వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో తనను మళ్లీ గెలిపిస్తే ఔట్‌సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. అదే జరిగితే భారతదేశంలో ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉన్నదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అమెరికా పరిశ్రమలకు భారతదేశంలో వందల కోట్ల డాలర్ల ఔట్‌సోర్సింగ్ వ్యాపారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ‘ఔట్ సోర్సింగ్‌ను ఆపేస్తాను. మాన్యుఫాక్చరింగ్ సూపర్‌హబ్‌గా అమెరికాను మార్చుతాం’ అని రిపబ్లికన్ పార్టీ 2024 ప్లాట్‌ఫాం పేర్కొన్నది. పార్టీ అభ్యర్థిగా ట్రంప్‌ను అధికారికంగా ప్రకటించనున్న కార్యక్రమం వచ్చేవారం నిర్వహించనున్న నేపథ్యంతో ఈ పత్రాన్ని విడుదల చేశారు. ట్రంప్ విజయం సాధిస్తే చేపట్టబోయే 20 అంశాలపై అందులో హామీలు ఇచ్చారు. మరోసారి అమెరికాను గొప్పగా తీర్చిదిద్దడం (ఎంఏజీఏ) అనే విజన్‌తో ప్రతి ఓటరు సులభంగా అర్థం చేసుకునే రీతిలో ఈ పత్రాన్ని రూపొందించినట్టు ట్రంప్ ప్రచార సీనియర్ సలహాదారులు క్రిస్ లాసివిటా, సుసీ వైల్స్ తెలిపారు. ఈ జాబితాలో ఇంకా సరిహద్దులను మూసివేయడం, అక్రమ వలసదారులను తిరిగి అమెరికా నుంచి పంపించివేసే భారీ కార్యక్రమం, మూడో ప్రపంచ యుద్ధాన్ని నివారించడం, ఉద్యోగులకు పన్ను మినహాయింపులు, ద్రవ్యోల్బణానికి ముగింపు పలకడం, ప్రపంచంలోనే అత్యంత బలమైన మిలిటరీని నిర్మించడం, యూరప్, పశ్చిమ ఆసియాలో శాంతి స్థాపన, డాలర్‌ను ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా మళ్లీ తయారు చేయడం ఉన్నాయి.
ప్రత్యేకించి ఔట్‌సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేస్తామనడం భారత ప్రభుత్వానికి, ఇక్కడి వ్యాపారాలకు పెను విఘాతంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో (2017 నుంచి 2021) అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్న సమయంలో ఇటువంటి చర్యలనే ఆయన ప్రతిపాదించారు. అమెరికా కంపెనీల ఔట్‌సోర్సింగ్‌లో భారతదేశంలోని కంపెనీలు సింహభాగాన్ని ఆక్రమిస్తున్నాయి. ఆ సమయంలో అమెరికా యంత్రాంగం హెచ్ 1బీ వీసా కార్యక్రమాన్ని టార్గెట్ చేసింది. హై స్పెషాలిటీ ఉద్యోగాల్లో స్థానికంగా నిపుణులు దొరకకపోవడంతో అమెరికా కంపెనీలు హెచ్ 1బీ వీసాలపై భారతీయులను చేర్చుకునేవి. మొత్తం ప్రపంచ దేశాల నుంచి వచ్చే ఔట్‌సోర్సింగ్ బిజినెస్‌లో ఒక్క అమెరికా నుంచే 62 శాతం ఉండటం విశేషం. ఫోర్డ్ మోటర్స్, సిస్కో, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ (ఎమెక్స్), జనరల్ ఎలక్ట్రిక్స్, మైక్రోసాఫ్ట్ వంటి అనేక కంపెనీలు తమ పనిని భారతదేశంలోని కంపెనీలకు ఔట్‌సోర్సింగ్‌కు ఇస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడిగా గెలిస్తే.. ట్రంప్ చేయబోయే పనుల జాబితా ఇదే!
