Site icon vidhaatha

గాజాపై అర్ధ‌రాత్రి వైమానిక దాడులు.. 70 మంది మృతి



విధాత‌: అర్ధ‌రాత్రి వేళ గాజా (Gaza) పై ఇజ్రాయెల్ (Israel Conflict) జ‌రిపిన గ‌గ‌న‌త‌ల దాడుల్లో క‌నీసం 70 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 320 ల‌క్ష్యాల‌పై విచ్చ‌ల‌విడిగా బాంబు దాడులు జ‌రిగినట్లు హ‌మాస్ అధికార వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ‘సొరంగాల‌తో హ‌మాస్ ద‌ళాలు న‌క్కిఉన్న ప‌లు లక్ష్యాల‌పై దాడులు నిర్వ‌హించాం. ఇందులో ఇస్లామిక్ జిహాద్ ఉగ్ర‌వాదులు, ఆయుధ భాండాగారాలు మొద‌లైన‌వాటిని దెబ్బ‌తీశాం’ అని ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.


అయితే ఇజ్రాయెల్ వేసిన ఒక బాంబు జ‌బాలియా శ‌ర‌ణార్థి శిబిరం ప్రాంతంలో ప‌డింద‌ని.. దీని వ‌ల్ల ప‌దుల సంఖ్య‌లో అమాయ‌కులు గాయ‌ప‌డ్డార‌ని వార్త‌లు వెలువ‌డ్డాయి. మ‌రోవైపు గాజా నుంచి రాకెట్ల దాడిని హ‌మాస్ మ‌రోసారి మొద‌లుపెట్టిన‌ట్లు స‌మాచారం. అంద‌రూ ఊహించిన‌ట్లుగానే లెబ‌నాన్ స‌రిహ‌ద్దుల్లోనూ ఉద్రిక్త‌త‌లు తీవ్ర త‌ర‌మ‌వుతున్నాయి. త‌మ యుద్ధ విమానం జ‌రిపిన దాడిలో రెండు హిజ్‌బుల్లా సెల్స్‌ను నాశ‌నం చేశామ‌ని ఇజ్రాయెల్ సైన్యం ప్ర‌క‌టించింది. త్వ‌ర‌లోనే రాకెట్ లాంఛ‌ర్ల‌ను, యాంటీ ట్యాంక్ మిసైళ్ల‌ను ప్ర‌యోగిస్తామ‌ని తెలిపింది.


పెరుగుతున్న సైనిక అవ‌స‌రాల‌ను తీర్చ‌డానికి వివిధ దేశాల్లో స్థిర‌ప‌డిన ఇజ్రాయెల్ మాజీ సైనికులు స్వ‌దేశానికి త‌ర‌లి వ‌స్తున్నారు. న్యూయార్క్‌, లండ‌న్‌, లాస్ ఏంజెలెస్‌, ప్యారిస్‌, బ్యాంకాక్‌, ఏథెన్స్ త‌దిత‌ర న‌గ‌రాల నుంచి టెల్ అవీవ్‌కు విమానాలు వ‌స్తూనే ఉన్నాయి. ఇప్ప‌టికే యూఎస్ నుంచి 10 వేల మంది రాగా ఇలా సుమారు 3 ల‌క్ష‌ల 60 వేల మంది వ‌ర‌కు రిజ‌ర్వ్‌డ్ సైనికులు యుద్ధంలో పాల్గొన‌నున్నార‌ని అంచ‌నా.


గాజాలోకి భూత‌ల దాడులు ఎప్పుడు ఎలా చేయాల‌నే దానిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజ‌మ‌న్ నెత‌న్యాహు ఉన్న‌త స్థాయి సైనిక జ‌న‌ర‌ల్స్‌తో వార్ రూం స‌మావేశం నిర్వ‌హించారు. ఇదిలా ఉండ‌గా హ‌మాస్‌పై అమెరికా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించింది. గాజా నుంచి త‌మ దేశ పౌరులు బ‌య‌ట‌ప‌డ‌కుండా హ‌మాస్ స‌భ్యులు అడ్డుకుంటున్నార‌ని ఆరోపించింది.


ఇస్లామిక స్టేట్ హెచ్చ‌రిక‌లు


ఇజ్రాయెల్ – హ‌మాస్ సంక్షోభం మ‌ధ్య ప్రాచ్యంలోనే కాకుండా ప‌శ్చిమ దేశాల‌ను, యూర‌ప్‌ను సైతం ఇబ్బంది పెడుతోంది. తాజాగా ఉగ్ర‌వాద సంస్థ ఇస్లామిక్ స్టేస్ చేసిన హెచ్చరిక‌ల‌తో ఆ దేశాలు ఉలిక్కిప‌డుతున్నాయి. అమెరికా, యూకే, ఇజ్రాయెలీ ల‌క్ష్యాల‌పై దాడులు నిర్వ‌హించాల‌ని త‌మ సానుభూతిప‌రుల‌ను ఆదేశించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌త రెండు వారాలుగా ఆల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్‌, హిజ్‌బుల్లా త‌దిత‌ర ఉగ్ర‌వాద గ్రూపులు హ‌మాస్ వికృత్యాల‌ను అభినందిస్తూ ప్ర‌క‌ట‌న‌లు జారీ చేస్తున్న విష‌యం తెలిసిందే.

Exit mobile version