ప్ర‌త్యేక ఉగ్ర‌వాద గ్రూపుగా హౌతీ ద‌ళాలు.. త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్న అమెరికా !

అగ్ర‌దేశాల‌కు తాజాగా ప‌క్క‌లో బ‌ల్లెంలా మారిన హౌతీ తిరుగుబాటుదారుల‌ను ప్ర‌త్యేక ఉగ్ర‌వాద గ్రూపుగా అమెరికా ప్ర‌క‌టించనుంద‌ని ఒక నివేదిక చ‌క్క‌ర్లు కొడుతోంది

  • Publish Date - January 17, 2024 / 02:45 PM IST

అగ్ర‌దేశాల‌కు తాజాగా ప‌క్క‌లో బ‌ల్లెంలా మారిన హౌతీ (Houthis) తిరుగుబాటుదారుల‌ను ప్ర‌త్యేక ఉగ్ర‌వాద గ్రూపు (Terrorist Group) గా అమెరికా ప్ర‌క‌టించనుంద‌ని ఒక నివేదిక చ‌క్క‌ర్లు కొడుతోంది. ఎర్ర‌స‌ముద్రంలో ప్రయాణించే వాణిజ్య నౌక‌ల‌నై హౌతీ తిరుగుబాటుదారులు కొన్ని రోజులుగా వ‌రుస దాడులు చేస్తుండ‌టంతో కొన్ని వేల కోట్ల డాల‌ర్ల న‌ష్టం వాటిల్లుతోంది. అంతే కాకుండా అమెరికా (America) , బ్రిట‌న్ త‌దిత‌ర దేశాల్లో స‌ర‌కుల ద‌ర‌లు సాధార‌ణం కంటే మూడు రెట్లు అధికంగా మారాయి. దీంతో వీరిని అదుపులో ఉంచాల‌నే ఆలోచ‌న‌తో అమెరికా, బ్రిట‌న్ వాయుసేన‌లు నేరుగా హౌతీ శిబిరాల‌పై దాడుల‌ను కూడా చేయ‌డం గ‌మ‌నార్హం. కాగా ట్రంపు హయాంలో హౌతీ ద‌ళాల‌ను విదేశీ ఉగ్ర‌వాద సంస్థ‌గా ప్ర‌క‌టించారు. సౌదీ అండ ఉన్న యెమ‌న్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వీరు పోరాడుతూ ప్ర‌భుత్వాన్ని హ‌స్త‌గ‌తం చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటారు.


అయితే 2021లో బైడెన్ ప్ర‌భుత్వం ట్రంప్ తీసుకున్న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుంది. హౌతీల‌ను ఉగ్ర‌వాదులుగా ముద్ర‌వేస్తే వారి అధీనంలో ఉన్న ప్రాంత ప్ర‌జ‌ల‌కు మాన‌వ‌తాసాయం అందించ‌డం క‌ష్ట‌మవుతుంద‌న్న కార‌ణం చూపి త‌న నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించుకుంది. 2022 ఏప్రిల్ వ‌ర‌కు కూడా ఈ ఒప్పందాన్ని హౌతీ ద‌ళాలు పాటిస్తూ.. మాన‌వ‌తా సాయానికి స‌హ‌క‌రించేవి. కానీ ప్ర‌స్తుతం ప‌రిస్థితి మారిపోయింది. తిరిగి హౌతీల‌ను ప్ర‌త్యేక ఉగ్ర‌వాద గ్రూపుగా ప్ర‌క‌టించ‌నుండ‌టంతో ప‌లు ప‌రిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఒక వేళ అమెరికా ఈ నిర్ణ‌యం తీసుకుంటే.. హౌతీ సంస్థ‌ల ఆస్తుల‌ను, వ్య‌క్తిగ‌త సంప‌ద‌ను అమెరికా నిర్బంధించొచ్చు. వారితో ఏ చిన్న సంబంధం ఉన్న సంస్థ‌నైనా, వ్య‌క్తినైనా ఆర్థికంగా అష్ట‌దిగ్బంధం చేసేందుకు వీల‌వుతుంది. ఈ నెల 12న అధ్య‌క్ష‌డు జో బైడెన్ ను.. హౌతీల‌ను ఉగ్ర‌వాదుల‌ని పిల‌వ‌డానికి మీరు సిద్ధ‌మేనా అని ఒక విలేక‌రి ప్ర‌శ్నింగా.. అవును వారు అలానే ఉన్నారు అని స‌మాధాన‌మిచ్చారు. మ‌రోవైపు మ‌ధ్యధ‌రా ప్రాంతంలో ఉన్న అమెరికా నేవీ, వాయు సేన‌లు.. హౌతీల‌పై ఎదురుదాడుల‌ను ప్రారంభించాయి.


హౌతీలు ప్ర‌యోగించిన నాలుగు యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిప‌ణుల‌ను కూల్చేశామ‌ని యూఎస్ మిల‌ట‌రీ సెంట్ర‌ల్ క‌మాండ్ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. కొన్ని షిప్ కంపెనీలు ఇప్ప‌టికే న‌ష్టానికి భ‌య‌ప‌డి.. ఎర్ర‌స‌ముద్రం గుండా కాకుండా ఆఫ్రికాను చుట్టి యూర‌ప్‌లోకి ప్ర‌వేశిస్తున్నాయి. దీని వ‌ల్ల కాలం, డ‌బ్బుకూడా వృథా అవుతున్నాయి. కొన్ని నివేదిక‌ల ప్ర‌కారం. హౌతీల దాడుల వ‌ల్ల నౌకా ర‌వాణా ఛార్జీలు 60 శాతం పెరిగాయి. ఒక 20 అడుగుల కంటెయిన‌ర్‌ను యూర‌ప్ లేదా అమెరికాకు ర‌వాణా చేయాలంటే ఇంత‌కుముంద 500 డాల‌ర్లు చెల్లిస్తే స‌రిపోయేది. ఇప్పుడు అదే కంటెయినర్‌కు కంపెనీలు సుమారు 2000 డాల‌ర్లు చెల్లించాల్సి వ‌స్తోంది.

Latest News