Site icon vidhaatha

Mpox outbreak । ముంచుకొస్తున్న ఎంపాక్స్‌ వైరస్‌.. ఇప్పటికే 116 దేశాల్లో అలజడి

Mpox outbreak । కొవిడ్‌ విశ్వమారి సృష్టించిన అల్లకల్లోలాన్ని మరువక ముందే మరో మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే 116 దేశాలకు పాకిన ఎంపాక్స్‌ (mpox outbreak) వైరస్‌పై చర్చించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. 2022 నుంచి ఉనికిలో ఉన్న ఎంపాక్స్‌ వైరస్‌లో ప్రస్తుత వేరియంట్‌ను అత్యంత తీవ్రమైన గ్రేడ్‌ 3 ఎమర్జెన్సీగా ఇటీవలి నివేదికలో డబ్ల్యూహెచ్‌వో పేర్కొన్నది. అంటే.. ఇది గ్రేడింగ్‌లో అత్యున్నత స్థాయి. ఈ నేపథ్యంలో తక్షణ, అత్యవసర దృష్టిసారించాల్సిన అవసరం ఏర్పడింది. 2022లో బయటపడినప్పటికీ.. ఇటీవలి కొద్ది నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్‌ వేగంగా విజృంభిస్తున్నది. ప్రత్యేకించి ఆఫ్రికాలోని పశ్చిమ, మధ్య, తూర్పు దేశాల్లో విస్తరించిన ఈ వైరస్‌.. ఇప్పుడు అమెరికా, యూరప్‌ దేశాల్లోకి ప్రవేశించింది. భారతదేశంలో తొలి కేసు 2022లో బయటపడింది. కేరళలోని 35 ఏళ్ల రోగికి ఎంపాక్స్‌ సోకినట్టు గుర్తించారు. ఎంపాక్స్‌కు మందు ఏమీ లేదు. కానీ.. సపోర్టివ్‌ కేర్‌, పరిమిత స్థాయిలో వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.

ఏమిటీ ఎంపాక్స్‌?

మంకీపాక్స్‌గా పిలిచే ఈ వైరల్‌ రోగానికి ఎంపాక్స్‌ వైరస్‌ కారణమవుతుంది. ఇది ఆర్థోపాక్స్‌వైరస్‌ జాతికి చెందినది. దీనిని 1958లో డెన్మార్క్‌లో (Denmark) కోతులలో తొలిసారి గుర్తించారు. అందుకే దీనికి మంకీపాక్స్‌ (monkeypox) అనే పేరు స్థిరపడిపోయింది. కానీ.. ప్రాథమికంగా ఇది ఎలుకలు, ఇతర చిన్నచిన్న క్షీరదాలను ప్రభావితం చేస్తుంది. జూనోటిక్‌ వ్యాధి (zoonotic viral disease) (జంతువులనుంచి మనుషులకు సోకే వ్యాధి) పాక్స్‌విరిడై కుటుంబానికి చెందినది. స్మాల్‌పాక్స్‌ (మశూచి) (smallpox), కౌపాక్స్‌ (cowpox), వాక్సినియా తదితర వ్యాధులకు కూడా పాక్స్‌విరిడై (Poxviridae) కారణమవుతుంటుంది.

ప్రస్తతం ఈ వైరస్‌లో రెండు సమూహాలు లేదా తెగలు ఉన్నాయి. క్లాడ్‌1 అనేది ప్రధానంగా మధ్య ఆసియా, తూర్పు ఆఫ్రికా దేశాల్లో కనిపిస్తుంది. క్లాడ్‌2 అనేది పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
1970లో మొదటిసారి మనుషుల్లో ఈ వైరస్‌ను గుర్తించారు. కాంగోలో ఒక తొమ్మిదేళ్ల బాలిడికి అప్పట్లో ఈ వ్యాధి సోకింది. 2022లో ఈ వైరస్‌ విస్తరించిన సమయంలో దాని పేరును మంకీపాక్స్‌ నుంచి ఎంపాక్స్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్చింది. ఒక జంతువర్గం పట్ల వివక్ష ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నది.

లక్షణాలు ఇవే..

స్మాల్‌పాక్స్‌ (మశూచి)కి ఉండే జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, ముఖం, శరీరంలోని ఇతర ప్రాంతాల్లో దద్దర్లు, చిన్న నీటి పొక్కులు వంటి లక్షణాలు (Mpox SYMPTOMS) ఎంపాక్స్‌లోనూ కనిపిస్తాయి. ఈ వ్యాధి సోకిన జంతువులను తాకడం, శరీర స్రావాలు, లేదా కలుషిత మెటీరియల్స్‌ను తాకడం ద్వారా ఇది మానవులకు సోకుతుంది. వైరస్‌ సోకిన మనిషికి దగ్గరగా ఉన్నా, సదరు మనిషి నోటి నుంచి వెలువడే తుంపర్ల ద్వారా కూడా ఇది వ్యాపిస్తుంది. వ్యాధి లక్షణాలు రెండు నుంచి నాలుగు వారాల వరకూ ఉంటాయి. కొవిడ్‌ తరహాలోనే ఇది కూడా ప్రారంభంలో చాలా స్వల్ప స్థాయిలోనే లక్షణాలను చూపిస్తుంది. కానీ కొందరిలో తీవ్ర అస్వస్థతకు దారి తీస్తుంది. వైద్యుల పర్యవేక్షణ, చికిత్స తప్పనిసరి అవుతాయి. పిల్లలు, గర్భిణులు, బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ (immune system) కలిగినవారికి సాధారణంగా ఇది తీవ్రమైన ప్రమాదంగా పరిణమిస్తుంది.

వైరస్‌ సోకినవారికి పరీక్షలు?

పోలిమరేజ్‌ చైన్‌ రియాక్షన్‌ (పీసీఆర్‌)ను (polymerase chain reaction (PCR)) ఉపయోగించి వైరల్‌ డీఎన్‌ఏను నిర్ణీత ప్రమాణాలు కలిగిన ల్యాబొరేటరీలో పరీక్షించాలని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంటున్నది.

Exit mobile version