- గాజాలోకి సాయాన్ని అనుమతించాలి
విధాత: ఒట్టావా: గాజా స్ట్రిప్‌లోనికి మానవతా సహాయం అందించేందుకు అవకాశం కల్పించాలని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రుడో పిలుపునిచ్చారు. అక్కడ దాదాపు 23 లక్షల మంది సహాయం కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. దీన స్థితిలో ఉన్న వారిని కాపాడేంఉదకు అవకాశం ఇవ్వాలని అన్నారు. యుద్ధానికి సైతం కొన్ని నియమాలు ఉంటాయని గుర్తు చేశారు. ఇజ్రాయెల్ జరుపుతున్న బాంబు దాడుల్లో ఇప్పటి వరకూ 2800 మందికిపైగా చనిపోయారని, వారిలో చిన్నారులే అధిక సంఖ్యలో ఉన్నారని గాజా అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ దాడుల్లో పదివేలకుపైగా గాయపడ్డారని తెలిపారు. గగన తల దాడులతోపాటు.. ఉపరితల దాడులకు సైతం ఇజ్రాయెల్ సైన్యం సిద్ధపడుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పార్లమెంటు దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్‌లో జస్టిన్ ట్రుడో మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా తనను తాను రక్షించుకునేందుకు ఉన్న హక్కును తాము సమర్థిస్తున్నామని అన్నారు. కానీ.. యుద్ధాలకు సైతం కొన్ని నియమాలు ఉంటాయని చెప్పారు. గాజాలోకి మానవతా సహాయాన్ని ఎలాంటి అడ్డంకులూ లేకుండా పంపాలని కెనడా కోరుతున్నదని అన్నారు. అత్యవసరమైన ఆహారం, మంచినీరు, ఇంధనం, వంటివి గాజా పౌరులకు అందేలా ఒక హ్యుమానేటిరియన్ కారిడార్‌ను నెలకొల్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ఉగ్రవాదం ఎన్నటికీ సమర్థనీయం కాదని అన్నారు. హమాస్ ఉగ్రవాద చర్యలను ఏ మాత్రం సమర్థించేది లేదని చెప్పారు. హమాస్.. పాలస్తీనా పౌరులకుగానీ, వారి చట్టబద్ధమైన ఆకాంక్షలకు గానీ ప్రతినిధి కాని స్పష్టం చేశారు.