గాజాలోని 150 భూగ‌ర్భ స్థావ‌రాల‌పై ఇజ్రాయెల్ దాడులు..

  • Publish Date - October 28, 2023 / 08:37 AM IST

  • ప‌లువురు ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టిన‌ట్లు వెల్ల‌డి
  • ఐరాస స‌భ‌లో నెగ్గిన జోర్డాన్ తీర్మానం.. ఓటింగ్‌కు భార‌త్ దూరం


గాజాపై భూత‌ల‌దాడిని ప్రారంభించిన ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్‌) హ‌మాస్ ఉగ్ర‌వాదుల‌కు సంబంధించిన స్థావ‌రాల‌పై విరుచుకుప‌డుతోంది. శ‌త్రువుల సొరంగాల‌పై, భూగ‌ర్భ క్యాంపుల‌పై దాడి చేశామ‌ని, ప‌లువురిని మ‌ట్టుబెట్టామ‌ని తెలిపింది. సుమారు 150 ప్ర‌దేశాల్లో దాడులు జ‌రిగిన‌ట్లు వెల్ల‌డించింది. ఐడీఎఫ్ మ‌ట్టుబెట్టిన వారిలో హ‌మాస్ వాయుద‌ళం చీఫ్ అసేమ్ అబు ర‌కాబా కూడా ఉన్నార‌ని వార్తా క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.


అనంత‌రం ఈ వార్త‌ల‌ను ఐడీఎఫ్ ధ్రువీక‌రించింది. హ‌మాస్ ఉప‌యోగించే యూఏవీలు, డ్రోన్‌లు, పారాగ్లైడ‌ర్లు త‌దిత‌రాల‌న్నీ అబూ ర‌కాబా అధీనంలోనే ఉంటాయ‌ని తెలుస్తోంది. అక్టోబ‌రు 7న హ‌మాస్ స‌భ్యులు జ‌రిపిన మార‌ణ‌కాండ‌లో అతడి పాత్ర చాలా కీల‌క‌మ‌ని నిపుణులు పేర్కొంటున్నారు. మ‌రోవైపు గాజాలో పౌరుల మ‌ర‌ణాల సంఖ్య పెరిగే ప్ర‌మాద‌ముంద‌ని యూఎన్ ఏజెన్సీ ఫ‌ర్ పాల‌స్తీనియ‌న్ రెఫ్యుజీ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. నిత్య‌వ‌స‌రాల నిల్వ‌లు నిండుకుంటున్నాయ‌ని వెల్ల‌డించింది. ఈ నేప‌థ్యంలో అమెరికా ర‌క్ష‌ణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్.. ఇజ్రాయెల్ ర‌క్ష‌ణ మంత్రి గాలంట్‌తో ఫోన్‌లో మాట్లాడారు.


గాజాపై జ‌రుగుతున్న దాడుల్లో పౌరుల ప్రాణాల‌కు ముప్పు వాటిల్ల‌కుండా చూడాల‌ని ఆస్టిన్ సూచించారు. కాగా గాజాలో ఇజ్రాయెల్ దాడుల‌ను నిలిపివేయాల‌ని కోరుతూ ప్ర‌పంచంలో ప‌లుచోట్ల నిర‌స‌న‌లు జ‌రుగుతున్నాయి. వంద‌ల మంది పాల‌స్తీనా సానుభూతిప‌రుల‌తో న్యూయార్క్‌లోని గ్రాండ్ సెంట్ర‌ల్ టెర్మిన‌ల్ నిండిపోయింది. వీరికి కొంత మంది యూదులు కూడా జ‌త‌క‌ల‌వ‌డం విశేషం. న్యూజిలాండ్‌లో కూడా పాల‌స్తీనా, గాజాకు మ‌ద్ద‌తుగా నిర‌స‌న జ‌రిగింది. వేల మంది నిర‌స‌న‌కారులు రాజ‌ధాని వెల్లింగ్ట‌న్ వీధుల్లోకి చేరి పాల‌స్తీనాకు స్వేచ్ఛ కావాల‌ని నిన‌దించారు.


ఓటింగ్‌కు భార‌త్ దూరం..


గాజాలో మాన‌వ సంక్షోభానికి ముగింపు ప‌ల‌కాల‌ని కోరుతూ ఐరాస జ‌న‌ర‌ల్ అసెంబ్లీలో జోర్డాన్ శుక్ర‌వారం తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. అయితే ఈ ఓటింగ్ నుంచి భార‌త్ దూరం జ‌రిగింది. తీర్మానంలో హ‌మాస్ కార్య‌క‌లాపాల‌ను ఖండించ‌క‌పోవ‌డం, అస‌లు హ‌మాస్ ఊసే లేక‌పోవ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై ఐరాస‌లో భార‌త డిప్యూటీ శాశ్వ‌త ప్ర‌తినిధి యోజ‌నా పటేల్ మాట్లాడుతూ.. అక్టోబ‌ర్ 7న జ‌రిగిన ఘోరాన్ని తీర్మానంలో ప్ర‌స్తావించ‌లేద‌న్నారు.


అలాగే హ‌మాస్ చెర‌లో ఉన్న బందీల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కోరుతున్నామ‌ని.. ఆ ప్రాంతంలో శాంతి కోసం తీసుకునే చ‌ర్య‌ల‌కైనా భార‌త్ మ‌ద్ద‌తు ఉంటుందని స్ప‌ష్టం చేశారు. పాల‌స్తీనా, ఇజ్రాయెల్ సంక్షోభానికి సంబంధించి రెండు దేశాల సిద్ధాంతానికి భార‌త్ క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. మ‌రోవైపు ఈ తీర్మానికి జ‌న‌ర‌ల్ అసెంబ్లీ మ‌ద్ద‌తు ల‌భించింది. తీర్మానానికి అనుకూలంగా 120, వ్యతిరేకంగా 14 ఓట్లు రాగా.. 45 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.

Latest News