మరోసారి వైమానిక దాడులు..
విధాత:కాల్పుల విరమణ ఒప్పందం జరిగి నెల రోజులు కూడా పూర్తికాకుండానే మరోసారి గాజా బాంబుల మోతతో దద్దరిల్లింది. బుధవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ వాయుసేనకు చెందిన విమానాలు గాజాలోని ఖాన్ యూనిస్ అనే ప్రదేశంపై దాడులు చేశాయి. ప్రమాదకర పదార్థాలతో నింపిన బెలున్లను గాజా నుంచి వదులుతున్నారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ పేర్కొంది. ఈ బెలున్ల కారణంగా దేశంలోని పలు చోట్ల నిప్పు అంటుకొందని వెల్లడించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఫైర్ సర్వీస్ కూడా ధ్రువీకరించింది. 20 అగ్నిప్రమాద ఘటనలు చోటు చేసుకొన్నట్లు పేర్కొంది.
హమాస్ కార్యకలాపాలు నిర్వహిస్తోందన్న అనుమానంతో ఖాన్ యూనిస్‌పై ఇజ్రాయెల్ విమానాలు బాంబులు కురిపించాయి. ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నట్లు ఇజ్రాయెల్ దళాలు పేర్కొన్నాయి. ఇక ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడిన వారి వివరాలు మాత్రం తెలియలేదు. ఈ దాడులపై హమాస్ ప్రతినిధి మాట్లాడుతూ ‘‘జెరూసలెంలోని పవిత్ర ప్రదేశాల్లో హక్కును కాపాడుకోవడానికి ప్రతిఘటన కొనసాగిస్తాం’’ అని పేర్కొన్నారు. మే 21 తర్వాత జరిగిన హింసాత్మక ఘటన.