Coffin Homes | హాకాంగ్ (Hong Kong).. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల్లో ఒకటి. అంతేకాదు, ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక, పర్యాటక కేంద్రాల్లో ఈ నగరం ఒకటిగా నిలిచింది. నగరంలో ఎక్కడ చూసినా కళ్లు చెదిరే భవంతులు, అద్దాల మేడలు, ఆకాశహర్మ్యాలే దర్శనమిస్తాయి. లగ్జరీ కార్లు నగర రోడ్లపై తిరుగుతుంటాయి. హాంకాంగ్ ఆకాశహర్మ్యాలు ఆ నగర సంపన్నతను చాటిచెబుతాయి. కానీ, అక్కడి వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయి. ఆ అద్దాల మేడల వెనక దాగి ఉన్న వాస్తవం ఎవరికీ కనిపించదు.
నగర సంపదలో అధిక భాగం అతికొద్ది మంది ధనవంతుల చేతుల్లోనే ఉంటుంది. అక్కడ ధనవంతులు మాత్రం లగ్జరీ లైఫ్‌ను లీడ్ చేస్తుంటే.. పేదలు మాత్రం అత్యంత దారుణ పరిస్థితుల్లో బతుకునీడుస్తున్నారు. ఇరుకైన గదుల్లో జీవనం సాగిస్తున్నారు. లక్షలాది మంది ప్రజలు నిలబడటానికి కూడా వీలులేని అతి చిన్న గదుల్లో నివసిస్తున్నారు. ఆ గదుల్లో కనీసం చేతులు చాచాలన్నా, అటు ఇటు తిరగాలన్నా శరీరాన్ని మెలితిప్పాల్సిందే.
అద్దె రూ.40 వేలు
హాంకాంగ్‌లో ఇళ్ల ధరలు, అద్దెలు ప్రపంచంలోకెల్లా అత్యధికం. నిత్యావసర వస్తువుల ధరలు పెట్రోల్, ఆహార పదార్థాలు, కాఫీ, ఇతర నిత్యావసర ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. అక్కడ పేదల జీవన వ్యయం చాలా ఎక్కువ. చిన్న గదులకే వేలల్లో అద్దె కట్టాల్సి ఉంటుంది. కేవలం 16 చదరపు అడుగుల విస్తీర్ణంలో (16-Square-Foot House) ఉండే గదుల్లో నివసిస్తుంటారు. ఆ గది నెల అద్దె రూ.40 వేలు ఉండటం గమనార్హం. ఆ గదుల్ని ‘కాఫిన్ హోమ్స్స (Coffin Homes) (శవపేటిక ఇళ్లు) అని పిలుస్తారు.
800 చదరపు అడుగుల ఫ్లాట్‌లో 30 గదులు..
800 చదరపు అడుగుల ఫ్లాట్‌ను 20 నుంచి 30 చిన్న గదులుగా విభజించి అద్దెకు ఇస్తుంటారు. అంటే ఒక్కో గది 16 చదరపు అడుగులు ఉంటుంది. ఆ గదులు అచ్చు శవపేటికలా కనిపిస్తాయి. అందుకే వాటిని కాఫిన్ హోమ్స్ అని పిలుస్తారు. ఆ గదిలో మంచం వేస్తే ఇంకేమీ సరిపోదు. నిలబడటానికి కూడా ప్లేస్ ఉండదు. అలాంటిది చాలా మంది నిరుపేదలు ఆ గదుల్లోనే జీవనం సాగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వంట చేసుకునే పరిస్థితి కూడా ఉండదు. అంత దుర్భర జీవితం గడుపుతున్నారు. 2026 నాటికి హాంకాంగ్ జనాభా సుమారు 73.8 లక్షలు. అందులో దాదాపు 2 లక్షల మందికిపైగా ప్రజలు ఇలాంటి కాఫిన్ హోమ్స్‌లోనే నివసిస్తుండటం గమనార్హం.
కాఫిన్ హోమ్స్ అంటే ఏమిటి..?
సాధారణంగా ఓ అపార్ట్‌మెంట్‌ను చిన్నిచిన్న గదుల్లా విభజిస్తారు. ఆ గదులను ఇనుప గ్రిల్స్, ఫ్లైవుట్ ముక్కలతో చిన్నచిన్న గదుల్లా మారుస్తారు. ఈ గదుల పరిమాణం సుమారు 15 నుంచి 20 చదరపు అడుగుల్లోపే ఉంటుంది. అంటే ఒక మనిషి పడుకోవడానికి మాత్రమే వీలుంటుంది. అందులోనే వంట గది, పడక గది, స్టోరేజ్ ఉంటాయి. కొన్ని సార్లు టాయిలెట్ వంట గది పక్కనే ఉండటం గమనార్హం.
ఎందుకు ఈ పరిస్థితి..?
హాంకాంగ్ ప్రపంచ ఆర్థిక కేంద్రంగా ఉన్నప్పటికీ.. 75 మంది వ్యక్తులు మాత్రమే నగర సంపదలో సుమారు 10 శాతాన్ని నియంత్రిస్తున్నారు. సాధారణ ప్రాంతాల్లో కూడా అపార్ట్‌మెంట్ల ధరలు మిలియన్ డాలర్లకు పైగా ఉంటాయి. ఒక సాధారణ బెడ్‌రూమ్ ఫ్లాట్ అద్దెనే నెలకు 4,000 డాలర్ల వరకు ఉంటుంది. దీంతో అక్కడ సామాన్యులకు ఇల్లు దొరకడం గగనం. చిన్ని ఉద్యోగం చేసేవారికి ఫ్లాట్ అద్దెకు తీసుకోవడం సాధ్యం కాదు. అందుకే ఇలా కాఫిన్ హెమ్స్‌లో జీవితాన్ని నెట్టుకొస్తుంటారు.
ఆ ఇరుకైన గదుల్లో గాలి వెలుతురు సరిగ్గా ఉండదు. ఫలితంగా ప్రజలు తీవరమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటారు. శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. అంతేకాదు ఎప్పుడూ ఇరుకైన చోట ఉండటం వల్ల ప్రజలు తీవ్రమైన మానసిక వేదనకు గురవుతుంటారు.
ఇవి కూడా చదవండి :
Dhoni Farm | 38 ఎకరాల్లో ధోనీ టమాటా సాగు.. అది కూడా ఆర్గానిక్ పద్ధతుల్లో
Gold, Silver Rate Today| తగ్గిన బంగారం..స్థిరంగా వెండి ధరలు
