ఆరో రోజుకు ఇజ్రాయెల్ – హ‌మాస్ యుద్ధం.. 4 వేల‌కు చేరిన మృతుల సంఖ్య‌

  • Publish Date - October 12, 2023 / 07:54 AM IST

  • రేపు అత్య‌వ‌స‌రంగా స‌మావేశం కానున్న యూఎన్ భ‌ద్రతా మండ‌లి
  • వైర‌ల‌వుతున్న హ‌మాస్ క‌మాండ‌ర్ పాత వీడియో
  • త్వ‌ర‌లోనే ప్ర‌పంచ‌మంతా త‌మ రాజ్య‌మేన‌ని అందులో వెల్ల‌డి


ఇజ్రాయెల్ – హ‌మాస్ (Israel Hamas Conflict) ఉగ్ర‌వాదుల మ‌ధ్య ఆరోరోజూ పోరాటం ఉధృతంగా కొన‌సాగుతోంది. గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు పెర‌గ‌డంతో అక్క‌డి ఉగ్ర‌వాదుల ప్రాణాల‌తో పాటు సామాన్యుల ప్రాణాలూ గాలిలో క‌లిసిపోతున్నాయి. మొత్తంగా ఇరువైపులా ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం 4000 మంది చ‌నిపోయి ఉంటార‌ని అంత‌ర్జాతీయ మీడియా అంచ‌నా వేస్తోంది. పాల‌స్తీనియ‌న్ అధికారుల లెక్క‌ల ప్ర‌కారం గాజాలో ఇప్ప‌టి వ‌ర‌కు 1200 మంది ప్రాణాలు కోల్పోగా 3,40,000 మంది ప్ర‌జ‌లు వ‌ల‌స బాట ప‌ట్టారు. ఇటు ఇజ్రాయెల్‌పైనా హ‌మాస్ రాకెట్ దాడులు కొన‌సాగుతున్నాయి. నిత్యం ఏదో ఒక న‌గ‌రంలో రాకెట్ అలెర్ట్‌లు మోగుతుండ‌టంతో ప్ర‌జ‌లు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు.


అయితే తాము ఎన్ని రాకెట్ల‌ను అడ్డుకున్నామ‌నేది ప్ర‌క‌టించ‌బోమ‌ని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఆ వివ‌రాలు ఉగ్ర‌వాదుల‌కే ఉపయోగ‌ప‌డ‌తాయ‌ని అభిప్రాయ‌ప‌డింది. త‌మ వైపు 1300 మంది ప్రాణాలు కోల్పోయార‌ని తెలిపింది. మ‌రోవైపు ఈ సంక్షోభంపై చ‌ర్చించ‌డానికి ఐరాస భ‌ద్రతా మండ‌లి శుక్ర‌వారం స‌మావేశం కానుంది. ప్ర‌స్తుతం దీనికి నేతృత్వం వ‌హిస్తున్న బ్రెజిల్ పిలుపుతో ఈ స‌మావేశం జ‌రుగుతుంది. మ‌రోవైపు ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజిమ‌న్ నెత‌న్యాహూపై అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శ‌త్రువుల కుయుక్తుల‌కు త‌గ్గ‌ట్టు ఇజ్రాయెల్ ప్ర‌ణాళిక‌లు లేవ‌ని విమ‌ర్శించారు.


ఈ దాడికి నెత‌న్యాహూ బాగా దెబ్బ‌తిని ఉంటార‌ని వ్యాఖ్యానించారు. అదే త‌న హ‌యాంలో అయితే ఇజ్రాయెల్ ఇలాంటి ప‌రిస్థితుల‌కు స‌న్న‌ద్ధ‌మ‌య్యే అవ‌కాశ‌మే వ‌చ్చి ఉండేది కాద‌ని పేర్కొన్నారు. హ‌మాస్ ఉగ్ర‌వాదులు చిన్న‌పిల్ల‌ల త‌ల‌లు న‌రికేస్తున్న చిత్రాలు చూస్తుంటే.. చెడు శక్తి ఈ భూమ్మీద ఏ స్థాయిలో విరుచుకుప‌డుతోందో అర్థ‌మ‌వుతోంద‌ని అమెరికా అధ్య‌క్షుడు బైడెన్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. దీనిపై హ‌మాస్ రాజ‌కీయ విభాగం విమ‌ర్శ‌లు గుప్పించింది. ఇజ్రాయెల్ యుద్ధ నేరాల‌ను క‌ప్పిపుచ్చ‌డానికే బైడెన్ ఇలా మాట్లాడుతున్నార‌ని పేర్కొంది. అయితే బైడెన్ వ్యాఖ్య‌ల‌పై వైట్‌హౌస్ మ‌రో ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.


బైడెన్ అటువంటి ఫొటోలు ఏమీ చూడ‌లేద‌ని, ఇజ్రాయెల్ నివేదిక‌ల ఆధారంగా ఆయ‌న అలా మాట్లాడార‌ని తెలిపింది. ఈ యుద్ధంతో ప్ర‌పంచం దృష్టంతా హ‌మాస్‌పై ప‌డింది. దీంతో ఈ ఉగ్ర‌వాద ముఠా గురించి అంద‌రూ ఆరా తీస్తున్నారు. ఈ క్ర‌మంలో 2022 డిసెంబ‌రులో హ‌మాస్ క‌మాండ‌ర్ మ‌హ‌మ్మ‌ద్ అల్ జాహ‌ర్ ఇంట‌ర్వ్యూ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అందులో అత‌డు ‘ఇజ్రాయెల్ మా తొలి ల‌క్ష్యం మాత్ర‌మే. త్వ‌రలోనే ప్ర‌పంచం మొత్తం మా కాళ్ల కింద‌కు వ‌స్తుంది. అదే మా అంతిమ ల‌క్ష్యం’ అని చెప్పిన‌ట్లు ఉంది. ఈ వీడియోపై నెటిజ‌న్లు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు.

Latest News