మానవతా సంక్షోభం ఎదుట గాజా.. 24 గంటల్లో గాజా వదిలి పోవాలన్న ఇజ్రాయెల్‌

  • Publish Date - October 13, 2023 / 10:13 AM IST

  • పది లక్షల మంది భవితవ్యానికి ముప్పు
  • గాజాలో ప్రవేశించనున్న ఇజ్రాయెల్‌ దళాలు
  • విధ్వంసక పర్యవసానాలు ఎదురవుతాయన్న ఐరాస
  • దిగ్బంధాన్ని తక్షణమే ఉపసంహరించాలని
  • ఇజ్రాయెల్‌కు ఐరాస ప్రతినిధి సూచన
  • తిరస్కరించిన ఇజ్రాయెల్‌ దౌత్యవేత్తలు
  • ఉభయ దేశాల్లో 2800కు చేరుకున్న మరణాలు



గాజా/టెల్‌ అవీవ్‌: పాలస్తీనాలోని గాజాస్ట్రిప్‌ పెను మానవతా విపత్తు ముంగిట నిలిచింది. ఇజ్రాయెల్‌, హమాస్‌ తీవ్రవాదుల మధ్య జరుగుతున్న సాయుధ ఘర్షణ ఆరో రోజుకు చేరుకున్నది. ఈ దాడుల్లో ఇప్పటి వరకూ చనిపోయిన వారి సంఖ్య 2800 దాటింది. మరోవైపు గాజాస్ట్రిప్‌లోకి పదాతి దళాలను పంపేందుకు ఇజ్రాయెల్‌ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అక్కడి దాదాపు పది లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ఇజ్రాయెల్‌ హెచ్చరించింది.


హమాస్‌ దళాలను అణచివేస్తామని, ప్రతి ఒక్క హమాస్‌ తీవ్రవాదిని అంతమొదిస్తామని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహూ ప్రకటన చేసిన నేపథ్యంలో తాజా హెచ్చరికలు వెలువడటం గమనార్హం. హమాస్‌ తీవ్రవాదులు దాదాపు 150 మంది ఇజ్రాయెల్‌ పౌరులను బందీలుగా పట్టుకున్నారు. వారిని విడుదల చేసేంత వరకూ తమ దిగ్బంధాన్ని విరమించేది లేదని ఇజ్రాయెల్‌ స్పష్టం చేస్తున్నది.


ఈ నేపథ్యంలో శుక్రవారం ఇజ్రాయెల్‌ మిలిటరీ ఒక ప్రకటన చేస్తూ.. ఉత్తర గాజాలో ఉంటున్న దాదాపు 11 లక్షల మంది పౌరులు వెంటనే ఖాళీ చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని హెచ్చరికలు జారీ చేసింది. ఇది అసాధ్యమైన ఆదేశమని, వినాశకర పరిణామాలు తప్పవని ఐరాస ప్రతినిధి స్టీఫెన్‌ డ్యూజర్రిక్‌ అన్నారు. గాజా స్ట్రిప్‌పై దాడిని సమర్థించుకునే కోణంలో ఇజ్రాయెల్‌.. పౌరులు, చిన్నపిల్లల శవాల గుట్టల ఫొటోలను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌, నాటో రక్షణ మంత్రులకు పంపింది.

 


కాగా.. వీరంతా హమాస్‌ దాడుల్లో చనిపోయినవారేనని పేర్కొన్నది. గాజాలోకి చొరబడేందుకు ఇజ్రాయెల్‌ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతం తీవ్ర మానవతా సంక్షోభం ఎదుట నిలిచింది. ఇప్పటికే ఇక్కడ చనిపోయిన వారి సంఖ్య 1500 దాటింది. నిత్యాసర వస్తువులు అందుబాటులో లేకుండా పోయాయి. ఈ పరిస్థితుల్లో పదకొండు లక్షల మంది గాజాని వదిలి పోవాల్సివస్తే వారికి ఎదురయ్యే పర్యవసానాలను ఊహించుకోవచ్చు.


గాజాలోని శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్‌ దాడులు


ఒకవైపు 24 గంటల వ్యవధిలోనే ఖాళీ చేయాలని ఆదేశిస్తున్న ఇజ్రాయెల్‌.. మరోవైపు గాజా స్ట్రిప్‌లో నడుస్తున్న శరణార్థి శిబిరాలపై వైమానిక దాడులు చేస్తూ వాటిని నాశనం చేస్తున్నది. తమ దేశంపైకి మిసైళ్లు వేసి 1300 మంది మరణానికి కారణమైన హమాస్‌ చర్యలకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌.. ఈ దాడులకు పాల్పడుతున్నది. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు సహా 1500 మందికిపైగా చనిపోయారు.


దిగ్బంధం ఆపకుంటే మరిన్ని మార్గాల్లో యుద్ధం


పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ బాంబు దాడులను ఆపకపోతే.. ఇతర మార్గాల్లో యుద్ధం మొదలయ్యే అవకాశం ఉన్నదని ఇరాక్‌లోని ఐరాస మిషన్‌ హెచ్చరించింది. హమాస్‌ దాడుల్లో తమ జోక్యం ఏమీ లేదని ఇరాన్‌ చెబుతున్నది. గురువారం నాటి లెక్కల ప్రకారం గాజా స్ట్రిప్‌పై ప్రతి 30 క్షణాలకు ఒక బాంబు దాడి జరుగుతున్నదని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది. శనివారం నుంచి దాదాపు నాలుగు వేల టన్నుల బరువున్న పేలుడు పదార్థాలతో కూడిన ఆరువేల బాంబులను గాజాస్ట్రిప్‌పై ప్రయోగించినట్టు ఇజ్రాయెల్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.


హమాస్‌ ఆధీనంలో ఉన్న గాజాస్ట్రిప్‌లో చొరబడేందుకు ఇజ్రాయెల్‌ ప్రయత్నాల్లో ఉన్నదన్న ఊహాగానాల నేపథ్యంలో తాజాగా పదకొండు లక్షల మందిని ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేసినట్టు ఐరాసకు వెల్లడింది. అయితే.. విధ్వంసకర పర్యవసానాలకు దారి తీసే ఈ ఆదేశాలను సత్వరమే ఉపసంహరించుకోవాలని ఇజ్రాయెల్‌ ప్రభుత్వాన్ని ఐరాస కోరింది.


అయితే.. ఇజ్రాయెల్‌ ముందస్తు హెచ్చరికలపై ఐరాస స్పందన అవమానకరమైనదని ఐరాసలో ఆ దేశ ప్రతినిధి గిలాడ్‌ ఎర్డాన్‌ అభివర్ణించారు. తమకు సలహా ఇవ్వడం బదులు.. హమాస్‌ చర్యలను ఖండించడం, ఇజ్రాయెల్‌ స్వరక్షణకు ఉన్న హక్కుకు మద్దతు ఇవ్వడంపై దృష్టిసారించాలని సూచించారు. హమాస్‌ ఆకస్మిక దాడుల నేపథ్యంలో గాజా సమీపానికి దాదాపు 3.60 లక్షల రిజర్వ్‌ సైన్యాన్ని తరలించింది. సమీప ప్రాంతాల్లోని వేలమందిని అక్కడి నుంచి ఖాళీ చేయించింది. యుద్ధానికి మార్గదర్శనం చేసేందుకు ఇజ్రాయెల్‌ ఇప్పటికే ఒక వార్‌ క్యాబినెట్‌ను ఏర్పాటు చేసింది.


యుద్ధం ఆపండి


యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో చిక్కుకుపోయిన సాధారణ పౌరుల రక్షణ కోసం ఉభయ పక్షాలు సత్వరమే కాల్పులు విరమించాలని అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచ నాయకులు పిలుపునిస్తున్నారు. గాజా, వెస్ట్‌బ్యాంక్‌లోని ప్రజల తక్షణ అవసరాలు తీర్చేందుకు 294 మిలియన్‌ డాలర్ల సేకరణకు ఐక్య రాజ్య సమితి పిలుపునిచ్చింది. ఈ ప్రాంతాల నుంచి ఇప్పటికే 4 లక్షల మంది నిరాశ్రయులయ్యారని పేర్కొన్నది.


ఇజ్రాయెల్‌ నుంచి భారత్‌ చేరుకున్న 230 మంది


ఆపరేషన్‌ అజయ్‌ పేరిట చేపట్టిన ప్రజల తరలింపులో శుక్రవారం ఉదయం 230 మంది భారతీయులు ఇజ్రాయెల్‌ నుంచి స్వదేశానికి చేరుకున్నారు. యుద్ధం మొదలైన తర్వాత భారత్‌కు వచ్చిన తొలి బృందం ఇది.


నీళ్లు, అన్నం దొరకొద్దు.. గాజాపై యుద్ధంలో ఇజ్రాయెల్‌ తీరిది!



గాజా స్ట్రిప్‌పై నిరవధిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ దళాలు.. ప్రధానంగా విద్యుత్తు, ఇంధనం, నీరు, ఆహార సరఫరా వ్యవస్థలను ప్రధాన లక్ష్యంగా చేసుకుంటున్నాయి. హమాస్‌ బంధించిన 150 మందిని విడిచిపెట్టేంత వరకూ గాజాలో విద్యుత్తు, మంచినీరు, ఇంధన లేదా మానవతా సహాయం అందించేందుకు అనుమతించేది లేదని ఇజ్రాయెల్‌ ఇంధన వనరుల శాఖ మంత్రి ఇజ్రాయెల్‌కర్ట్జ్‌ స్పష్టం చేశారు. ఈజిప్టు వైపు నుంచి గాజాకు అందిస్తున్న మానవతా సహాయాన్ని ఇజ్రాయెల్‌ అడ్డుకుంటున్నదని పలు అంతర్జాతీయ సహాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. 


వైట్‌ఫాస్పరస్‌ వాడుతున్న ఇజ్రాయెల్‌?


గాజా, లెబనాన్‌పై బాంబుదాడుల్లో వైట్‌ఫాస్పరస్‌ను ఇజ్రాయెల్‌ దళాలు వాడుతున్నాయని, వాటివల్ల ప్రజలు దీర్ఘకాలిక రోగాల బారిన పడతారని పలు మానవ హక్కుల సంఘాలు శుక్రవారం ఆరోపించాయి.

Latest News