విధాత: ఇళ్లలో వంట గ్యాస్ సిలిండర్ లు పేలుతు తరుచు ప్రమాదాలకు కారణమవుండటం సాధారణంగా చూస్తుంటాం. అయితే గృహోపకరణాలుగా వినియోగించే గీజర్లు, రిఫ్రిజరిటేర్, ఓవెన్లు, హెయిర్ డ్రైయ్యర్లు సైతం పేలుతూ జనాన్ని భయపెడుతున్నాయి. తాజాగా సనత్ నగర్ పీఎస్ పరిధిలోని రాజరాజేశ్వరి నగర్ లో ఓ ఇంట్లో రిఫ్రిజిరేటర్ పేలిన ఘటన కలకలం రేపింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే రిఫ్రిజరేటర్ పేలడంతో చెలరేగిన మంటలకు ఇంట్లోని సామగ్రి పూర్తిగా దగ్దమైంది.
గురువారం ఉదయం రాజరాజేశ్వరి నగర్‌కు చెందిన సత్యనారాయణ నివాసంలో భారీ శబ్ధంతో ఫ్రిజ్ పేలింది. సమాచారం అందుకున్న హైడ్రా, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.