈజిప్ట్‌లో ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, హ‌స‌న్ ఆలం ప్రాప‌ర్టీస్ సీఈవో మెద‌త్ హ‌స‌న్ ఆలం, ప్ర‌ముఖ ఈజిప్షియ‌న్ యోగా శిక్ష‌కులు రీమ్ జ‌బాక్, నాదా ఆదెల్‌ల‌ను ఆయ‌న క‌లిశారు. ఆదివారం ప్ర‌ధాని మోదీ కైరోలో ఉన్న అల్ హ‌కీం మ‌సీద్‌ను సంద‌ర్శించ‌నున్నారు. నాలుగో పురాత‌నమైన ఈ మ‌సీదులో ఆయ‌న అర‌గంట పాటు గ‌డ‌ప‌నున్నారు.

Exit mobile version