Site icon vidhaatha

SOFI | సగానికిపైగా భారతీయులు ఆరోగ్యకరమైన ఆహారానికి దూరం: ఎస్‌వోఎఫ్‌ఐ నివేదిక

న్యూఢిల్లీ: ఒకవైపు 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చుతామని కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం చెబుతున్నది. కానీ.. దేశంలో 55.6 శాతం మందికి అంటే.. సగానికిపైగా జనాభా ఆరోగ్యకరమైన ఆహారం తినే స్థోమత కలిగి లేరని ఐక్య రాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆహారభద్రత, పోషకాలు (ఎస్‌వోఎఫ్‌ఐ) నివేదిక తెలిపింది. 2024, జూలై 24న ఈ నివేదిక వెలువడింది. కొవిడ్‌ కాలం 2020 మినహాయిస్తే.. ఈ ధోరణి తగ్గుముఖం పడుతున్నట్టు కనిపించినా దక్షిణాసియా దేశాలన్నింటి సగటు (53.1%)తో పోల్చితే ఎక్కువని నివేదిక పేర్కొన్నది. అంతేకాకుండా.. 2020లో పాకిస్థాన్‌ (58.7%) తర్వాత ఈ ప్రాంతంలో రెండో అత్యధిక శాతమని తెలిపింది. ఆఫ్ఘనిస్థాన్‌ గణాంకాలు నివేదికలో పొందుపర్చలేదు.
2017లో ఆరోగ్యకరమైన ఆహారాన్ని కొనుగోలు చేసే స్థోమత లేని వారు భారతదేశంలో 69.5 శాతం ఉన్నారని నివేదిక తెలిపింది. ఐక్య రాజ్య సమితికి చెందిన ఐదు సంస్థలు ఈ నివేదికను రూపొందించాయి. ఆరోగ్యకరమైన ఆహారం నాలుగు ముఖ్యమైన అంశాలను కలిగి ఉంటుందని నివేదిక పేర్కొన్నది. 1. వైవిధ్యం (వివిధ ఆహార సమూహాలలో, అంతటా), 2.సమర్థత (కావల్సిన అన్ని పోషకపదార్థాలు సమృద్ధిగా ఉండటం), 3. పరిమితి (పేలవమైన ఆరోగ్యానికి సంబంధించిన ఆహారాలు, పోషకాలు), సమతుల్యం (శక్తి, స్థూల పోషకాలు తీసుకోవడం).
భారతదేశంలో ఆహార భద్రత, పోషకాహారానికి చేస్తున్న వ్యయాలు పరస్పరం సంబంధం కలిగి ఉన్నాయి. ఆహార వినియోగానికి మొత్తం వ్యయంలో 83 శాతం కేటాయిస్తున్నారు. ఇందులో ఆహార లభ్యత, సౌలభ్యం కూడా ఉంటుంది. 15 శాతం మాత్రమే ఆహార అభద్రత, పోషకాహారలేమిపై కేటాయిస్తున్నారు.
భారతదేశంలో ఆహార అలవాట్లపై తీవ్ర ఆందోళనలను ఈ ఏడాది మే నెలలో విడుదలైన ఒక అంతర్జాతీయ నివేదిక వ్యక్తం చేసింది. పౌష్టికాహారం ఎంపికతో పోల్చితే అనారోగ్యకరమైన ఆహారం తీసుకునే ధోరణి గణనీయంగా పెరిగిందని తెలిపింది. కనీసం 38 శాతం మంది భారతీయులు అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్నరని 28 శాతం మంది మాత్రమే అన్ని రకాల పోషకాహారాలు తీసుకుంటున్నరని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 35 శాతం మంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినే స్థోమత కలిగి లేరని నివేదిక పేర్కొన్నది. అందులో 64.8 శాతం మంది ఆఫ్రికా ఖండంలో ఉంటే.. 35.1 శాతం మంది ఆసియా దేశాల్లో ఉన్నారని తెలిపింది.
2021, 2023 మధ్య భారతదేశంలో 19.46 కోట్ల మంది పోషకాహారం లోపం కలిగి ఉన్నారని, ఇది మొత్తం జనాభాలో 13.7 శాతమని పేర్కొన్నది. ఒక ఏడాది కాలంలో తన రోజువారీ శక్తికి అవసరమైన కనీస ఆహారాన్ని ఒక వ్యక్తి పొందలేక పోవడమే పోషకాహారలేమి అని ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏవో) నిర్వచిస్తున్నది.

 

Exit mobile version