TS Media Accreditation Rules Row | మంత్రి పొంగులేటి చుట్టూ అక్రెడిటేషన్ వివాదం…

తెలంగాణ జర్నలిస్టులకు అక్రెడిటేషన్‌ కార్డులు జారీ చేసే విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చుట్టూ వివాదం ముసుకుంటున్నది. మంత్రి ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారా? ఈ వివాదాన్ని మరింతగా రాజేయాలని చూస్తున్నారా? అనే అనుమానాలు సచివాలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వివాదంతో నిండా మునిగేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బద్నాం అయ్యేది కాంగ్రెస్ పార్టీ అని జర్నలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు.

విధాత, హైదరాబాద్‌ :
TS Media Accreditation Rules Row| జర్నలిస్టులు అక్రెడిటేషన్ కార్డుల జారీకి పెట్టిన కఠిన నిబంధనలపై గొంతెత్తుతున్నా తెలంగాణ సమాచార, పౌర సంబంధాల విభాగం ఉన్నతాధికారులు, తెలంగాణ మీడియా అకాడెమీ చైర్మన్‌ తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగైదు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులు ఆగ్రహంతో ఉన్నారు. అక్రెడిటేషన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు రూపొందించిన మాడ్యూల్‌లోనే సవాలక్ష సమస్యలు ఉన్నాయని ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకొనే నాథుడే లేడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వందల కొద్దీ ఫిర్యాదులు వస్తున్నా తెలంగాణ ఐ అండ్ పీఆర్ విభాగం ఏమాత్రం ఖాతరు చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గట్టిగా నిలదీస్తే పై నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తే ఆ ప్రకారంగా పనిచేస్తున్నామంటూ.. పరోక్షంగా సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైపు వేళ్లు చూపుతున్నారు. మంత్రి కూడా ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారా? ఈ వివాదాన్ని మరింతగా రాజేయాలని చూస్తున్నారా? అనే అనుమానాలు సచివాలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వివాదంతో నిండా మునిగేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాగా, బద్నాం అయ్యేది కాంగ్రెస్ పార్టీ అని జర్నలిస్టులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

మంత్రి సూచన మేరకేనా?

మీడియా అక్రెడిటేషన్ కార్డుల జారీ కోసం సమాచార, పౌర సంబంధాల విభాగం జీవోలు, మార్గదర్శకాలు జారీ చేసింది. దీనికి ముందు సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమారు 30 సార్లు ఐ అండ్ పీఆర్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారని అధికారవర్గాలు చెబుతున్నాయి. పలుమార్లు జరిగిన ఈ భేటీలో ఏం చర్చించారనే బయటకు రాకున్నప్పటికీ… మంత్రి సూచన మేరకే నిబంధనలు కఠినంగా రూపొందించారనే సుస్పష్టమవుతుందని జర్నలిస్టు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇన్నిసార్లు సమావేశం జరిగిన తరువాత కూడా మరింత జటిలంగా నిబంధనలు పొందుపరిచారంటే, మంత్రి ఆదేశం లేకుండా జరగదనేది జర్నలిస్టుల వాదన. ఒక మహిళా అధికారి ఈ కఠిన నిబంధనల రూపకల్పనకు పూనుకున్నారని, ఆమెకు సర్వాధికారాలు ఇచ్చారనే ప్రచారం ఐ అండ్ పీఆర్ వర్గాల అంతర్గత సంభాషణల్లో వినిపిస్తున్నది. జీవో జారీకి ముందు ఆమెతో మంత్రి రెండు మూడుసార్లు ప్రత్యేకంగా అయి భేటీ అమలుకు సాధ్యంకాని నిబంధనలు ఖరారు చేశారనే వార్తలు వినవస్తున్నాయి. ఇవేమీ నిబంధనలు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు గొంతెత్తున్నారు.

చేతులెత్తేసిన ప్రెస్‌ అకాడమీ చెర్మన్‌

ఈ నిబంధనలపై పలువురు జర్నలిస్టులు తెలంగాణ మీడియా అకాడెమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డిని కలిసి విన్నవించగా, తానేమీ చేయలేనంటూ నిస్సహాయతను వ్యక్తం చేశారని సమాచారం. తాను చెప్పినా వినడం లేదని, తన పదవీ కాలం అయిపోతున్నదని జర్నలిస్టుల ఆయన వాపోయారని తెలిసింది. ఐ అండ్ పీఆర్ అధికారులు, ప్రభుత్వం కలిసే ఈ పని చేస్తున్నాయని, ఇందులో తన ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఐ అండ్ పీఆర్ అధికారులను కలిసి అడిగితే, సచివాలయం నుంచి ఆదేశాలు వచ్చాయని, వాటిని అమలు చేయడం తప్ప మరేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. పైగా.. ప్రభుత్వం చెప్పినట్లు చేయాలి కదా… అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైపు వేళ్లు చూపిస్తుండటం జర్నలిస్టులను మరింత ఆగ్రహానికి గురి చేస్తున్నది. ఈ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలించిన జర్నలిస్టు వర్గాలు మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు లేకుండా ఇదంతా జరుగదని, ఆయనే ఉద్ధేశపూర్వకంగానే చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పట్టింపులేకుండా వ్యవహరించడం జర్నలిస్టు సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది.

అసలు తప్ప అన్నీ మాట్లాడారు…

నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడెమీలో శుక్రవారం ఐ అండ్ పీఆర్ డీపీఆర్వో లకు మీడియా అక్రెడిటేషన్ కార్డుల జారీ, జిల్లా మీడియా కమిటీల ఏర్పాటుపై సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ చెక్క ప్రియాంక హాజరై ప్రసంగించారు. వారం రోజులలో జిల్లా మీడియా కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు తప్ప కీలకమైన ఆన్‌లైన్‌ అప్లికేషన్ మాడ్యూల్‌పై ఎలాంటి చర్చ జరగలేదని సమాచారం. జీవో ప్రకారం ముందుకు వెళ్లాలని ఆమె స్పష్టం చేశారని తెలిసింది. కీలకమైన ఈ అంశాన్ని ప్రస్తావించకుండా మిగతా అంశాలను ప్రస్తావించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి..

Media Accreditation Controversy  | జటిలంగా తెలంగాణ అక్రెడిటేషన్ అప్లికేషన్ మాడ్యుల్.. అరిగోస పడుతున్న జర్నలిస్టులు
Communist Manifesto | కమ్యూనిస్టు మ్యానిఫెస్టో… పెట్టుబడిదారీ సమాజాన్ని ఇప్పటికీ భయపెడుతున్న ‘పిశాచం’
New Chief Secretary Race | తెలంగాణ తదుపరి సీఎస్‌ ఎవరో? రేస్‌లో ఐదుగురు ఐఏఎస్‌లు…

Latest News