Donald Trump | ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీతో సన్నిహిత సంబంధాలు ఉన్న కయ్‌హన్ అనే అతివాద ఇరానీ పత్రిక ప్రచురించిన సంపాదకీయం సంచలనం రేపుతున్నది. సంపాదక రేఖలను దాటేసిన ఈ కాలం.. ఇప్పుడు అమెరికా, ఇరాన్ శత్రుత్వంపై పూర్తి అవగాహన ఉన్న రాజకీయ పరిశీలకులను సైతం కనుబొమలేగరేయిస్తున్నది. ‘డొనాల్డ్ ట్రంప్ హత్యకు క్షమాపణలేని పిలుపు’ పేరిట ఈ కాలం ప్రచురితమైంది. ‘అతను దారి తప్పాడు. అమరుడు సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఏదో ఒక రోజు కొన్ని బుల్లెట్లను అతని (ట్రంప్) ఖాళీ పుర్రెలోకి దూసుకుపోతాయి. శపించిన మరణపు గిన్నెలో ఆయన తాగుతున్నాడు..’ అని పర్షియన్ భాషలో రాసిన ఆ వ్యాసం హెచ్చరించింది. ఈ వాఖ్యలతోనే ఆ సంపాదకీయం సరిపెట్టలేదు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న యుద్ధోన్మాదిగా ట్రంప్‌ను అభివర్ణించింది. గాజాలో అణచివేతకు గురవుతున్నవారు, ప్రతిఘటన శక్తులను ఉద్దేశిస్తూ.. నీతిమంతులందరూ ఆయన మరణాన్ని స్వాగతిస్తారని పేర్కొన్నది.
ఖాసీం సులేమానీ.. ఇరాన్ మిలిటరీలో ఇస్లామిక్ రివొల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) అధినేతగా, కమాండర్ ఆఫ్ క్వాడ్స్ ఫోర్స్‌గా పనిచేశారు. ఇరాన్ మిలటరీ ఆపరేషన్లన్నీ ఆయన కనుసన్నల్లో నిర్వహించినవే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో 2020లో హత్యకు గురయ్యారు. మధ్య ఆసియా ప్రాంతంలో ఏకైక అతిపెద్ద శక్తిమంతుడిగా సులేమానీ పేరుగాంచారు. సులేమానీ వ్యూహాలు ఇజ్రాయెల్ మెడ చుట్టూ ఉరి బిగించాయని అంటుంటారు. అలాంటి నేత హత్యకు ప్రతీకారంగా ఈ వ్యాసం పిలుపునిచ్చింది. ట్రంప్ లేదా అతని బలిసిన మిలిటరీ ఏ ఒక్క తప్పటడుగు వేసినా అమెరికా మునుపు ఎన్నడూ చూడని భయానక రిటాలియేషన్‌ను చూడక తప్పదని హెచ్చరించింది. ట్రంప్ విధానాలు సృష్టిస్తున్న విధ్వంసం నుంచి అమెరికాను కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాల్సింది ఇక అమెరికా ప్రజలేనంటూ ముక్తాయింపునిచ్చింది.
ఈ వ్యాసంపై ఇరాన్ ప్రెస్ సూపర్‌వైజరీ బోర్డు తీవ్రంగా స్పందించింది. నేషనల్ ప్రెస్ లా కు సంబంధించి దేశ రాజ్యాంగంలోని ఆరవ అధికరణం ప్రకారం కయహన్‌కు నోటీసులు జారీ చేసింది. ఇటువంటి కంటెంట్‌ను ముద్రించడం దేశ భద్రతకు ప్రమాదకారిగా లేదా ప్రభుత్వ ప్రయోజనాలకు నష్టం వాటిల్లేదిగా పేర్కొన్నది. సులేమానీ హత్య కేసును చట్టప్రకారం పరిష్కరించుకోవడమే ఇరాన్ వైఖరి అని సాంస్కృతిక శాఖ పేర్కొన్నది. ఈ వ్యాసం రాసిన వారి పేరును మాత్రం సదరు పత్రిక ప్రచురించలేదు. సుప్రీం నేత అయతొల్లా ఖమేనీ వర్గాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పే ఈ పత్రిక సంపాదకుడు, కరడుగట్టిన సంప్రదాయవాది హోస్సేన్ షరియత్‌మాద్రి.. ఈ కథనాన్ని రాసి ఉండొచ్చని, లేదా ప్రచురణకు అనుమతించి ఉండొచ్చని భావిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితమే ట్రంప్ తన దృష్టిని ఇరాన్ అణు కార్యక్రమాలపై సారించారు. తమతో ఒప్పందానికి రాకపోతే బాంబులేసి ఇరాన్‌ను పేల్చేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో ఈ రచన ప్రచురితమైంది. ఇరాన్ తలొగ్గకపోతే సెకండరీ టారిఫ్‌లు సైతం విధిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అయితే.. ప్రతీకార సుంకాల విధింపు నేపథ్యంలో తలెత్తిన తక్షణ ఆగ్రహావేశాలను ఈ వ్యాసం చాలా తక్కువగానే ప్రస్తావించినట్టు కనిపిస్తున్నది. ‘ఆయన బెదిరింపులకు దిగుతాడు.. వెనక్కు తగ్గుతాడు. ఫలితం? రోజు రోజుకూ అమెరికా పరిస్థితి దిగజారుతున్నది’ అని ఆ వ్యాసంలో రాశారు. ట్రంప్ చర్యలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు 3 ట్రిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.