Site icon vidhaatha

ఈ ఏడాది వరల్డ్‌ ప్రెస్‌ ఫొటో అవార్డుకు ఎంపికైన‌ చిత్రమిదే!

ఒక్క దృశ్యం వెయ్యి పదాలు మాట్లాడుతుందని పత్రికారంగ పెద్దలు చెబుతుంటారు. ఒక వార్త కంటే కొన్నిసార్లు కొన్ని చిత్రాలు మనసులో నాటుకుపోతాయి. గుండెను తాకుతాయి. కండ్లను తడి చేస్తాయి. చాలా మంది ఫొటోలు తీస్తుంటారు. కానీ.. కొన్నే ప్రపంచ ఖ్యాతిని పొందుతాయి. అలాంటి గొప్ప ఫొటోలను వడకట్టి ‘వరల్డ్‌ ప్రెస్‌ ఫోటో’ కింద ఏటా ఎంపిక చేస్తుంటారు. అలా 2024 వరల్డ్‌ ప్రెస్‌ ఫొటో అవార్డు రాయిటర్స్‌కు చెందిన ఫొటోగ్రాఫర్‌ మహ్మద్‌ సలీం తీసిన ఫొటోకు దక్కింది. పాలస్తీనా ఆవాసాలపై ఇజ్రాయెల్‌ జరిపిన బాంబు దాడుల్లో వేల మంది చనిపోయారు. ఇప్పటికీ అక్కడ సంఘర్షణ కొనసాగుతూనే ఉన్నది. 2023 అక్టోబర్ 17వ తేదీన మహ్మద్‌ సలీం.. గాజాలోని ఖాన్‌ యూనిస్‌లోని నాసర్‌ హాస్పిటల్‌లో ఈ చిత్రాన్ని తీశారు.

బాంబు దాడుల్లో చనిపోయిన తమవారి జాడ కోసం అనేక కుటుంబాలు అక్కడ వెతుకుతున్న సమయంలో అబు మాబర్‌ అనే 36 ఏళ్ల పాలస్తీనా మహిళ తన ఐదేళ్ల మేనకోడలు సాలే శవాన్ని గుర్తుపట్టి ఉద్వేగంతో అక్కున చేర్చుకున్నప్పుడు అక్కడ ఉన్న సలీం దాన్ని తన కెమెరాలో బంధించారు. పాలస్తీనా ఎదుర్కొంటున్న గుండెకోతను ఆ చిత్రం పట్టిచూపుతున్నది. తెల్లని వస్త్రంలో చుట్టి ఉన్న చిన్నారి మృతదేహాన్ని హత్తుకుని ఆ మహిళ విలపిస్తున్నది. 39 ఏళ్ల పాలస్తీనియన్‌ అయిన సలీం.. 2003 నుంచి రాయిటర్స్‌ సంస్థకు ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఊహించని లోటును భావగర్భితంగా, కళాత్మకంగా పూర్తి గౌరవం, బాధతో ఈ ఫొటోను కంపోజ్‌ చేసినట్టు వరల్డ్‌ ప్రెస్‌ ఫొటో 2024 జ్యూరీ పేర్కొన్నది. గాజా స్ట్రిప్‌లో ఏం జరుగుతున్నదో స్థూలంగా అర్థం చేసుకునేందుకు ఈ ఫొటో దోహదపడుతుందని తాను భావిస్తున్నట్టు అవార్డుకు ఎంపికైన సలీం చెప్పారు.

Exit mobile version